TCS: టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం మాదిరిగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. క్యాంపస్ సెలక్షన్ల ద్వారా ఇప్పటికే ఎంపిక చేసి, ఆఫర్ లెటర్లు ఇచ్చిన వారందరికీ ఉద్యోగాలు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నట్లు సంస్థ సీఈఓ, ఎండీ కృతివాసన్ స్పష్టంచేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పదివేల మంది ఫ్రెషర్లను 'నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్' ప్రక్రియ ద్వారా ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఆర్డర్లు, స్థిరమైన ఆదాయ వృద్ధి ఉన్నా.. ఉద్యోగుల సంఖ్య ఎందుకు తగ్గిందనేదానిపై ఆయన మాట్లాడుతూ.. కళాశాలల్లో ఎంపిక చేసుకున్న ట్రైనీలు, మా అంతర్గత శిక్షణ అనంతరం 6-8 నెలలకు గానీ ఉత్పాదకతలోకి రారు. కాబట్టి నియామకాలు చేపట్టిన సమయానికి, వాళ్లు ప్రాజెక్టుల్లో చేరే సమయానికి మధ్య అంతరం ఉంటుంది. అందువల్ల సిబ్బంది సంఖ్య తగ్గడాన్ని పెద్దగా పట్టించుకోనక్కర్లేదని ఆయన వివరించారు.


ఏప్రిల్ 26న నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్..
నిరుద్యోగ యువతీయువకులకు ఉద్యోగాలు కల్పించేందుకు దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 'డిజిటల్‌ హైరింగ్‌'కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆఫ్‌ క్యాంపస్‌  కోసం టీసీఎస్‌ ఎన్‌క్యూటీ (TCS NQT) పరీక్షకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తు చేసుకున్నవారికి ఏప్రిల్ 26న పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో అర్హత సాధించినవారు టీసీఎస్‌, టీవీఎస్‌ మోటార్స్‌, జియో, ఏసియన్‌ పెయింట్స్‌ సహా దాదాపు 3 వేల ఐటీ, ఐటీయేతర కార్పొరేట్‌ సంస్థల్లో దాదాపు 1.6 లక్షల ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగ స్వభావాన్ని బట్టి గరిష్ఠంగా రూ.19 లక్షల వరకు వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాలు పొందవచ్చు. ఈ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా పలు కంపెనీల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే.. ఆయా సంస్థలుఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తాయి. 


పరీక్ష వివరాలు..


➥ దేశవ్యాప్తంగా నిర్దేశించిన వివిధ పరీక్షా కేంద్రాలలో ప్రతి 4 వారాలకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు. పరీక్ష ఇంగ్లిష్‌లో ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉండవు. ఈ పరీక్షలో అక్రమాలకు పాల్పడిన అభ్యర్థులకు ఏడాది పాటు పరీక్ష రాసేందుకు అనుమతించరు. 


➥ టీసీఎస్ ఎన్‌క్యూటీలో సాధించిన స్కోరుకు రెండేళ్ల వరకే వ్యాలిడిటీ ఉంటుంది. అయితే ఈ స్కోరును మెరుగుపరుచుకొనేందుకు ఎన్నిసార్లయినా పరీక్ష రాసే వెసులుబాటు ఉంది. అభ్యర్థి సాధించిన ఉత్తమ స్కోరునే పరిగణలోకి తీసుకుంటారు. 


➥ పరీక్ష రాసిన తర్వాత ఫలితాలను మీ రిజిస్టర్ ఈ మెయిల్ ఐడీకి పంపిస్తారు. మీ స్కోరు కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలో కటాఫ్ మార్కులంటూ ఏమీ ఉండవు. అభ్యర్థుల ప్రతిభను తెలిపే ఈ పరీక్షకు కటాఫ్ స్కోర్ లేదా పాస్/ఫెయిల్ అనే ప్రమాణాలను నిర్ణయించలేదు. వివిధ అంశాల్లో అభ్యర్థుల సామర్థ్యాన్ని అప్పటికప్పుడు అంచనా వేసి స్కోరు ఇస్తారు. ఈ పరీక్షలో వచ్చిన స్కోరును ఆధారంగానే.. కార్పొరేట్ సంస్థల్లోనూ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 


తుది నిర్ణయం వారిదే..
టీసీఎస్ ఎన్‌క్యూటీలో స్కోరు సాధించిన అభ్యర్థులకు ఉద్యోగం కచ్చితంగా వస్తుందని ఎలాంటి హామీ ఉండదు. అయితే అభ్యర్థికి ఉద్యోగం వచ్చే అవకాశాలు మాత్రం మెరుగ్గా ఉంటాయి. ఆయా సంస్థల తుది నిర్ణయం మీదే ఉద్యోగ ఎంపికలు ఉంటాయి.