Telangana TET 2024: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నిర్వహణకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. విద్యాశాఖపై సీఎం సమీక్షలో (CM Review Meet) ఈ అంశం చర్చకు వచ్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించడానికి టెట్ అనివార్యమని అధికారులు సీఎంకు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు పదోన్నతి పొందాలంటే టెట్ ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి. ఈ మేరకు ప్రభుత్వం తుది నిర్ణయానికి వచ్చింది. దీంతో వీలైనంత త్వరగా టెట్ నిర్వహించాలని సీఎం ఆదేశించినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌లో ఈ పరీక్ష నిర్వహించే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం 1.03 లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారు.
ప్రమోషన్లకు 'టెట్' ఉండాల్సిందే..
విద్యాహక్కు చట్టం, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) నిబంధనల ప్రకారం.. టీచర్లుగా నియమితులైన వారు పదోన్నతి పొందాలంటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. ఈ క్రమంలోనే టెట్ నిర్వహణపై విద్యాశాఖ దృష్టిసారించింది. ఈ పరిణామం వేల మంది సీనియర్ ఉపాధ్యాయుల్లో అలజడి రేపుతోంది. 2012కు ముందు టెట్ లేకపోవడంతో అంతకుముందే ఉన్న దాదాపు 60 వేల మంది టీచర్లకు ఈ అర్హత లేదు. మరోవైపు టెట్ ఉంటే తప్ప పదోన్నతులు కల్పించడానికి వీల్లేదని 2012లోనే కేంద్రం తెలిపింది. అయితే టెట్ పరీక్ష నిర్వహించే వరకూ ఈ నిబంధనను అమలు చేయలేమని పేర్కొంటూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో మిన హాయింపు ఇచ్చింది. కేంద్రం తాజాగా మరోసారి ఈ నిబంధనను తెరపైకి తేవడం, సుప్రీంకోర్టు కూడా టెట్ తప్పనిసరి అని తీర్పు ఇవ్వడంతో గత ఏడాది నుంచి పదోన్నతులు నిలిచిపోయాయి.
ఎవరు టెట్ రాయాలి?
రాష్ట్రంలో సర్వీస్‌లో ఉన్న వారికి డిపార్ట్‌మెంట్ టెస్ట్ మాదిరి ప్రత్యేకంగా టెట్ పరీక్ష నిర్వహించాలని టీచర్లు కోరుతున్నారు. వీరితో పాటు బీఎడ్, డీఎడ్ పూర్తి చేసిన వాళ్ళు కూడా ఈ పరీక్ష రాస్తారు. ప్రైవేటు స్కూళ్ళల్లో పనిచేయాలన్నా టెట్ తప్పనిసరి. కాగా ఏడాదికి రెండు సార్లు టెట్ చేపట్టాలని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నా, ఇది అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పుడు సర్వీస్‌లో ఉన్నవారికి విధిగా టెట్ నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొనడంతో, అందరికీ కలిపి సాధారణ టెట్ నిర్వహించాలని విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదించింది. టెన్త్ పరీక్షలు ముగిసిన వెంటనే ఏప్రిల్ మొదటి వారంలో టెట్ చేపట్టాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే 45 ఏళ్ళు దాటిన ఉపాధ్యాయులు టెట్‌కు సన్నద్ధమవ్వాల్సిన అవసరం ఉందని, పరీక్షల్లో ఇచ్చే సిలబస్‌పై కొంత కసరత్తు చేయాల్సి ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొంత వ్యవధి ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది.
హైకోర్టు ఉత్తర్వులు ఇలా..
