ఇండియన్ నేవీ ఇంజనీరింగ్ విద్యార్హత కలిగిన వారి కోసం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లలో షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఆఫీసర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దరఖాస్తుల స్వీకరణ జూలై 16న ప్రారంభం కాగా.. 30వ తేదీతో ముగియనుంది. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తోంది. మొత్తం 40 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. అవివాహిత పురుషులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. ఇంటర్వ్యూలను సెప్టెంబర్ 21వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు నోటిఫికేషన్‌లో తెలిపింది. వీటిని విశాఖపట్నం, బెంగళూరు, భోపాల్, కోల్‌కతాలలో నిర్వహించనుంది. మరిన్ని వివరాలకు https://www.joinindiannavy.gov.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
కరోనా కారణంగా ఈ ఉద్యోగాల భర్తీకి ప్రవేశ పరీక్షను నిర్వహించడం లేదు. అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్‌లు నిర్వహిస్తారు. వీటి ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి కేరళలో ఎజిమళలో ఉన్న ఇండియన్ నేషనల్ అకాడమీలో శిక్షణ ఇస్తారు. 1997 జనవరి 2 నుంచి 2002 జూలై 1వ తేదీ మధ్య జన్మించిన వారు దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
విద్యార్హతలు..
ఎలక్ట్రికల్ /ఎలక్ట్రానిక్స్/ టెలీ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ పవర్ ఇంజనీరింగ్/ పవర్ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/ అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ (ఏఈసీ)/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగాలలో బీఈ/ బీటెక్ కనీసం 60 శాతం మార్కులతో పాస్ అయిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని నోటిఫికేషన్‌లో తెలిపింది
టెన్త్ అర్హతతో నేవీలో 350 ఉద్యోగాలు..
ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రారంభం కానున్న మెట్రిక్ రిక్రూట్ (ఎంఆర్) సెయిలర్ల బ్యాచ్ కోసం ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 350 పోస్టులను దీని ద్వారా భర్తీ చేయనుంది. అవివాహిత పురుషులు మాత్రమే దీనికి దరఖాస్తు చేసుకోవాలి. చెఫ్, స్టీవార్డ్, హైజీనిస్ట్ పోస్టులను దీని ద్వారా భర్తీ చేయనుంది. పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగిన వారు దీనికి అర్హులు. 2001 జూన్ 1 నుంచి 2004 సెప్టెంబర్ 30 మధ్య జన్మించిన వారు మాత్రమే దీనికి దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. జూలై 23 దరఖాస్తులకు గడువుగా నిర్దేశించారు. మరిన్ని వివరాలకు www.joinindiannavy.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.