Arvind Kejriwal Nobel Prize: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా ఢిల్లీలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నందుకు తనకు నోబెల్ ప్రైజ్ ఇచ్చినా తప్పులేదని అన్నారు. తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్ని బీజేపీ అడ్డుకోవాలని కుట్ర చేస్తోందని మండి పడ్డారు. హాస్పిటళ్లు, స్కూల్స్‌ కడుతుంటే ఆ నిర్మాణాలనూ ఆపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద విద్యార్థులకు సరైన విద్య అందించడం బీజేపీకి ఇష్టం లేదంటూ ఫైర్ అయ్యారు. ఇన్ని సవాళ్లు మధ్య ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తున్నానో తనకు మాత్రమే తెలుసని అన్నారు. 


"మా ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాల్ని అడ్డుకోవడమే బీజేపీ. మేం స్కూళ్లు, హాస్పిటల్స్‌ కట్టాలనుకున్నా వాటినీ అడ్డుకుంటోంది. వాళ్ల పిల్లల్ని గొప్ప గొప్ప చదువులు చదివిస్తారు. అదే మేం పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తామంటే మాత్రం ఆటంకాలు సృష్టిస్తారు. ఇన్ని సమస్యల మధ్య ప్రభుత్వాన్ని ఎలా నడుపుతున్నానో నాకు మాత్రమే తెలుసు. ఈ సవాలుని అధిగమిస్తున్నందుకు నాకు నోబెల్ ప్రైజ్ ఇచ్చినా తప్పులేదు"


- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి






ఢిల్లీ జల్‌ బోర్డ్ తీసుకొచ్చిన కొత్త పథకాన్నీ బీజేపీ అడ్డుకోవాలని చూస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కి చెప్పి ఈ స్కీమ్‌ని ఆపేయాలని చూస్తున్నారని విమర్శించారు. కొంత మంది అధికారులను బెదిరిస్తున్నారని, చెప్పినట్టు వినకపోతే జైల్‌లో పెడతామని వార్నింగ్ ఇస్తున్నారని ఆరోపించారు. అధికారులు ఏం చేయాలో అర్థం కాక తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని అన్నారు. ఈ స్కీమ్‌ని అమల్లోకి తీసుకొస్తే సస్పెండ్ చేస్తామని కొందరు బెదిరిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే వాటర్ బిల్స్‌పై ఢిల్లీలో పెద్ద ఎత్తున రగడ జరుగుతోంది. దీనికి తోడు అరవింద్ కేజ్రీవాల్‌ని మరి కొద్ది రోజుల్లోనే అరెస్ట్ చేసే అవకాశముందంటూ కొందరు ఆప్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా రాజకీయాల్లో అలజడి సృష్టిస్తోంది. 


మద్యం కుంభకోణం కేసులో అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) మరోసారి ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. ఎక్సైజ్‌ పాలసీకి సంబంధించి కేసులో ఆయన విచారణకు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు ఆరోసారి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విచారణకు కేజ్రీవాల్ హాజరుకావడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) వర్గాలు వెల్లడించాయి. సమన్లు చట్ట వ్యతిరేకమని, ఈడీ సమన్ల చట్టబద్ధతపై కోర్టులో కేసు నడుస్తోందని  ఆప్ వర్గాలు మండిపడ్డాయి. కేజ్రీవాల్‌ను ఇబ్బంది పెట్టేందుకే ఈడీ పదే పదే సమన్లు పంపుతోందని ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కోర్టు నిర్ణయం వచ్చేవరకు ఈడీ ఆగాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటికే ఐదు సార్లు ఈడీ విచారణకు గైర్హాజరైన కేజ్రీవాల్‌.. ఈ నెల 17న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈడీ కోర్టు విచారణకు హాజరయ్యారు. రాష్ట్ర బడ్జెట్‌, విశ్వాస తీర్మానం కారణంగా తాను ప్రత్యక్షంగా కోర్టుకు రాలేకపోయానని వివరించారు. మార్చి 16న జరిగే విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతానని తెలిపారు.