AP DSC 2025 certificate verification | అమరావతి: ఏపీలో నిర్వహించిన మెగా డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మంగళవారానికి వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం (ఆగస్టు 25) నుంచి అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభం కావాలి.. కానీ ఈ ప్రక్రియను ఒకరోజు పాటు వాయిదా వేసినట్లు పాఠశాల విద్యాశాఖ ఆదివారం రాత్రి కీలక ప్రకటన చేసింది. పాఠశాల విద్యాశాఖ ఇదివరకే మెగా డీఎస్సీ 2025 మెరిట్ జాబితాను విడుదల చేసింది. డీఎస్సీలో వచ్చిన స్కోర్‌తోపాటు అర్హులైన వారికి ఆయా కేటగిరీల్లో ర్యాంకులు సైతం కేటాయించారు. ఏపీ మెగా డీఎస్సీ ఫలితాల కోసం క్లిక్ చేయండి https://apdsc.apcfss.in/MeritList1
1:1 విధానంలో మెరిట్ అభ్యర్థులకు కాల్ లెటర్స్
రిజర్వేషన్లు, స్థానికత ఆధారంగా ఏపీ డీఎస్సీ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం ఆదివారం నాడు 1:1 విధానంలో కాల్‌లెటర్లు జారీచేయాల్సి ఉంది. అయితే మెగా డీఎస్సీ ద్వారా జరుగుతున్న టీచర్ పోస్టుల భర్తీలో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు మెరిట్ జాబితాలను, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం కాల్ లెటర్ జారీ జాబితాను రీ చెక్ చేస్తున్నారు. విద్యాశాఖ తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అభ్యర్థుల లాగిన్‌కు ఆదివారం కాల్ లెటర్లు రావాలి. నేడు (సోమవారం) మెరిట్ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ మొదలు కావాల్సి ఉండగా.. కాల్ లెటర్ల ప్రక్రియపై విద్యాశాఖ అప్‌డేట్ ఇచ్చింది. డీఎస్సీ అభ్యర్థులకు కాల్ లెటర్లను సోమవారం ఉదయం నుంచి వారి లాగిన్‌లో అందుబాటులో ఉంచుతామని ఆదివారం రాత్రి ప్రకటించింది.
డీఎస్సీ టాపర్‌కు హోం మంత్రి అనిత సత్కారంనక్కపల్లి: ఏపీ మెగా డీఎస్సీ 2025లో మూడు విభాగాల్లో రాష్ట్ర స్థాయి తొలి ర్యాంక్ సాధించిన వమ్మవరానికి చెందిన సుంకరణం విజయ్‌ను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత సత్కరించారు. నక్కపల్లి క్యాంప్ కార్యాలయంలో విజయ్‌ను అభినందిస్తూ మంత్రి అనిత సన్మానం చేశారు. పాయకరావుపేట నియోజకవర్గం ఎస్.రాయవరం మండలానికి చెందిన విజయ్ ఇటీవల ఏపీ ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో అసాధారణ ప్రతిభ కనబరిచాడు. స్కూల్ అసిస్టెంట్ (గణితం) విభాగంలో 94.7 మార్కులు, టీజీటీ (గణితం)లో 87.3 మార్కులు, పీజీటీ (గణితం)లో 78.5 మార్కులు సాధించి మూడు విభాగాల్లోనూ రాష్ట్ర స్థాయి ఫస్ట్ ర్యాంక్ సాధించడం విశేషం. ఆ అభ్యర్థి విజయాన్ని హోం మంత్రి అనిత గర్వకారణంగా పేర్కొన్నారు. విజయ్ పట్టుదల, కృషి, అంకితభావానికి డీఎస్సీ ఫలితాలే నిదర్శనమని ఆమె అన్నారు. నేటి యువతకు విజయ్ ప్రేరణగా నిలుస్తాడని ఆమె కొనియాడారు. మెగా డీఎస్సీ 2025లో మంచి ర్యాంకులు సాధించిన ఇతర అభ్యర్థులను కూడా మంత్రి వంగలపూడి అనిత అభినందించారు.