AP DSC 2024 Notification: ఏపీలోని నిరుద్యోగులకు జగన్ సర్కారు సంక్రాంతి కానుకగా గుడ్ న్యూస్ తెలిపింది. సంక్రాంతి పండగ తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జనవరి 13న ఒక ప్రకటనలో తెలిపారు. డీఎస్సీపై ముఖ్యమంత్రి జగన్ సమావేశం నిర్వహించారని, ఈ సమావేశంలో డీఎస్సీ నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
మెగా డీఎస్సీలో ఎన్ని పోస్టులు?
గతేడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 771 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత సెప్టెంబరులో జరిగిన సమావేశాల్లో18,520 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిల్లో 8,366 పోస్టులు మాత్రమే అవసరమని శాసనమండలిలో వెల్లడించారు. రాష్ట్రంలో 1,88,162 ఉపాధ్యాయ పోస్టులు ఉంటే 1,69,642 మంది పని చేస్తున్నట్లు ప్రభుత్వమే లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చింది. ఈ లెక్కన 18 వేలకు పైగా ఖాళీలున్నాయి. మంత్రి బొత్స మాత్రం 8,366 పోస్టులే అవసరమంటున్నారు. మిగతా 10,154 పోస్టుల్ని ప్రభుత్వం రద్దు చేస్తుందా? లేదంటే 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం పోస్టుల సర్దుబాటు, వందశాతం పదోన్నతుల సాకుతో ఎత్తేసిందో స్పష్టత లేదు.
డీఎస్సీ కోసం నిరుద్యోగుల ఆందోళనలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో అనేక వర్గాల వారి ఆందోళనలతో ఏపీ అట్టుడుకుతోంది. ఇప్పటికే అంగన్వాడీ కార్యకర్తలు, మున్సిపల్ కార్మికులు, సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు ఇలా వివిధ వర్గాల వారు ఆందోళనలు నిర్వహిస్తుంటే నిరుద్యోగులు సైతం మెగా డీఎస్సీ కోసం నిరసనల బాట పట్టారు. ఇప్పటికే జనవరి మొదటి వారంలోగా డీఎస్సీ ప్రకటన చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించిన విషయం తెలిసిందే. మెగా డీఎస్సీని వెంటనే ప్రకటించాలని రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల ముందు నిరుద్యోగులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని నిరుద్యోగ యువత మండిపడ్డారు.
నాలుగేళ్లుగా నాన్చుతున్నారు..
నాలుగు సంవత్సరాలుగా నోటిఫికేషన్ విడుదల చేస్తారని స్టడీ సెంటర్లలో ఉంటూ సన్నద్ధం అవుతున్నామని విద్యార్థులు ఆవేదన వెలిబుచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతున్నారు. నోటిఫికేషన్ ఇవ్వని పక్షంలో వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు నిరుద్యోగులంతా ఏకమవుతారని స్పష్టం చేశారు. తెలంగాణలో నిరుద్యోగులు ఏకమై అధికార మార్పడి చేసినట్లే ఆంధ్రప్రదేశ్‌లోనూ వచ్చే ఎన్నికల్లో అధికార మార్పిడికి పాటు పడుతామని నిరుద్యోగులు స్పష్టం చేశారు. మెగా డీఎస్సీని విడుదల చేయకుంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మెగా డీఎస్సీ పై మంత్రి బొత్స సత్యనారాయణ రోజుకో మాట మాట్లాడుతున్నారని జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో హేతుబద్దీకరణ పేరుతో 2000 స్కూళ్లను మూసివేసారని 15 వేల ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేశారని వారు మండిపడుతున్నారు.తక్షణం మెగా డీఎస్సీ ఇవ్వాలన్నారు. ఏపీలో 40 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించడంతో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.