విజయవాడలోని ట్రాన్స్‌కోలో (ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ TRANSCO) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. దీని ద్వారా మొత్తం 16 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సంస్థ తెలిపింది. సీఏ/ సీఎంఏ (ఐసీడబ్ల్యూఏ) ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన వారిని దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా పరిగణిస్తారు. సంబంధిత ట్యాక్సేషన్ అండ్ అకౌంటింగ్ విషయాల్లో మూడేళ్ల అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.27,400 వేతనం చెల్లించనుంది. 

వయో పరిమితి..

జూలై 1, 2021 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయసున్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్లు మినహాయింపు ఇవ్వగా.. దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంది. మరిన్ని వివరాల కోసం ఏపీ ట్రాన్స్‌కో అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. 

దరఖాస్తు విధానం.. 

ఆఫ్‌లైన్ విధానం ద్వారా మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆసక్తి గల వారు ఆగస్టు 10వ తేదీలోగా దరఖాస్తులు పంపాలని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. 

దరఖాస్తులను పంపాల్సిన చిరునామా:

చీఫ్ జనరల్ మేనేజర్ (HR), 
ఏపీ ట్రాన్స్‌కో, 
విద్యుత్ సౌధ,  
విజయవాడ – 520004 
ఆంధ్రప్రదేశ్.


ఏపీ హైకోర్టులో పోస్టులు..
అమరావతిలో ఉన్న హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పలు పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 22 సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ 18 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా.. 4 పోస్టులను ట్రాన్స్ ఫర్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు తెలిపింది. బ్యాచిలర్స్‌ డిగ్రీ (లా) ఉత్తీర్ణత సాధించిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని పేర్కొంది. దరఖాస్తు స్వీకరణ జూలై 30న ప్రారంభం కాగా.. ఆగస్టు 30వ తేదీతో ముగియనుంది. ఆన్‌లైన్ విధానంలో ఏపీ హైకోర్టు పోస్టులకు దరఖాస్తులను స్వీకరిస్తోంది. 


హాల్ టికెట్లను సెప్టెంబర్ 15వ తేదీ నుంచి వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్క్రీనింగ్ టెస్ట్ అక్టోబర్ 10వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపింది. షార్ట్ లిస్టింగ్, కంప్యూటర్ ఆధారిత స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా వాయిస్ ఆధారంగా అర్హులను ఉద్యోగాలకు ఎంపిక చేయనుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400.. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.800 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాలలో పరీక్ష కేంద్రాలను కేటాయించినట్లు తెలిపింది.