హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వం విడుదలచేసిన 503 గ్రూప్-1 పోస్టుల నోటిఫికేషన్‌ను రద్దుచేస్తూ.. తాజాగా 60 పోస్టులను జతచేస్తూ.. కొత్త నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. ఈ నిర్ణయంపై నిరుద్యోగుల్లో ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. పలుకారణాల వల్ల రెండుసార్లు నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష రద్దయింది. మొదటిసారి పేపర్ లీక్ కారణంగా, రెండోసారి బయోమెట్రిక్ హాజరువల్ల ప్రిలిమ్స్ పరీక్ష రద్దయింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల ఏకంగా అప్పటి గ్రూప్-1 నోటిఫికేషన్‌నే రద్దుచేసి.. కేవలం 60 పోస్టులు మాత్రమే పెంచడమేంటని నిలదీస్తున్నారు. 


గ్రూప్స్ పోస్టులు భారీగా పెంచాలని డిమాండ్ 
గ్రూప్-1లో కేవలం 60 గ్రూప్-1 పోస్టులు పెంచడంపై అశోక్‌నగర్‌లోని అశోకా అకాడమీ యజమాని అశోక్‌ 'ఎక్స్‌'లో తీవ్రంగా స్పందించారు. ఈ వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. పోస్టుల సంఖ్య భారీగా పెరుగుతుందని నిరుద్యోగులు సైతం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఉద్యోగాల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామని.. తమను మోసం చేయవద్దని  అన్నారు. 60 పోస్టులు పెంచి తమకు ఎందుకు బిచ్చం వేస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. గ్రూప్-1 ఖాళీలను కనీసం 250 నుంచి 300కు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక గ్రూప్-2 పోస్టులు 2000, గ్రూప్-3 పోస్టులు 3000కు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.


తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేపట్టలేకపోయిందని, నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేసిందని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడునెలలు గడిచింది. ఈ కాలంలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పోలీసు ఉద్యోగాల భర్తీ, గురుకుల ఉద్యోగాలు, స్టాఫ్ నర్స్ పోస్టలకు సంబంధించి ఉద్యోగ పరీక్షలు ముగియగా.. ఫలితాలను విడుదల చేసి, నియామక పత్రాలు అందజేసి, వాటిని కూడా తమ ఖాతాలో వేసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరోవైపు అప్పటి నోటిఫికేషన్లను రద్దుచేస్తూ.. వాటికి కొన్ని పోస్టులను జతచేసి కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టాక కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. టీఎస్‌పీఎస్సీ కమిషన్ ప్రక్షాళనతోపాటు, యూనివర్సిటీ వీసీల నియామకాలు మాత్రమే చేపట్టింది. అది పదులు సంఖ్యలో ఖాళీల భర్తీ మాత్రమే.



రెండు సార్లు గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటివరకూ ఒక్కసారి కూడా గ్రూప్ 1 పోస్టులు భర్తీ కాలేదు. రెండు సార్లు నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ, భర్తీ ప్రక్రియ మాత్రం సజావుగా సాగలేదు. మొదట 2022 ఏప్రిల్ లో 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కానీ ప్రిలిమ్స్ నిర్వహణ జరిగి, ఫలితాలు సైతం విడుదలయ్యాయి. మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారని అంతా అనుకుంటున్న సమయంలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యిందని ఆరోపణలు రావడంతో మొదట ప్రిలిమ్స్ ఎగ్జామ్ రద్దు చేశారు. దాంతో గ్రూప్ 1 నోటిఫికేషన్ తొలిసారి రద్దయింది.


అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించింది. తొలిసారి ఎగ్జామ్ నిర్వహించిన సమయంలో బయోమెట్రిక్ లాంటి విషయాలతో పాటు ఎంతో జాగ్రత్తగా ఎగ్జామ్ నిర్వహించారు. కానీ రెండోసారి నిర్వహించిన ఎగ్జామ్ లలో అవకతవకలు జరిగాయని, నిబంధనలు సరిగ్గా పాటించలేదని గ్రూప్ 1 (Group 1) ప్రిలిమినరీ మరోసారి రద్దు చేసింది టీఎస్‌పీఎస్సీ. విషయం హైకోర్టు వరకు వెళ్లడంతో ఎగ్జామ్ రద్దు నిర్ణయాన్ని సమర్థించింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించింది. కేసు విచారణలో ఉండగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.