APTET 2024: ఏపీ విద్యాశాఖ ఇటీవల విడుదలచేసిన నోటిఫికేషన్‌లో సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) పోస్టులకు B.Ed చదివిన అభ్యర్థులకు అర్హత కల్పించారు. అయితే దీనిపై కొంత మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు SGT పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనర్హులని స్పష్టం చేసింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించింది.  సెకండరీ గ్రేడ్‌ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనర్హులని ఇటీవల ఏపీ హైకోర్టు ప్రకటించిన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్జీటీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న బీఈడీ అభ్యర్థులందరికీ వారు చెల్లించిన ఫీజును రీఫండ్ చేస్తామని ప్రకటించింది. అభ్యర్థుల ఆధార్‌ నంబర్‌కు అనుసంధానమైన బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేస్తామని ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఫిబ్రవరి 23న ఒక ప్రకటనలో తెలిపారు. 


ఏపీ టెట్‌కు రాష్ట్రవ్యాప్తంగా 2,67,559 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారి హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. టెట్‌ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 120 కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు. ఎస్జీటీ అభ్యర్థుల్లో 76.5శాతం మందికి వారు ఎంపిక చేసుకున్న మొదటి ప్రాధాన్య కేంద్రాన్నే వారికి కేటాయించినట్లు తెలిపారు. 


సందేహాలకు హెల్ప్‌లైన్..
'టెట్' పరీక్ష కేంద్రాల గురించి ఎలాంటి సందేహాలు ఉన్నవారు.. వారివారి జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని విద్యాశాఖ కమిషనర్‌ సూచించారు. అభ్యర్థుల సౌకర్యార్థం టెట్‌, డీఎస్సీ కోసం హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు. అభ్యర్థులు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అవి పనిచేస్తాయన్నారు. 
హెల్ప్‌ డెస్క్‌ నెంబర్లు: 95056 19127, 97056 55349, 81219 47387, 81250 46997.


వెబ్‌సైట్‌లో టెట్ హాల్‌టికెట్లు..
ఏపీలో టీచర్‌ ఎలిజిబిలిటి టెస్ట్‌ (APTET)- 2024 పరీక్ష హాల్‌టికెట్లను విద్యాశాఖ ఫిబ్రవరి 23న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ ఐడీ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు  కంప్యూటర్ ఆధారిత విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయారోజుల్లో ప్రతిరోజూ రెండు సెషన్లలో టెట్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. టెట్ ప్రాథమిక 'కీ' మార్చి 10న విడుదల చేయనున్నారు. ఆన్సర్ కీపై మార్చి 11 వరకు ఈ కీపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం మార్చి 13న టెట్ తుది ఆన్సర్ కీని విడుదల చేయనున్నారు. మార్చి 14న టెట్‌ తుది ఫలితాలు విడుదల చేయనున్నారు.  డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. 


అర్హత మార్కులు.. 
ఏపీటెట్‌కు సంబంధించిన పేపర్-1, పేపర్-2 పరీక్షల్లో కనీస అర్హత మార్కులను ఓసీలకు 60 శాతంగా; బీసీలకు 50 శాతంగా; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు,ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 40 శాతంగా నిర్ణయించారు.


ఏపీటెట్ పరీక్ష తేదీలు..


➥ పేపర్-1ఎ : 27.02.2024 - 01.03.2024.


➥ పేపర్-2ఎ: 02.03.2024 - 04.03.2024 & 06.03.2024.


➥ పేపర్-1బి : 05.06.2024 (ఉదయం సెషన్).


➥ పేపర్-2బి : 05.06.2024 (మధ్యాహ్నం సెషన్).


ఏపీటెట్ 2024 హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


ఏపీటెట్ సిలబస్, పరీక్ష విధానం కోసం క్లిక్ చేయండి..


APTET Information Bulletin