Better work life balance :  ఇన్‌ఫోసిస్ ఉద్యోగులు అత్యధిక పని గంటలు పని చేయకుండా వర్క్ , ఫ్యామిలీ లైఫ్ ను బ్యాలెన్స్ చేసుకోవాలని మెయిల్ చేసింది.  భారతదేశంలోని రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ ఉద్యోగుల ఆరోగ్యంపై ఆందోళన చెందుతోంది.  ఉద్యోగులు అధిక గంటలు పని చేయడం మానివేసి, ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌ను చూసుకోవాలని సూచిస్తోంది.  కంపెనీ హెచ్‌ఆర్ టీమ్ రిమోట్‌గా పనిచేసే ఉద్యోగులు సాధారణ పని గంటలను మించి పనిచేస్తే వారికి వ్యక్తిగత ఈ మెయిల్‌లు పంపుతోంది. 

ఇన్ ఫోసిస్ ఇలాంటి మెయిల్స్ పంపుతోందని తెలియగానే.. సోషల్ మీడియాలో గతంలో   ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి  చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తోంది.  యువ ఉద్యోగులు వారానికి 70 గంటలు పనిచేయాలని సూచించిన వ్యాఖ్యలకు విరుద్ధంగా ఉందని అంటున్నారు.  ఇన్ఫోసిస్ తన ఉద్యోగులు రోజుకు 9 గంటల 15 నిమిషాలు , వారానికి ఐదు రోజులు పనిచేయాలని నిర్దేశించింది. రిమోట్‌గా పనిచేసే ఉద్యోగులు ఈ సమయాన్ని మించితే, హెచ్‌ఆర్ టీమ్ మెయిల్‌లు పంపుతుంది. రిమోట్‌గా పనిచేసిన రోజుల సంఖ్య, మొత్తం పని గంటలు, రోజువారీ సగటు గంటల వివరాలు మెయిల్‌లో ఉంటున్నాయి. 

ఉద్యోగులు పని సమయంలో రెగ్యులర్ బ్రేక్‌లు తీసుకోవాలని, అతిగా ఒత్తిడి అనుభవిస్తే మేనేజర్‌తో మాట్లాడాలని, టాస్క్‌లను డెలిగేట్ చేయాలని,  పని గంటల తర్వాత పని సంబంధిత మీటింగ్‌లను  తగ్గించాలని   కంపెనీ హెచ్ ఆర్ సలహా ఇస్తోంది. హైబ్రిడ్ వర్క్ పాలసీ తర్వాత ప్రారంభమైన తర్వాత ఇన్ఫీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇన్ఫోసిస్‌లోని 323,500 మంది ఉద్యోగులు నెలకు కనీసం 10 రోజులు ఆఫీస్ నుండి పనిచేయాల్సి ఉంటుంది.   రిమోట్ వర్క్ సమయంలో అధిక గంటలు పనిచేస్తున్న ఉద్యోగులను గుర్తించడానికి హెచ్‌ఆర్ టీమ్ ట్రాకింగ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తోంది.  ఉద్యోగుల్లో ఆరోగ్య సమస్యలు , బర్న్‌అవుట్‌ను నివారించడానికి అమల్లోకి తెచ్చారు. 

2023లో, ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, భారతదేశ యువ ఉద్యోగులు దేశ అభివృద్ధి కోసం వారానికి 70 గంటలు పనిచేయాలని సూచించారు, ఇది సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. మూర్తి తన వ్యాఖ్యలు వ్యక్తిగత అభిప్రాయంగా ఉన్నాయని, ఎవరిపైనా బలవంతంగా విధించరాదని తర్వాత స్పష్టం చేశారు. కానీ ఇన్ఫోసిస్ మాత్రం తమ సంస్థ సహ ఫౌండర్ మాటల్ని ఆచరణ సాధ్యం కాదని భావిస్తోంది. ఈ మార్పు ఐటీ రంగంలో అసమాన షెడ్యూల్స్, నిద్ర లేమి,   పేలవమైన జీవనశైలి వల్ల ఆరోగ్య సమస్యల నుంచి ఉద్యోగుల్ని కాపాడాలని నిర్ణయించుకున్నారు.