ఐటీ దిగ్గజ సంస్థలైన విప్రో, ఇన్ఫోసిస్‌, టెక్ మ‌హీంద్ర వంటి సంస్థ ఫ్రెష‌ర్లకు షాకిస్తున్నాయి. ఉద్యోగ ఆఫ‌ర్ లెట‌ర్లు ఇచ్చిన త‌ర్వాత అదిగో..ఇదిగో అంటూ నియామ‌క ప్రక్రియ‌లో జాప్యం చేసిన టెక్ సంస్థలు తాజాగా యూట‌ర్న్ తీసుకున్నాయి. ఫ్రెష‌ర్స్‌కు ఇచ్చిన ఆఫ‌ర్ లెట‌ర్లను వెనక్కు తీసుకుంటున్నాయి. నెల‌ల త‌ర‌బ‌డి నియామ‌క ప్రక్రియ‌పై ముందుకు కదలని ఐటీ కంపెనీలు ఫ్రెషర్స్‌కు ఇచ్చిన ఆఫ‌ర్ లెట‌ర్లను తిర‌స్కరిస్తున్నట్లు తెలుస్తోంది.




Also Read:  SSC Recruitment: భారత వాతావరణ శాఖలో 990 ఉద్యోగాలు, అర్హతలివే!



మూడు, నాలుగు నెల‌ల కింద‌ట తాము ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మ‌హీంద్ర వంటి టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నామ‌ని, ప‌లు రౌండ్ల ఇంట‌ర్వ్యూల త‌ర్వాత త‌మ‌కు ఆఫ‌ర్ లెట‌ర్లు ఇవ్వగా తామిప్పుడు కంపెనీల్లో చేరేందుకు వేచిచూస్తున్నామ‌ని విద్యార్ధులు చెబుతున్నారు. కాగా త‌మ ఆఫ‌ర్ లెట‌ర్లను ర‌ద్దు చేశామ‌ని త‌మ‌కు ఆయా కంపెనీల నుంచి లెట‌ర్స్ వ‌చ్చాయ‌ని వారు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు. అర్హతా నిబంధ‌న‌లు, కంపెనీ మార్గద‌ర్శకాల పేరుతో ఆఫ‌ర్ లెట‌ర్లను ర‌ద్దు చేస్తున్నట్లుగా ఆయా కంపెనీలు చెబుతున్నాయ‌ని ఎంపికైన అభ్యర్థులు వాపోతున్నారు.



Also Read: 20 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్!


అంత‌ర్జాతీయంగా ఐటీ రంగంలో మంద‌గ‌మ‌నం, వ్యయ నియంత్రణ చ‌ర్యలు చేప‌డుత‌న్న నేప‌ధ్యంలో ఈ ప‌రిణామాలు చోటుచేసుకోవ‌డం గ‌మ‌నార్హం. వ‌డ్డీరేట్ల పెంపు, మార్కెట్ల‌లో లిక్విడిటీ త‌గ్గుద‌ల‌, మాంద్యం ప‌రిస్ధితుల‌తో టెక్ స్టార్టప్‌ల నుంచి టెక్ దిగ్గజాల వ‌ర‌కూ ఐటీ కంపెనీలు గ‌డ్డు ప‌రిస్ధితులు ఎదుర్కొంటున్నాయి. ప్రతికూల ప‌రిస్ధితుల‌తో ప‌లు కంపెనీలు నియామ‌కాల‌ను నిలిపివేశాయి. గూగుల్‌, ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్ధలు సైతం హైరింగ్‌ను నిలిపివేయ‌డంతో పాటు అవ‌స‌ర‌మైతే లేఆఫ్స్ త‌ప్పవ‌నే సంకేతాల‌ను పంపడం ఆందోళ‌న రేకెత్తిస్తోంది.



భారత్‌లో తగ్గిన నిరుద్యోగం, ఎంతమేర తగ్గిందంటే?
భారత్‌లో నిరుద్యోగం 6.43 శాతానికి తగ్గినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించింది. ఏడాది కాలంలో అత్యధికంగా 8.3% నిరుద్యోగం ఆగస్టులో నమోదైంది. తాజాగా సెప్టెంబరు నెలలో  దేశవ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య 20 లక్షలు తగ్గి 39 కోట్ల 46 లక్షలకు చేరిందని సీఎంఐఈ తన నివేదికలో పేర్కొంది. సెప్టెంబరు నెలలో నిరుద్యోగం అనూహ్యంగా తగ్గింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ ఉద్యోగుల సంఖ్య పెరిగింది అని సీఎంఐఈ ఎండీ మహేశ్ వ్యాస్ ఓ జాతీయ వార్తా సంస్థకు తెలిపారు.



Also Read:  ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2023 నోటిఫికేషన్ విడుదల


సెప్టెంబరు నెలలో గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం 7.68 % నుంచి 5.84 శాతానికి తగ్గినట్లు మహేశ్ వ్యాస్ పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో 9.57 శాతంగా ఉన్న నిరుద్యోగుల సంఖ్య 7.70 శాతానికి తగ్గినట్లు ఆయన చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోందనడానికి ఇదే నిదర్శనమన్నారు. 


సీఎంఐఈ నివేదిక ప్రకారం రాజస్థాన్‌‌లో అత్యధికంగా 23.8శాతం నిరుద్యోగులు ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో జమ్ము కశ్మీర్ (23.2%), హరియాణా (22.9 %), త్రిపుర (17%), ఝార్ఖండ్ (12.2 %), బిహార్ (11.4%) ఉన్నాయి. అత్యల్పంగా నిరుద్యోగం ఛత్తీస్‌‌గఢ్ (0.1%)లో నమోదైంది. ఆ తర్వాతి స్థానాల్లో అస్సాం (0.4%) ఉత్తరాఖండ్ (0.5%) మధ్యప్రదేశ్ (0.9%), గుజరాత్ (1.6 %),మేఘాలయ (2.3%),ఒడిశా (2.9%) ఉన్నాయి.



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...