ఏపీలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి పోలీసు నియామకమండలి జనవరి 22న ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. OMR ఆధారితంగా పరీక్ష నిర్వహించారు. పరీక్ష కోసం మొత్తం 4 సెట్ల ప్రశ్నపత్రాలను ఎంపికచేశారు. అయితే పరీక్షలో అడిగిన ప్రశ్నల తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని విభాగాల నుంచి కఠినమైన ప్రశ్నలు, మరికొన్నింటి నుంచి కొంత సులువైన ప్రశ్నలు వచ్చాయని అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. గతంలో జరిగిన కానిస్టేబుల్ పరీక్షలతో పోలిస్తే ఈసారి ప్రశ్నల స్థాయి బాగా పెరిగిందని పేర్కొన్నారు.
సబ్జెక్టుపైన పట్టు, పూర్తి స్థాయిలో అంశాలపై అవగాహన ఉన్నవారే సమాధానాలు గుర్తించగలిగేలా ప్రశ్నలు ఉన్నాయని తెలిపారు. భౌతిక, రసాయన శాస్త్రాలు, ఆంగ్లం నుంచి కఠినమైన ప్రశ్నలొచ్చాయని.. చరిత్ర, పాలిటీ విభాగాల నుంచి అడిగిన ప్రశ్నలు కొంత సులువుగా ఉన్నాయని వారు వివరించారు. భౌతిక శాస్త్రం నుంచి మొత్తం 8 ప్రశ్నలు రాగా.. వాటిలో ఆరు కఠినంగా ఉన్నాయని తెలిపారు. భౌగోళిక, ఆర్థిక శాస్త్రాల ప్రశ్నలు ఓ మోస్తరుగా ఉన్నాయని తెలిపారు. కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ అంశాలపైన ఎక్కువ ప్రశ్నలు అడిగారు. అరిథ్‌మెటిక్, రీజనింగ్ విభాగాల నుంచి సాధారణ స్థాయిలోనే ప్రశ్నలు అడిగినట్లు అభ్యర్థులు చెబుతున్నారు.
పరీక్షకు 91 శాతం హాజరు..
ఏపీలో 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి జనవరి 22న నిర్వహించిన ప్రిలిమినరీ రాతపరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 34 నగరాలు, పట్టణాల్లో 997 పరీక్ష కేంద్రాల్లో కానిస్టేబుల్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,09,579 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 5,03,487 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నవారిలో 4,58,219 మంది మాత్రమే అంటే 91 శాతం అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 45,268 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాలేదు. పరీక్ష రాసిన వారిని లెక్కలోకి తీసుకుంటే ఒక్కో పోస్టుకు 75 మంది పోటీపడుతున్నారు. కానిస్టేబుల్ రాత పరీక్ష ఫలితాలను రెండు వారాల్లోగా వెల్లడించనున్నట్లు పోలీసు నియామక మండలి తెలిపింది. ఫలితాలను స్కాన్ చేసిన ఓఎంఆర్ షీట్లతో కలిపి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనున్నట్లు వెల్లడించింది.
➥ కానిస్టేబుల్ పరీక్షకు 91 శాతం అభ్యర్థులు హాజరు, రెండు వారాల్లో ఫలితాలు!
వెబ్‌సైట్‌లో ఆన్సర్ 'కీ' అందుబాటులో.. అభ్యంతరాలకు అవకాశం
కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక ఆన్సర్ కీని పోలీసు నియామక మండలి జనవరి 22న రాత్రి 8 గంటలకు విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. రాతపరీక్షలో అభ్యర్థులకు ఇచ్చిన నాలుగు సెట్లకు (సెట్-ఎ, సెట్-బి, సెట్-సి, సెట్-డి) సంబంధించిన క్వశ్చన్ పేపర్లను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆన్సర్ కీ చూసుకోవచ్చు. కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక ఆన్సర్ కీపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఆన్సర్ కీపై అభ్యంతరాలున్న అభ్యర్థులు జనవరి 25న సాయంత్రం 5 గంటల వరకు తెలపవచ్చు. అభ్యర్థులు తమ అభ్యంతరాలను ఈమెయిల్ ద్వారా తెలపాల్సి ఉంటుంది. మరే ఇతర విధానంలోనూ పంపే అభ్యంతరాలను పరిగణనలోకీ తీసుకోమని పోలీసు నియామక మండలి స్పష్టం చేసింది. ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన అభ్యర్థుల స్కానింగ్ OMR పత్రాలను రెండువారాల్లోగా అందుబాటులో ఉంచడంతోపాటు ఫలితాలను కూడా వెల్లడించనున్నట్లు పోలీసు నియామక మండలి ప్రకటించింది. Mail ID: mail-slprb@ap.gov.in
➥ కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్, ఆన్సర్ కీ, క్వశ్చన్ పేపర్లు వచ్చేశాయ్, డైరెక్ట్ లింక్ ఇదే!
నిమిషం నిబంధనతో అవకాశం కోల్పోయిన పలువురు..
ఉదయం 10 గంటలకు పరీక్ష మొదలవగా.. తర్వాత నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను అనుమతించలేదు. ఈ నిబంధనతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అనేక మంది పరీక్ష రాయలేకపోయారు. వివిధ కారణాలవల్ల తాము సకాలంలో కేంద్రానికి చేరుకోలేకపోయమంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలోనూ పలు కేంద్రాల్లో అభ్యర్థులు సకాలంలో హాజరు కాలేకపోయారు. ప్రకాశం జిల్లాలోని పలు కేంద్రాల్లో అభ్యర్థులు ఫొటో గుర్తింపు కార్డులు లేకుండా పరీక్షకు హాజరవడంతో అధికారులు వెనక్కి పంపించేశారు. కొన్ని చోట్ల అభ్యర్థులు హాల్‌టికెట్లు తీసుకెళ్లకుండా పరీక్షా కేంద్రాలకు వెళ్లారు. ఆ కేంద్రాల సిబ్బంది హాల్‌టికెట్ల ప్రింట్లు తీసిచ్చారు.
ఫిబ్రవరి 19న ఎస్‌ఐ ప్రిలిమినరీ రాతపరీక్ష..
మరోవైపు ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన దరఖాస్తు గడువు జనవరి 18న సాయంత్రం 5 గంటలకు ముగిసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు గడువు ముగిసే సమయానికి మొత్తం 1,73,047 మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. వీరిలో పురుషులు 1,40,453 మంది ఉండగా..మహిళలు 32,594 మంది ఉన్నారు. మొత్తం 411 ఎస్‌ఐ పోస్టులకు 1,73,047 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. అంటే ఒక్కో పోస్టుకు 421 మంది పోటీ పడుతున్నారు. ఎస్‌ఐ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 5 నుంచి పరీక్ష హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు.