గుండెపోటు రావాలంటే ఆ వ్యక్తికి డయాబెటిస్ ఉండాలి, హైపర్ టెన్షన్, అధిక కొలెస్ట్రాల్ వంటి అనారోగ్యాలు ఉండి తీరాలి. కానీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా, ఎలాంటి లక్షణాలు చూపించకుండా ఓ వ్యక్తికి ఆకస్మికంగా గుండెపోటు వస్తుందా? వచ్చే అవకాశం ఉందని ఒక రోగి కేసు నిరూపించింది. ఢిల్లీకి చెందిన 42 ఏళ్ల వ్యక్తికి డయాబెటిస్, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఏవీ లేవు. కొన్ని రోజుల క్రితం అతనికి గుండెలో ఏదో అసౌకర్యంగా అనిపించి, వెంటనే కుప్పకూలిపోయాడు. అదృష్టం కొద్ది సమయానికి ఆసుపత్రిలో చేర్చడం, యాంజియో ప్లాస్టిక్ చేయడం వల్ల బతికి బయటపడ్డాడు. ఈ వ్యక్తి కేసును బట్టి ఏ సమస్యా లేనివారు తమకు గుండెపోటు రాదు అనే నమ్మకాన్ని విడిచిపెట్టాలని అర్థమవుతోంది. 


అసలేం జరిగింది...
కారులో వెళుతున్న 42 ఏళ్ల వ్యక్తి అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో అంబులెన్స్ కి కాల్ చేశారు కుటుంబ సభ్యులు. అంబులెన్స్ లో అతనికి పదేపదే CPR ఇస్తూనే ఉన్నారు అయినా పరిస్థితి మెరుగుపడలేదు. ఆసుపత్రికి వచ్చాక CPRతో పాటు షాక్ చికిత్స కూడా అందించారు. అయినా ఏమీ మార్పు రాలేదు. వెంటిలేటర్ సపోర్ట్ మీద ఉంచారు వైద్యులు. అతనికి ఎందుకు గుండెపోటు వచ్చిందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. గుండె రక్తనాళం అయినా ప్రధాన ధమని దాదాపు 99 శాతానికి పైగా పూడుకుపోయినట్టు గుర్తించారు. దీనివల్లే అతనికి రక్తప్రసరణ జరగక గుండె పోటు వచ్చినట్టు చెబుతున్నారు వైద్యులు. దానికి యాంజియో ప్లాస్టీ చేసి గుండెను పనితీరును మళ్ళీ సాధారణం అయ్యేలా చేశారు. గుండె 100% పని చేయకపోయినా 30 శాతం పనిచేయడం మొదలుపెట్టడంతో డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం 60 శాతానికి పైగా అతని గుండె పని చేయడం మొదలుపెట్టింది.


ఆ కేసును డీల్ చేసిన వైద్యులు మాట్లాడుతూ ఇలాంటి కేసు చాలా కష్టమైనదని, అతనికి పదేపదే కార్డియాక్ అరెస్టులు వస్తున్న పరిస్థితుల్లో ఉన్నాడని చెప్పారు. CPR, షాక్‌లు ఇస్తూనే ఉన్నట్టు తెలిపారు. ఇదే నిశ్శబ్ద గుండెపోటు అని, ఎలాంటి లక్షణాలు చూపించకుండానే వస్తుందని వివరించారు. కేవలం డయాబెటిస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ వంటివే కాదు మనకు తెలియకుండానే ధమనులు పూడుకు పోవడం, అలా పూడుకుపోయినప్పటికీ ఎలాంటి లక్షణాలు చూపించకపోవడం వల్ల కూడా హఠాత్తుగా గుండెపోటు రావచ్చు. ఒత్తిడి వంటివి ఈ నిశ్శబ్ద గుండెపోటుకు కారణం అవుతాయి. తీవ్ర ఒత్తిడి వల్ల రక్తం గడ్డ కట్టడం, ఆ గడ్డ తక్కువ సమయంలోనే పెరగడం జరుగుతుంది. దీంతో ధమనుల్లో రక్త సరఫరా నిలిచి పోవడం వంటివి జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పుడు ఆ రోగి రక్తాన్ని పలుచన చేసే మందులు, కొలెస్ట్రాల్ తగ్గించే మందులను వాడుతున్నారు. అలాగే వైద్యులు చెప్పిన ప్రకారం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటున్నారు. ఒక మూడు నెలల తర్వాత అతను సైక్లింగ్, వాకింగ్ వంటివి చేయవచ్చు. 


Also read: ఇవన్నీ సూపర్‌ఫుడ్స్ - నానబెట్టుకుని తింటే ఆరోగ్యంతో పాటు అందం కూడా



























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.