స్టాఫ్ సెల‌క్షన్ క‌మిటీ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవ‌ల్ (CGL) టైర్‌-2 ప‌రీక్షలకు సంబంధించి అడ్మిట్ కార్డుల‌ను విడుద‌ల చేసింది. అభ్యర్థులు త‌మ‌త‌మ రీజియ‌న్‌ల‌కు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ల ద్వారా అడ్మిట్ కార్డుల‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. సీజీఎల్ టైర్-1లో అర్హత సాధించిన అభ్యర్థులకు టైర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.


ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 8 , 10 తేదీల్లో SSC CGL 2020 టైర్‌- 2 ప‌రీక్ష నిర్వహించనున్నారు. సీజీఎల్ టైర్-1 పరీక్ష ఫలితాలను జులై 4న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు టైర్-2 పరీక్షకు హాజరుకానున్నారు.


కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవ‌ల్ పరీక్షల ద్వారా కేంద్రప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-2 వంటి పోస్టులను భర్తీ చేస్తారు.


SSC CGL Tier-2 Admit Card 2021


అడ్మిట్ కార్డు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..



  • అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావాలి.

  • అక్కడ హోంపేజీలో కనిపించే 'Download Admit Card for CGL Tier 2, 2021' లింక్ మీద క్లిక్ చేయాలి.

  • క్లిక్ చేయగానే వచ్చే విండోలో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ ఐడీ, పుట్టినతేది వివరాలను నమోదుచేసి submit బటన్‌పై క్లిక్ చేయాలి.

  • SSC CGL Tier-2 Admit Card స్క్రీన్ మీద కనిపిస్తుంది.

  • అభ్యర్థులు అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి. పరీక్షకు హాజరయ్యే ముందు అడ్మిట్ కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. దీంతోపాటు ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డు, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.


పరీక్షా విధానం..


SSC CGL టైర్-2  పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. పరీక్షలో పేపర్-1: క్వాంటిటేటివ్ ఎబిలిటీ-100 ప్రశ్నలు-200 మార్కులు, పేపర్-2: ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్-200 ప్రశ్నలు-200 మార్కులు, పేపర్-3: స్టాటిస్టిక్స్-100 ప్రశ్నలు-200 మార్కులు, పేపర్-4: జనరల్ స్టడీస్ (ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్) విభాగాలు ఉంటాయి. అభ్యర్థులు ప్రతి పరీక్షను 2 గంటల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.


నెగెటివ్ మార్కులు: SSC CGL టైర్-2 పరీక్షలో నెగెటివ్ మార్కులు అమలుపరుస్తారు. పేపర్-2లో ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. అంటే ప్రతి నాలుగు తప్పు సమాధానాలకు ఒకమార్కు కోత విధిస్తారు. అలాగే పేపర్-2, పేపర్-3, పేపర్-4లో ఒక్కో తప్పు సమాధానానికి 0.50 మార్కుల చొప్పున కోత విధిస్తారు. అంటే ప్రతి రెండు తప్పు సమాధానాలకు ఒకమార్కు కోత విధిస్తారు.