Telangana Gurukula Recruitment: తెలంగాణలోని గురుకులాలల్లో ఉసాధ్యాయ పోస్టుల (Gurukula Recruitment) భర్తీకి సంబంధించిన ప్రక్రియ మళ్లీ ఊపందుకోనుంది. ఇప్పటికే కొన్ని ఖాళీల నియామక ప్రక్రియ పూర్తికాగా.. మిగిలిన పోస్టుల భర్తీకి గురుకులు సొసైటీలు (Gurukula Societies) కసరత్తు మొదలుపెట్టాయి. పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా.. దివ్యాంగ అభ్యర్థులకు నిర్వహించిన వైద్యపరీక్షల ఫలితాలు ఆలస్యమవడంతో.. వీటిని మినహాయించి మిగతా అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలోని గురుకుల నియామక పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వలేకపోయారు. ఈ అభ్యర్థులకు నియామక పత్రాలను పోస్టు ద్వారా పంపిస్తామని చెప్పినప్పటికీ.. సార్వత్రిక ఎన్నికల కారణంగా ఎన్నికల కోడ్ వచ్చింది. దీంతో గురుకులాల్లో టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పోస్టులతో కలిపి దాదాపు 1600 పోస్టులకు పూర్తిస్థాయి ఫలితాలు, నియామకపత్రాల జారీ ప్రక్రియ ఆగిపోయింది.


ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల కోడ్ (Election Code) ముగియడంతో దివ్యాంగ కేటగిరీ అభ్యర్థుల (PWD) తుది ఫలితాలతోపాటు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులందరికీ నియామక పత్రాలు ఇవ్వాల్సి ఉంది. ఈనెలాఖరులోగా సాంకేతిక సమస్యలను అధిగమించి జులైలో పోస్టింగుల ప్రక్రియ పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు గురుకుల బోర్డు ఛైర్‌పర్సన్, ఐఏఎస్ అధికారిణి ఆయేషా మస్రత్ ఖానం ఆధ్వర్యంలో నియామక ప్రక్రియను ముగించేందుకు త్వరలో సభ్యులు సమావేశం కానున్నారు. గతేడాది చేపట్టిన ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్ పోస్టులకు పునఃపరీక్ష నిర్వహించాలని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. దీనిపైనా బోర్డు తుది నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు బోర్డుకు కార్యనిర్వాహక అధికారి(కన్వీనర్)గా ఉన్న మల్లయ్య భట్టు సర్వశిక్ష అభియాన్ పీడీగా బదిలీ అయ్యారు. ఈ బాధ్యతలను ఎవరికి అప్పగించాలన్న విషయమై ఇంకా నిర్ణయం జరగలేదు.


ప్రభుత్వ విభాగాల్లో తుది దశలో నియామక ప్రక్రియ..


➥ మరోవైపు ప్రభుత్వ విభాగాల్లో 1,540 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (AEE) పోస్టులకు సంబంధించి అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. అభ్యర్థులు తుది ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. 


➥ ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో 833 అసిస్టెంట్‌ ఇంజినీరు పోస్టుల తుది కీతో పాటు జీఆర్‌ఎల్‌ను కమిషన్‌ విడుదల చేసింది. 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితా రూపొందించి పత్రాల పరిశీలన చేయాల్సి ఉంది. 


➥ అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి సర్టఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ ముగిసింది. దివ్యాంగులైన అభ్యర్థులకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. 


➥ వెటర్నరీ అసిస్టెంట్‌ పోస్టులకు సంబంధించి అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ (GRL) విడుదలైంది. 


➥ పురపాలక శాఖలో అకౌంటెంట్‌ పోస్టులకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన ముగిసింది.


➥ భూగర్భ జలవనరుల శాఖలో గెజిటెడ్‌ పోస్టులకు ధ్రువీకరణ పత్రాల పరిశీలనను ఇప్పటికే కమిషన్‌ పూర్తి చేసింది. పోస్టుల ప్రాధాన్య క్రమం మేరకు అభ్యర్థుల నుంచి ఆప్షన్లు తీసుకుంది.


➥ సాంకేతికవిద్య విభాగంలోని 247 పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్టులకు కమిషన్‌ జీఆర్‌ఎల్‌ ప్రకటించింది. ఈ పోస్టులకు మెరిట్‌ జాబితా రూపొందించి పత్రాల పరిశీలన చేయాల్సి ఉంది.


➥ ఇంటర్‌ విద్య విభాగంలో 1,392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు తుది కీ వెల్లడైంది. రవాణా శాఖలో 113 ఏఎంవీఐ పోస్టులకు జూన్‌లో పత్రాల పరిశీలన జరగనుంది. వివిధ దశల్లోని నియామక ప్రక్రియను వేగంగా పూర్తిచేసి ఫలితాలు ప్రకటించాలని కమిషన్‌ భావిస్తోంది. 


ALSO READ:


➥ 'గ్రూప్-2' అభ్యర్థుల‌కు అల‌ర్ట్, ద‌ర‌ఖాస్తుల సవరణకు మరో అవకాశం 


కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 214 ఉద్యోగాలు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...