University Faculties Recruitment: తెలంగాణలోని యూనివర్సిటీల్లో టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీని సాధ్యమైనంత త్వరలగా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు (CRB) సంబంధించిన బిల్లును గత ప్రభుత్వం గవర్నర్‌కు పంపడం...గవర్నర్ దాన్ని రాష్ట్రపతికి పంపిన నేపథ్యంలో గవర్నర్ తమిళిసైతో మాట్లాడి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో విద్యాశాఖ ఈ అంశంపై దృష్టి సారించింది. కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆమోదంపై తాజా పరిస్థితిని తెలుసుకొని...ఒకవేళ దాని ఆమోదం ఆలస్యమైతే పాత విధానంలోనే వర్సిటీల వారీగా నియామకాలు జరపాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఉమ్మడి బోర్డు ద్వారా ఆచార్యుల నియామకాలు చేపట్టాలని 2022 సెప్టెంబరులో అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి గవర్నర్ ఆమోదానికి పంపారు. ఆ తర్వాత దాన్ని రాష్ట్రపతి పరిశీలనకు గవర్నర్ పంపారు. గతేడాది మరోసారి అసెంబ్లీలో బిల్లును ఆమోదించి గవర్నర్‌కు పంపినా ఆమోదం లభించలేదు. రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలో 11 విశ్వవిద్యాలయాలుండగా 2,825 మంజూరు బోధనా సిబ్బంది పోస్టులకుగాను కేవలం 850 మందే పనిచేస్తున్నారు.
పాతపద్ధతిలోనే వర్సిటీ నియామకాలు..
రాష్ట్రంలోని 15 విశ్వవిద్యాలయాల్లో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి తలపెట్టిన ‘ది తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లు’ను కాంగ్రెస్ ప్రభుత్వం ఉపసంహరించుకోనుంది. పాత పద్ధతిలోనే వర్సిటీ రిక్రూట్‌మెంట్లు నిర్వహించాలని నిర్ణయించింది. ఏ యూనివర్సిటీ పరిధిలోని పోస్టులను ఆయా వర్సిటీలే నోటిఫికేషన్లు జారీచేసి, భర్తీచేస్తాయి. ఆయా పోస్టుల భర్తీకి ఎలాంటి స్క్రీనింగ్ టెస్ట్ ఉండదు. సర్టిఫికెట్ల పరిశీలన, ఇంటర్వ్యూ విధానంలో నియామకాలను పూర్తిచేస్తారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు ఉపసంహరణకు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవలే విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించారు. దీంతో ఈ బిల్లు ఉపసంహరణకు రాజ్‌భవన్‌తో సీఎంవో, విద్యాశాఖ వర్గాలు సంప్రదింపులు జరుపుతున్నాయి.
కేసీఆర్ సర్కార్ హయాంలో బోర్డు ఏర్పాటు..
రాష్ట్రంలోని వర్సిటీల్లో బోధన పోస్టుల భర్తీకిగాను కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డును కేసీఆర్ సర్కారు ఏర్పాటు చేసింది. స్క్రీనింగ్ టెస్ట్ (రాతపరీక్ష) ద్వారా ప్రతిభావంతులను ప్రొఫెసర్లుగా నియమించేందుకు బోర్డును ఏర్పాటుచేస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వు లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ‘ది తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు’ బి ల్లుకు 2023 సెప్టెంబర్‌లో రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. పలు సందేహాలు చెప్త్తూ గవర్నర్ ఈ బి ల్లును ఆమోదించలేదు. దీంతో అప్పటి విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, అధికారులు రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సమావేశమై సందేహాలకు వివరణ ఇచ్చారు. ఈ వివరణకు సంతృప్తి చెందని గవర్నర్ యూజీసీ చైర్మన్‌కు లేఖ రాశారు. యూజీసీ నిబంధనల ప్రకారమే రిక్రూట్‌చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు తెలిపింది. అయినా సంతృప్తి చెందని గవర్నర్ ఆ తర్వాత బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పం పించారు. ఈ నేపథ్యంలో ఈ బిల్లును ఉపసంహరించుకునే యోచనలో కొత్త ప్రభుత్వం ఉంది.
1,977 ఖాళీలపై ప్రభుత్వానికి నివేదిక..
రాష్ట్రంలోని వర్సిటీల్లో బోధనా సిబ్బంది ఖాళీ పోస్టుల వివరాల నివేదికను ఇటీవలే ప్రభుత్వానికి సమర్పించారు. 2017లోనే 1,061 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. మరో 1,977 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నా యి. అన్ని వర్సిటీలకు మొత్తంగా 2,825 పోస్టులు మంజూరయ్యాయి. ప్రస్తుతం 873 మంది ఆచార్యులు పనిచేస్తుండగా, 1,977 ఆచార్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 1,013, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 757, ప్రొఫెసర్ పోస్టులు 207 ఖాళీగా ఉన్నాయి.