Agnipath Recruitment Scheme : రక్షణ దళాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ పథకాన్ని రేపు ప్రారంభించే అవకాశం ఉంది. ఈ పథకం ద్వారా నాలుగు సంవత్సరాల పదవీకాలానికి మాత్రమే దళాలను రిక్రూట్ చేస్తారు. ప్రణాళికల ప్రకారం, మూడు సర్వీసుల చీఫ్‌లు ఈ పథకం వివరాలను ప్రకటించడానికి విలేకరుల సమావేశంలో నిర్వహించే అవకాశం ఉంది. త్రివిధ దళాల అధిపతులు రెండు వారాల క్రితం ప్రధాని నరేంద్ర మోదీకి సైనికుల రిక్రూట్‌మెంట్ అగ్నిపథ్ పథకం గురించి వివరించారు. ఇది స్వల్పకాలిక పదవీకాలం కోసం సైన్యాన్ని చేర్చడానికి మార్గం సుగమం చేస్తుంది. ఈ పథకాన్ని సైనిక వ్యవహారాల శాఖ ప్లాన్ చేసి అమలు చేస్తోంది.


రక్షణ శాఖ నిధులు ఆదా 


అగ్నిపథ్ స్కీమ్ కింద యువకులు నాలుగు సంవత్సరాల పాటు సైన్యంలో చేరి దేశానికి సేవ చేస్తారు. ఈ పథకం రక్షణ దళాల ఖర్చులు , వయస్సు ప్రొఫైల్‌ తగ్గించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో ఒక భాగం. రిక్రూట్‌మెంట్ విధానంలో ఇదొక సమూల మార్పుగా పరిగణించవచ్చు. నాలుగు సంవత్సరాల సర్వీస్ తో దాదాపు 80 శాతం మంది సైనికులు విధుల నుంచి ఉపశమనం పొందుతారు. తదుపరి ఉపాధి మార్గాల కోసం సాయుధ దళాల నుంచి సహాయం పొందుతారు. అనేక సంస్థలు దేశానికి సేవ చేసిన, శిక్షణ పొందిన క్రమశిక్షణ కలిగిన యువతకు ఉద్యోగాలను రిజర్వ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. టూర్ ఆఫ్ డ్యూటీ కాన్సెప్ట్ కింద గణనీయమైన సంఖ్యలో సైనికులను రిక్రూట్ చేసుకుంటే వేతనం, అలెవెన్సులు పెన్షన్‌లలో వేల కోట్లు ఆదా అవుతుందని సాయుధ దళాల ప్రాథమిక లెక్కలు అంచనా వేసింది. రిక్రూట్ చేసుకున్న యువతలో అత్యుత్తమమైన వారిని తిరిగి ఖాళీలు అందుబాటులో ఉన్నట్లయితే, వారి సేవను కొనసాగించే అవకాశం ఉంది. ప్రపంచంలో ఎనిమిది దేశాలలో ఇలాంటి నియామక నమూనాలను అధ్యయనం చేసింది రక్షణ శాఖ. 


నాలుగేళ్ల సర్వీస్ 


సైన్యం, వైమానిక దళం, నౌకాదళ సైనిక సేవలు రిక్రూట్‌మెంట్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. కొత్తగా ప్రతిపాదించిన మార్పుల ప్రకారం రిక్రూట్ చేసిన సైనికులందరూ 4 సంవత్సరాల తర్వాత సర్వీస్ నుండి విడుదల అవుతారు. అంతే కాదు సర్వీస్ నుంచి రిలీజ్ అయిన వారిలో కొంత మందిని పూర్తి సేవల కోసం తిరిగి చేర్చుకోవడం తప్పనిసరి. ఈ మార్పులను టూర్ ఆఫ్ డ్యూటీ/అగ్నీపథ్ పథకంలో భాగంగా చేపట్టబోతున్నారు.