AP Group-1 Interviews: ఏపీపీఎస్సీ గ్రూప్-1 ఇంటర్వ్యూల నిలుపుదలకు రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది. రాష్ట్రంలో గ్రూప్-1 ఇంటర్వ్యూలు కొనసాగించాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి గ్రూప్ 1 ఫలితాలు ఉంటాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. కోర్టుకు అభ్యర్థుల మార్కుల వివరాలు, జవాబు పత్రాలను సమర్పించాలని ఏపీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థులకు సైతం సమాచారం ఇవ్వాలని ఆదేశాలలో పేర్కొంది.
సీల్డ్ కవర్లో మార్కులు, జవాబు పత్రాలు సమర్పించండి
వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం జూన్ 15వ తేదీ నుంచి జూన్ 29 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉంది. కానీ అవకతవకలు జరిగాయని ఆరోపణలు, నష్టపోయిన అభ్యర్థుల పిటిషన్లతో ఇంటర్వ్యూలపై సందిగ్దత నెలకొంది. నేటి మరోసారి విచారణ చేపట్టిన ధర్మాసనం ఇంటర్వ్యూలు యథాతథంగా నిర్వహించుకోవచ్చునని తీర్పు వెలువరించింది. పిటిషనర్ల సమాధాన పత్రాలను, మార్కుల వివరాలను సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించాలని కమిషన్‌ను ఆదేశించింది.
Also Read: Indian Railways Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్- లక్షన్నర ఉద్యోగాల భర్తీకి రైల్వేశాఖ ప్రకటన
అసలేం జరిగిందంటే..
గ్రూప్-1 ప్రధాన పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయని హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. డిజిటల్ వాల్యూషన్ గురించి చివరి దశలో తెలిపారని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు పిటిషనర్లు. తెలుగు మీడియం పేపర్లను రాష్ట్రంలోనూ, ఆంగ్ల మీడియం పేపర్లను ఇతర రాష్ట్రాల్లోనూ వాల్యూషన్ చేశారని పిటిషన్ లో చెప్పారు. ఈ కారణంగా ఆంగ్ల మీడియంలో రాసిన విద్యార్థులకు అన్యాయం జరిగిందని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులతో వాల్యూషన్ ఎలా చేయిస్తుందని వాదించారు.
నిబంధనల ప్రకారమే గ్రూప్-1 పరీక్షలు నిర్వహించామని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాల్యూషన్ గురించి ముందుగా చెప్పాల్సిన అవసరం లేదని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం గ్రూప్-1 ఇంటర్వ్యూ ప్రక్రియపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ -1 ఇంటర్వ్యూతో పాటు తదుపరి చర్యలన్నింటిని నిలువరిస్తూ..ఈ ఏడాది జూన్ 16 న హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ. ఏపీపీఎస్సీ అప్పీల్ దాఖలు చేసింది. అయితే తాజాగా వాదనలు విన్న ధర్మాసనం 3 నెలల్లో మాన్యువల్‌గా మూల్యాంకనం చేసి ఫలితాలు ఇవ్వాలని గతంలో ఆదేశించింది.