AP Latest News: కేంద్రం ప్రభుత్వం తాజాగా నాలుగు రోజుల క్రితం గ్రామాల అభివృద్ధి కోసం విడుదల చేసిన రూ.988 కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించాలని చూస్తోందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు వై.వి.బి రాజేంద్రప్రసాద్, సర్పంచ్ ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ ముత్యాలరావు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం మొత్తం విడుదల చేసిన రూ.988 కోట్లలో ప్రభుత్వం రూ.600 కోట్లను పక్కదారి పట్టిస్తోందని అన్నారు. ఈ దొంగిలించిన రూ.600 కోట్ల రూపాయలు నాలుగు రోజుల్లో తమ గ్రామ పంచాయతీల మండల పరిషత్తులు, జిల్లా పరిషత్ ల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాజకీయాలకు అతీతంగా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో కలిసి తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించి తమ తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. 


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 12,918 గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం ద్వారా 2022 - 23వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెండో విడత నిధులు రూ.988 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. ఆ నిధులు సర్పంచులకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, ఎంపీపీ లకు, జిల్లా పరిషత్ ఛైర్మన్ లకు ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్లు తమకు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వ అధికారుల నుంచి సమాచారం ఉందని వివరించారు.


కానీ కేంద్రం పంపిన రూ.988 కోట్ల రూపాయలలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.393 కోట్ల రూపాయలు మాత్రమే ఈ రోజు PROCEEDINGS NO...2095678/CPR & RD/H1 20023 ద్వారా తమ గ్రామ పంచాయతీ PFMS ఖాతాల్లో జమ చేసిందని చెప్పారు. కానీ  మిగిలిన రూ.600 కోట్ల రూపాయలను తమ పంచాయతీలకు ఇవ్వకుండా దొంగిలించి జగన్ ప్రభుత్వం దారి మళ్లించిందని అన్నారు.


రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ దారుణాన్ని మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, రాష్ట్ర సర్పంచుల సంఘం తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తోందని అన్నారు. గతంలో కూడా ఇదే విధంగా రూ.8,629 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించిందని అన్నారు. ఆ రూ.8,629 కోట్ల రూపాయలు తిరిగి తమ గ్రామ పంచాయతీలకు ఇవ్వాలని తాము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నామని చెప్పారు. గత నిధులు కూడా ఇవ్వకుండా.. తాజాగా రూ.600 కోట్లు దొంగిలించడం దారుణం అని వారు అన్నారు.


తాజాగా పక్కదారి పట్టించిన నిధులు, గతంలో దొంగిలించిన నిధులు జమ చేసేంతవరకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్, రాష్ట్ర సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో పోరాటాన్ని ఆపే ప్రసక్తి లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైవీబీ రాజేంద్ర ప్రసాద్, వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు హెచ్చరించారు.