Tanusree Dattha On Hema Committee Report: మలయాళీ సినీ పరిశ్రమలో మహిళల వేధింపులపై తాజాగా జస్టిస్ హేమ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఈ నివేదిక అక్కడి సినీ పరిశ్రమలో మహిళా నటీమణులు ఎలాంటి వేధింపులు ఎదుర్కొంటున్నారో పూస గుచ్చినట్లు వివరించింది. మొత్తం 235 పేజీలు ఉన్న ఈ నివేదికలో మహిళా, పురుష నటీనటుల వేతనాల్లో వ్యత్యాసాలు, మహిళలు ఎదుర్కొంటున్న అత్యాచార బెదిరింపులు, అనుచిత లైంగిక వ్యాఖ్యలతో పాటు సుమారు 17 రకాల ఇబ్బందులను వెల్లడించింది. ఈ నివేదిక మలయాళీ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపింది.


హేమ కమిటీ నివేదికపై తనుశ్రీ తీవ్ర వ్యాఖ్యలు


హేమ కమిటీ తాజాగా ఇచ్చిన నివేదికపై బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అదో పనికిరాని నివేదికగా అభివర్ణించింది. 2017లో జరిగిన సంఘటనకు సంబంధించి ఏడేళ్ల తర్వాత నివేదిక ఇవ్వడం వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదన్నది. “ఈ కమిటీలు, నివేదికలు నాకు పెద్దగా అర్థం కావు. కానీ, అన్నీ పనికిరానివిగా భావిస్తున్నాను” అని తనుశ్రీ వెల్లడించింది. బోలెడు మార్గదర్శకాలతో నివేదికలు రూపొందినప్పటికీ ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండటం లేదని చెప్పింది. ఈ కొత్త నివేదికతో ప్రయోజనం ఏంటి? ప్రభుత్వం చేయాల్సిందల్లా నిందితులను అరెస్టు చేయడం, పటిష్టంగా శాంతి భద్రతలను కాపాడ్డం మాత్రమేనని చెప్పుకొచ్చింది. మహిళల రక్షణ కోసం రూపొందించిన ప్రస్తుత వ్యవస్థలపై తనకు విశ్వాసం లేదని తేల్చి చెప్పింది. కమిటీలు, వాటి నివేదికలు బాధితులకు న్యాయం చేయకపోగా, వారి బాధలను మరింత పొడగించేలా కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.    


 2019లో కమిటీ ఏర్పాటు చేసిన కేరళ ప్రభుత్వం


మలయాళీ సినీ పరిశ్రమలో మహిళలకు సంబంధించిన వేధింపుల గురించి విచారణ చేసేందుకు 2019లో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. జస్టిస్ హేమ చీఫ్ గా రూపొందించిన ఈ కమిటీలో నటి శారద, రిటైర్ట్ ఐఏఎస్ అధికారి వత్సల కుమారి సభ్యులుగా ఉన్నారు. రీసెంట్ గా ఈ కమిటీ మలయాళీ సినీ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న వేధింపుల గురించి వివరిస్తూ సీఎం పినరయి విజయన్ కు రిపోర్టు అందించింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదికలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మలయాళీ ఇండస్ట్రీలో మహిళలపై ద్వేషం ఎక్కువగా ఉందని కమిటీ వెల్లడించింది. సినిమాలో అవకాశాల కోసం మహిళా నటీమణులు లైంగిక ఇబ్బందులు ఎదురైనా సర్దుకుపోతున్నారని తెలిపింది. కంప్లైంట్ చేస్తే సినీ పెద్దల నుంచి బెదిరింపులు రావడంతో పాటు సినిమాల నుంచి తొలగిస్తారని భయపడుతున్నారని వెల్లడించింది. మలయాళ సినీ పరిశ్రమను ఓ మాఫియా కంట్రోల్ చేస్తుందని వివరించింది. తమ లైంగిక కోరికలను తీర్చని నటిని ఓ హగ్ సన్నివేశం షూటింగ్ లో హీరో 17 టేక్స్ తీసుకునేలా చేశారని నివేదిక తెలిపింది. ఈ నివేదిక ప్రస్తుతం మలయాళీ ఇండస్ట్రీతో పాటు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.  


Also Read: ఆ హీరో నా లవ్ ను రిజెక్ట్ చేశాడు- ఫస్ట్ క్రష్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన ‘స్ట్రీ 2‘ బ్యూటీ