TCS set to lay off more than 12000 employees | భారతదేశపు అతిపెద్ద IT సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఏకంగా 12000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఆర్థిక సంవత్సరం 2026లో తమ మొత్తం ఉద్యోగులలో 2 శాతం మందిని తొలగిస్తామని స్పష్టం చేసింది. ఈ తొలగింపు ప్రధానంగా కంపెనీలోని మీడియం, సీనియర్ మేనేజ్‌మెంట్ ఉద్యోగులపై ప్రభావం చూపనుంది.
కంపెనీ అధికారిక ప్రకటన విడుదల
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కొత్త మార్కెట్లలోకి ప్రవేశిస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త టెక్నాలజీలో పెట్టుబడులు పెడుతోంది. కంపెనీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం పెంచాలని చూస్తోందని టీసీఎస్ తన అధికారిక ప్రకటనలో తెలిపింది. దీనితో పాటు, కంపెనీ తన ఉద్యోగులందరికీ ఏఐ టూల్స్ మీద తిరిగి శిక్షణ ఇస్తోంది. ఈ టెక్నాలజీపై తిరిగి నియామకాలు సైతం చేపడుతోంది. భారీ లేఆఫ్స్ ప్రక్రియలో కంపెనీకి చెందిన దాదాపు 12,200 మంది ఉద్యోగాలు కోల్పోతారు.
పూర్తి జాగ్రత్తగా, ప్రణాళికాబద్ధంగా మార్పులు
TCS సంస్థ ప్రకటనలో ఏముందంటే.. "ఈ మొత్తం మార్పు ప్రక్రియ చాలా జాగ్రత్తగా, ప్రణాళికాబద్ధంగా జరుగుతోంది. దాంతో ఈ మార్పులు మా కస్టమర్ సేవలపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. భారతదేశంలో 283 బిలియన్ డాలర్ల IT రంగం ఉంది. ప్రస్తుతం డిమాండ్ తగ్గడంతో పరిస్థితులు మారుతున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అమెరికా వాణిజ్య విధానాలకు సంబంధించిన అనిశ్చితి కారణంగా కంపెనీ అనవసరమైన సాంకేతిక ఖర్చులను తగ్గించుకునేందుకు చర్యలు చేపట్టింది"
కొత్త ప్రాజెక్ట్‌లను ప్రారంభించడంలో ఆలస్యం - కె. కృతివాసన్
అదే సమయంలో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) కె. కృతివాసన్ మాట్లాడుతూ, కస్టమర్ కంపెనీలు, క్లయింట్స్ నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నాయని చెప్పారు. ఏదైనా కొత్త ప్రాజెక్ట్‌లను ప్రారంభించడంలో ఆలస్యం జరుగుతోందని తెలిపారు. ఇది సంస్థ టర్నోవర్ పై సైతం ప్రభావం చూపనుందని తెలుస్తోంది.
ప్రమాదంలో ఐటీ జాబ్స్..
ఐటీ సంస్థలు ఒక్కసారిగా లేఆఫ్స్ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇంటెల్, మైక్రోసాఫ్ట్ సైతం భారీగా ఉద్యోగాలలో కోత విధిస్తున్నాయి. సంస్థల అనూహ్య నిర్ణయాలతో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థ సైతం దాదాపు 10 వేల మంది ఉద్యోగాలలో కోత విధించేందుకు సిద్ధంగా ఉంది. కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద ఉద్యోగాల కోత దిశగా మైక్రోసాఫ్ట్ అడుగులు వేస్తోంది. పెద్ద సంస్థల నిర్ణయాలు గమనిస్తే ఈ ఆర్థిక సంవత్సరం దాదాపు 24000 మంది ఐటీ ఉద్యోగులు జాబ్ కోల్పోయే అవకాశం ఉంది.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లాంటి సరికొత్త టెక్నాలజీతో పాత టెక్నాలజీని రీప్లేస్ చేయాలని కంపెనీలు భావిస్తున్నాయి. తద్వారా గతంలో 5 నుంచి 10 మంది ఉద్యోగులు చేసే పనిని ఏఐ సాయంతో ఒకరిద్దరు ఉద్యోగాలు చేస్తారని టెక్ దిగ్గజాలు అంచనా వేస్తున్నారు. అదే దిశగా ప్రముఖ ఐటీ కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. ఉద్యోగాలలో కోత విధించడంతో పాటు లేటెస్ట్ టెక్నాలజీతో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చు అని లేఆఫ్స్ నిర్ణయాలకు వెళ్తున్నాయి.