Happy Birthday Megastar Chiranjeevi | సినిమాలు, నిజ జీవితం ఒకటి కాదు. ఓ సినిమాలో భార్యగా నటిస్తే, మరో సినిమాలో అదే నటి చెల్లెలుగా చేస్తుంటారు. ఓసారి చెల్లెలుగా నటించినా.. ఛాన్స్ వస్తే మరో సినిమాలో ప్రియురాలిగా, భార్యగా నటీనటులు ఆ పాత్రల్ని పోషించడం తెలిసిందే. అయితే చెల్లెలుగా రమ్యకృష్ణతో రొమాన్స్ ఎలా చేశారు అనే రిపోర్టర్ ప్రశ్నకు చిరంజీవి ఇచ్చిన మెగా కౌంటర్ మీకు తెలుసా?


ఇది చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్న 2012 నాటి సంఘటన. అప్పట్లో ఢిల్లీ లో తెలుగు రిపోర్టర్ లు పరిమిత సంఖ్యలో ఉండేవారు. మొత్తంగా లెక్కేస్తే ఓ 15 మంది ఉండేవారు. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి చిరంజీవి ఆఫీస్ పార్లమెంట్ కు దగ్గర లోని ట్రాన్స్ పోర్ట్ భవనం లో ఉండేది. Z కేటగిరీ ఏరియా కావడంతో అభిమానుల హడావుడి అంతగా ఉండేది కాదు. రిపోర్టర్ లు కాస్త ఫ్రీగానే కేంద్ర మంత్రులను కలిసే పరిస్థితి ఉండేది. అందులో భాగంగా ఒకసారి ఏదో ప్రెస్ మీట్ అయ్యాక చిరంజీవి జర్నలిస్టు లతో సరదాగా చిట్ చాట్ చేస్తున్నారు. 


ఆ సమయంలో ఒక రిపోర్టర్ మాట్లాడుతూ "సర్. సినిమాల్లో చెల్లెలుగా చేసిన హీరోయిన్ లతో వేరే సినిమాలో రొమాన్స్ ఎలా చేస్తారు. మీరు కూడా " చక్రవర్తి " సినిమాలో హీరోయిన్ రమ్యకృష్ణకు అన్నగా నటించారు. కానీ తరువాత ముగ్గురు మొనగాళ్లు, అల్లుడా మజాకా లాంటి సినిమాల్లో ఆమెతో కలిసి ఆడి పాడారు. రొమాన్స్ చేశారు. ఇది తప్పుగా అనిపించలేదా " అని అడిగాడు. ఇది విన్న మిగిలిన రిపోర్టర్ లు అందరూ చిరంజీవి ఫీల్ అవుతారేమో అని ఒక్కసారిగా ఆశ్చర్యంతో ముఖాలు చూసుకున్నారు.  కానీ ఆయన చాలా కూల్ గా ఇచ్చిన రిప్లై మాత్రం ఎపిక్ అనే చెప్పాలి. 


" చూడు బాబూ.. చక్రవర్తి సినిమా కంటే ముందు ఖైదీ, అడవిదొంగ, దొంగ మొగుడు లాంటి పెద్ద హిట్ లే నాకు ఉన్నాయి. ఇక ముగ్గురు మొనగాళ్లు టైంకి నేను టాప్ స్టార్ గా ఉన్నాను. ఆ టైం లో నా పక్కన ఆ అమ్మాయి చెల్లెలుగా చేసింది. కాబట్టి హీరోయిన్ గా చెయ్యను అని చెప్పొచ్చు. అప్పుడు మీ పేపర్లలలో చిరంజీవి సూపర్... గొప్ప నీతివంతుడు అని ఒక ఆర్టికల్ వస్తుంది. అలాగే మా హీరో ఎంత గొప్పోడో చూసారా.. అని ఫ్యాన్స్ కాలర్ ఎగరేయవచ్చు. దీనివల్ల నాకు పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. కానీ కెరీర్ మీద ఎన్నో ఆశలతో సినిమాల్లోకి వచ్చిన ఒక అమ్మాయి టాప్ లో ఉన్న హీరో పక్కన హీరోయిన్ గా నటించే అవకాశం కోల్పోతుంది కదా. టాప్ స్టార్స్ పక్కన హీరోయిన్ గా నటిస్తే వచ్చే ఫేమ్ తో కనీసం 10 సినిమాల్లో హీరోయిన్ గా చేసే అవకాశం వస్తుంది. అవన్నీ ఆ అమ్మాయికి దూరం కావా...? నేనేదో గొప్పవాడు అనిపించుకోవడం కోవడం కంటే ఒక అమ్మాయి కెరీర్ కు ఊతం ఇవ్వడం బెటర్ కదా’ అని ఎంతో ప్రశాంతంగా చెప్పారు చిరంజీవి. ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టే ఆయన మెగాస్టార్ అయ్యారేమో..! అని టాలీవుడ్ ప్రేక్షకులు భావిస్తుంటారు.


చక్రవర్తి సినిమా 1987 లో వచ్చింది. ఇందులో భానుప్రియ హీరోయిన్ కాగా చిరంజీవి ఫ్రెండ్ పాత్రలో మరో స్టార్ నటుడు మోహన్ బాబు నటించారు. చిరంజీవికి చెల్లెలు పాత్రలో రమ్యకృష్ణ కనిపిస్తారు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అంతగా హిట్ కాలేదు. తరువాత ముగ్గురు మొనగాళ్లు, అల్లుడా మజాకా, ఇద్దరు మిత్రులు లాంటి సినిమాల్లో చిరంజీవి రమ్యకృష్ణ జంటగా నటించడం తెలిసిందే.
Also Read: Indra Movie: "ఇంద్ర" సక్సెస్ సీక్రెట్ చెప్పిన చిరంజీవి- రీ రిలీజ్ సందర్భంగా ప్రత్యేక వీడియో విడుదల