India Post GDS Results: దేశంలోని వివిధ పోస్టల్ సర్కిళ్ల పరిధిలో ఉన్న తపాలా కార్యాలయాల్లో గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి సంబంధించి ఎంపికైన అభ్యర్థుల తొలి జాబితాను అధికారులు ఆగస్టు 19న విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు పదోతరగతిలో సాధించిన మార్కులు/ గ్రేడ్‌ మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. కంప్యూటర్‌ జనరేటెడ్‌ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేశారు.


ఫలితాలకు సంబంధించి మొదటి జాబితాలో ఏపీ నుంచి 1356 మంది అభ్యర్థులు, తెలంగాణ నుంచి 980 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు అర్హత సాధించారు. గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ పరిధిలో 1355 పోస్టులు ఉండగా, తెలంగాణ పరిధిలో 981 చొప్పున పోస్టులను భర్తీ చేయనున్నారు. తొలి జాబితాలో ఎంపికైన అభ్యర్థులు సెప్టెంబర్ 3లోగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్‌గా సేవలు అందించాల్సి ఉంటుంది. 


ఏపీ నుంచి ఎంపికైన అభ్యర్థుల జాబితా కోసం క్లిక్ చేయండి..


తెలంగాణ నుంచి ఎంపికైన అభ్యర్థుల జాబితా కోసం క్లిక్ చేయండి..


దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టాఫీసుల్లో 44,228 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి జులై 12న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఇందుకోసం జులై 15  నుంచి ఆగస్టు 5 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థులకు ఆగస్టు 6 నుంచి 8 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. పదోతరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు.


ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి రూ.10,000 - రూ.12,000 ప్రారంభ వేతనం అందుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్ సేవక్‌లకు ప్రోత్సాహం అందిస్తారు. ఆ సేవల విలువ ప్రకారం ఇంటెన్సివ్ ఆధారపడి ఉంటుంది. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్‌టాప్/ కంప్యూటర్/ స్మార్ట్ ఫోన్ లాంటివి తపాలా శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. సైకిల్ తొక్కడం రావాలి.


సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అవసరమయ్యే డాక్యుమెంట్లు ఇవే..


➥ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రింట్ కాపీ 


➥ పుట్టినతేదీ ధ్రువీకరణ కోసం పదోతరగతి మార్కుల మెమో 


➥ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు


➥ అభ్యర్థి పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు 


➥ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (TC) 


➥ కుల ధ్రువీకరణ పత్రం (కమ్యూనిటీ సర్టిఫికేట్) 


➥ఆధార్ కార్డు 


➥ ఆదాయ ధ్రువీకరణపత్రం (ఇన్‌కమ్ సర్టిఫికేట్)


➥ దివ్యాంగ ధ్రువీకరణ పత్రం (దివ్యాంగులైతే) 


➥ మెడికల్ సర్టిఫికెట్.


➥ ఇతర అవసరమైన అన్ని సర్టిఫికేట్లు, రెండు జతల జిరాక్స్ కాపీలు


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..