AP TET 2022 : తెలంగాణలో కొలువుల జాతర మొదలైంది. వరుస నోటిఫికేషన్లకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అలాగే తాజాగా టెట్ పరీక్ష నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఏపీలో ఎప్పుడు నోటిఫికేషన్లు పడతాయో అని నిరుద్యోగులు వేచిచూస్తున్నారు. డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగార్థులకు ఒక గుడ్ న్యూస్ రాబోతుంది. జూన్ నెలలో ఏపీ టెట్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఏపీ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TET 2022)ను జూన్‌లో నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రతీ ఏడాది టెట్‌ పరీక్ష నిర్వహించాలని నిబంధన ఉన్నా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే దీనిని నిర్వహిస్తున్నారు. 


40 వేల స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 


ఏపీలో చివరిగా 2018లో టెట్ నిర్వహించారు. అప్పట్లో డీఎస్సీతో పాటు టెట్‌ నిర్వహించారు. 2018 నుంచి ఇప్పటి వరకు వేల మంది విద్యార్ధులు బీఈడీ, డీఈడీ కోర్సులు చేశారు. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజ్ ఉంటుంది. ఈ ఏడాది టెట్‌ నిర్వహణ తర్వాత ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టుల భర్తీ చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ ఇటీవల వెల్లడించారు. రాష్ట్రంలో సుమారు 6,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. సబ్జెక్ట్‌ టీచర్లతో బోధన ఉండేలా చూస్తామని మంత్రి అన్నారు. 35-40 వేల స్కూల్‌ అసిస్టెంట్లు పోస్టులు అవసరం ఉందన్నారు. ఎస్‌జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్‌లుగా పదోన్నతులు ఇచ్చి, ఆ తర్వాత ఏర్పడిన ఖాళీలను డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామన్నారు. 


తెలంగాణ టెట్ 


ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్‌ న్యూస్. డీఎస్సీ కోసం అవసరమయ్యే టెట్‌ నోటిఫికేషన్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. మార్చి 26 నుంచి ఏప్రిల్‌ 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు దాఖలు చేసుకోవచ్చు. జూన్‌ 12 టెట్‌ నిర్వహిస్తారు. టెట్‌ కు అవసరమైన ఏర్పాట్లు చకచకా పూర్తి చేస్తున్నట్టు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. 2015డిసెంబల్‌ 23న టెట్‌కు సంబంధించిన రెండు సవరణలు చేసింది ప్రభుత్వం. బీఈడీ పూర్తి చేసిన వాళ్లు కూడా ఎస్జీటీకి అర్హమైన పేపర్‌-1 కూడా రాసుకోవచ్చని తెలిపింది. ఉద్యోగం వచ్చిన తర్వాత బ్రిడ్జ్‌ కోర్సు పూర్తి చేయాలని చెప్పింది. అది ఆరునెలలు ఉంటుంది. ఒకసారి టెట్‌లో అర్హత మార్కులు సాధిస్తే అది జీవితాంతం వర్తిస్తుందని కూడా సవరించింది.


ఈ మధ్య జరిగిన శాసన సభ సమావేశాల్లో తెలంగాణ వ్యాప్తంగా 13 వేలకు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీలు గుర్తించామని వాటిని భర్తీ చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అప్పటి నుంచి ఉద్యోగార్థుల్లో ఆశలు చిగురించాయి. కోచింగ్ సెంటర్‌లు కిటకిటలాడటం మొదలయ్యాయి. ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ రావడంతో ప్రిపరేషన్ మరింత ఊపందుకోనుంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెట్‌ నిర్వహించడం ఇది మూడోసారి.