APPSC postpones Group 1 Mains Exam | అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాల్సి ఉంది. అయితే ప్రిపరేషన్ కు మరింత సమయం కావాలని మెయిన్స్ అభ్యర్థుల నుంచి భారీ ఎత్తున ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్ 1 మెయిన్స్ వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం రాత్రి ఏపీపీఎస్సీ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహించనున్నారు అనే సవరించిన షెడ్యూల్ త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.


గ్రూప్-1 పోస్టుల భర్తీకి మార్చి 17న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు గ్రూప్-1 పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోగా.. వీరిలో పేపర్-1 పరీక్షకు 91,463 (72.55 %) మంది, పేపర్-2 కు 90,777 (72 %) మంది అభ్యర్థులు హాజరు కావడం తెలిసిందే. 2 పేపర్లు రాసిన వారిని మాత్రమే గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ కు ఎంపిక చేస్తారు. ఏపీ వ్యాప్తంగా 301 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి  మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 గ్రూప్-1 పరీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పేపర్-2 నిర్వహించారు. 


మెయిన్స్ పరీక్ష విధానం..
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలో మొత్తం 5 మెయిన్ పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 3 గంటలు కేటాయించారు. డిస్క్రిప్టివ్ విధానంలో ఏపీపీఎస్సీ ఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తోంది. వీటితో పాటు ల్యాంగేజ్ పేపర్లు తెలుగు, ఇంగ్లీష్ కూడా ఉంటాయి. ఈ పేపర్లు కేవలం అభ్యర్థుల అర్హత పరీక్షలు మాత్రమే. మొత్తం 5 ప్రధాన పేపర్లలో ఒక్కో పేపరుకు 150 మార్కుల ఉంటాయి. మొత్తం 750 మార్కులకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తోంది ఏపీపీఎస్సీ. మెయిన్స్ అర్హత సాధించిన అభ్యర్థులకు 75 మార్కులకు ఇంటర్వ్యూ చేసి.. ఓవరాల్ గా 825 మార్కులకుగానూ మెరిట్ లిస్ట్ చేస్తారు. 


Also Read: ఏపీ, తెలంగాణ జీడీఎస్ ఫలితాలు విడుదల, సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు ఇదే!