ఉపాధ్యాయులుగా నియమితులు కావాలన్నా.. పదోన్నతి పొందాలన్నా.. టెట్‌లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరని ఎన్‌సీటీఈ 2010లోనే నిబంధనలను నిర్దేశించింది.అయితే, కొత్త నియామకాల్లో ఈ నిబంధనను అమలు చేస్తున్న పాఠశాల విద్యాశాఖ... పదోన్నతులకు మాత్రం అమలు చేయడం లేదు. ఈ క్రమంలో టెట్ ఉన్న వారికే పదోన్నతులు ఇవ్వాలని పలువురు టీచర్లు కొద్ది నెలల క్రితం హైకోర్టును ఆశ్రయించారు. పదోన్నతి పొందేందుకు టెట్‌లో పాసైన వారితో సీనియారిటీ జాబితా సమర్పించాలని గత సెప్టెంబరు 27న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించిన సంగతి తెలిసిందే. దాంతో స్కూల్ అసిస్టెంట్లుగా, గెజిటెడ్ హెచ్‌ఎంలుగా పలువురికి దక్కాల్సిన ప్రమోషన్లకు బ్రేక్ పడింది.
మెగా డీఎస్సీకీ టెట్ ఆటంకం..
రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో దీని అమలుపై అధికారులతో సీఎం చర్చించారు. మెగా డీఎస్సీ చేపట్టాలంటే, ఉపాధ్యాయ ఖాళీలపై స్పష్టత రావాలి. రాష్ట్రంలోని దాదాపు 10 వేల స్కూల్ అసిస్టెంట్ పోస్టులను సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేస్తారు. ఇవి కాకుండా ఇప్పటికే 12 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు ఎస్జీటీలు మొత్తం కలిపి 22 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. టెట్ లేని కారణంగా పదోన్నతులు ఇవ్వడం సాధ్యం కావడం లేదు. ఈ కారణంగానే టెట్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
19,043 పోస్టులు ఖాళీ..
రాష్ట్రంలో మొత్తం మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు 1,22,386 ఉండగా... ప్రస్తుతం 1,03,343 మంది పనిచేస్తున్నారు. అంటే 19,043 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టెట్ ప్రవేశపెట్టిన తర్వాత 2012, 2017లలో మాత్రమే ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి. అంటే టెట్ పాసై ఉపాధ్యాయులుగా చేరిన వారు రాష్ట్రంలో 15 వేల మందికి మించరు. దానికితోడు మరో 11 వేల మంది 1996, 1998, 2001, 2002, 2003 డీఎస్సీల్లో నియమితులైన వారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులతోపాటు పదోన్నతులకు అవసరమని టెట్ రాసి ఉత్తీర్ణులయ్యారు. మొత్తానికి సుమారు 26 వేల మంది టెట్ పాసైన టీచర్లు ఉన్నారు. అంటే ఇంకా 96 వేల మందికి టెట్ అర్హత లేదు. వాస్తవానికి పదోన్నతికి కూడా టెట్ తప్పనిసరి కావడంతో 2015లోపు ఉత్తీర్ణులు కావాలని కేంద్ర ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఆ తర్వాత మరో అయిదేళ్లు(2019 వరకు) గడువు పెంచుతూ పార్లమెంటు ఆమోదంతో కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అయినా, విద్యాశాఖ దాన్ని అమలు చేయలేదని టెట్ క్వాలిఫైడ్ టీచర్స్ ఫోరం కోశాధికారి పి.రేవంత్ కుమార్ పేర్కొన్నారు.
ప్రత్యేకంగా ఉంటేనే బాగుంటుంది - యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి
పదోన్నతులకు టెట్ తప్పనిసరి అని ఎన్‌సీటీఈ నిబంధనలు చెబుతున్నాయి. మేం స్వయంగా వెళ్లి అడిగినా.. అదే సమాధానం వచ్చింది. టెట్ వీలైనంత త్వరగా చేపట్టడం మంచిది. ఇది పాసయితేనే ప్రమోషన్లు పొందే వీలుంది. అయితే బోధన అనుభవం ఉన్న ఉపాధ్యాయులకు అంతర్గత పరీక్ష మాదిరి పరీక్ష నిర్వహిస్తే బాగుంటుంది. ప్రస్తుత టీచర్లకు అందరితోపాటు కాకుండా ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలని, వారికి ప్రత్యేక సిలబస్ ఉండాలని టీఎస్ యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావా రవి ప్రభుత్వాన్ని కోరుతున్నారు.