Is Chiranjeevi CM Candidate of Congress:

  తిరుపతి: వచ్చే ఎన్నిల్లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఎంపీ చింతా మోహన్ (Chinta Mohan) అన్నారు. ఏపీ ఎన్నికల్లో 130 అసెంబ్లీ స్థానాలు, 20 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ గెలవబోతుందని జోస్యం చెప్పారు. రాజకీయాల్లోకి మళ్లీ వచ్చి చిరంజీవి (Chiranjeevi) పోటీ చేస్తే 50 వేల ఓట్లతో గెలిపించుకుంటాం అన్నారు. కాపులకు సీఎం అయ్యే అవకాశం వచ్చిందని, చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేస్తే సీఎం కావడం ఖాయం అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ అన్నారు.


I.N.D.I.A కూటమి పార్టీలతో కలిసి బరిలోకి.. 
గత 10 ఏళ్లలో రాష్ట్ర ప్రజలు ఆదరణకు నోచుకోలేదని, అంతా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని.. ఏపీలో ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ ఉండదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో I.N.D.I.A కూటమి లో ఉన్న పార్టీలతో కలిసి పోటీ చేస్తామని తెలిపారు. కాకినాడ లోక్ సభ నుంచి CPM పార్టీ జాతీయ నాయకుడు సీతారాం ఏచూరి పోటీ చేయాలని కోరారు. నగరి అసెంబ్లీ నుంచి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను పోటీ చేయాలని కోరినట్లు చెప్పారు. గత కొంతకాలం నుంచి ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మంచి స్పందన వస్తోందన్నారు. కాంగ్రెస్ రావాలని.. కావాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ముక్తకంఠంతో కోరుకుంటున్నారని పేర్కొన్నారు.



రాష్ట్రానికి సీఎం కావాలని కోరుకుంటున్న కాపులకు ఇదే మంచి అవకాశం అన్నారు మాజీ ఎంపీ చింతా మోహన్. చిరంజీవి తిరుపతి అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తే 50 వేల మెజార్టీతో గెలిపిస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి నుంచి పోటీ చేస్తే చిరంజీవి సీఎం కావడం ఖాయమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలా, వద్దా అనేది చిరంజీవి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.


ఏపీ ప్రజల్లో అనుకోకుండా మార్పు వచ్చిందన్న చింతా మోహన్ 
‘ప్రజల్లో సడన్ గా మార్పు వచ్చింది. ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకు ఎక్కడ అడిగినా మార్పు కనిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని, తాము కోరుకున్న అభివృద్ధి, ఉద్యోగాలు, ఇళ్లు ఏవీ తమకు రాలేదని ప్రజలు మాకు చెప్పారు. ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లినా, పోలీస్ స్టేషన్ కు వెళ్లినా ఎక్కడా తమకు న్యాయం జరగలేదని ప్రజలు చెబుతున్నారు. ఏపీలో ప్రాంతీయ పార్టీలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీపై నమ్మకం పెంచుకున్నారు. 1978లో చంద్రబాబు చంద్రగిరి నుంచి పోటీ చేసిన సమయంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో పీవీ నరసింహరావు ఎన్ని సీట్లు వస్తాయని అడిగితే 26 వస్తాయని చెప్పాను. 1996లో కాంగ్రెస్ కు ఎన్నిసీట్లు వస్తాయని రోశయ్యతో అడిగించారు. 130 సీట్లు వస్తాయని చెప్పాను. ఆ సమయంలో 132 సీట్లు వచ్చాయి. 2000 సంవత్సరంలో యూపీలో ఎన్ని సీట్లు వస్తాయని రామోజీరావు అడిగితే 200 సీట్లు వస్తాయని చెప్పాను. దాదాపు అదే తీరుగా సీట్లొచ్చాయి. ప్రజా నాడీ గురించి బాగా తెలుసు. కాపులు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అందుకు ఇదే సరైన సమయం. చిరంజీవిని తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని కోరుతున్నాను. ఆయన కేవలం నామినేషన్ వేసి వెళ్తే.. 50 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటాం. చిరంజీవిని సీఎం చేసుకుంటాం. కాపులు ఏ విధమైన నిర్ణయమైనా తీసుకోవచ్చు. ఇప్పుడు తప్పితే మరో 10 ఏళ్ల వరకు కాపులకు అవకాశం రాదు’ అని చింతా మోహన్ మీడియాతో అన్నారు.