High Court Sitting Judge Probe on TSPSC Paper Leak: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌(TSPSC)లో ప్రశ్నపత్రాల లీకేజీ సహా పోటీ పరీక్షల నిర్వహణలో వైఫల్యాలపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ చేయించనున్నట్లు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. ఇందుకోసం సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. శాసనసభలోని తన కార్యాలయంలో సీఎం గురువారం విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.


TSPSC పేపర్ లీకేజీలు, పోటీ పరీక్ష నిర్వహణలో వైఫల్యాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరపాలన్నది తమ ప్రభుత్వ వైఖరి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఇందుకు సంబంధించి సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధేను రాష్ట్ర ప్రభుత్వం కోరుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో విచారణ జరుగుతుందని.. విచారణకు వచ్చినప్పుడు ప్రభుత్వం తరఫున అభ్యర్థన చేస్తామని ఆయన అన్నారు.  


ప్రస్తుతం ఉన్న టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, వారు చేపట్టిన ఏ నియామకాలపై విశ్వసనీయత లేదని రేవంత్ రెడ్డి అన్నారు. కమిషన్ సభ్యులు, చైర్మన్లు ఇప్పటికే రాజీనామాలు సమర్పించారని.. వారి రాజీనామాలను గవర్నర్ ఆమోదించిన వెంటనే కొత్త బోర్డును ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. స్వచ్ఛమైన పాలన అందించాలనేది తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమైన పనులను అప్పగించే ముందు అధికారుల చిత్తశుద్ది, నిజాయితీని చూస్తామని.. సీఎంవో, పోలీసు శాఖలో ఇప్పటివరకు జరిగిన అన్ని నియామకాలు దీనిని ప్రతిబింబిస్తున్నాయన్నారు. తాను అధికారులపై ప్రతీకారం తీర్చుకోబోనని సీఎం స్పష్టం చేశారు.


ALSO READ:


టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 పరీక్ష మళ్లీ వాయిదా? కొత్త బోర్డు ఆధ్వర్యంలోనే పరీక్షలు!
తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష మళ్లీ వాయిదాపడేలా కనిపిస్తోంది. ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ తొలుత భావించింది. అయితే నిరుద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు నవంబరు 2, 3 తేదీలకు రీషెడ్యూల్ చేసింది. నవంబరు 3 నుంచి అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ చేపట్టడంతో 2024 జనవరి 6, 7 తేదీలకు పరీక్షలు రీషెడ్యూల్ అయ్యాయి. అయితే, టీఎస్‌పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించిన నేపథ్యంలో.. కొత్త బోర్డు ఏర్పాటు తర్వాతే పరీక్షలు నిర్వహించాలని, వచ్చే నెలలో జరగాల్సిన పరీక్షలను రీషెడ్యూలు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు రీషెడ్యూల్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తదుపరి ఖాళీ తేదీలు, పరీక్ష కేంద్రాల అందుబాటు తదితర వివరాల మేరకు కమిషన్ త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశముంది.


గ్రూప్-2లో 783 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గతేడాది ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది.  ఈ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్-2 పోస్టులకు సంబంధించి  ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ షెడ్యూలు విడుదల చేసింది. అయితే గ్రూప్-1, గ్రూప్-4 పరీక్షలు, గురుకుల నియామక పరీక్షలతో పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు సమయం లేనందున గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. దీంతో పరీక్షలను నవంబరు 2, 3 తేదీలకు రీషెడ్యూలు చేస్తూ కమిషన్ నిర్ణయం తీసుకుంది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...