తెలంగాణలో అతిత్వరలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ రానుంది. వైద్యా్రోగ్యశాఖ పరిధిలో 4,661 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి ప్రకటనల విడుదల చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఖాళీల భర్తీకి అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్ధులు సన్నద్ధమవడానికి వీలుగా కనీసం రెండు నెలల గడువు ఇచ్చే అవకాశం ఉంది. పరీక్షలో వచ్చిన మార్కులు, వెయిటేజీ మార్కులను జోడించి, తుది అర్హులను ఎంపిక చేయనున్నారు.


రాష్ట్రంలో 950 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల నియామక ప్రక్రియకు సంబంధించి ఎంపికైన అభ్యర్థులకు డిసెంబరు 27లోగా పోస్టింగులు ఇవ్వనున్నారు. ఈ నియామక ప్రక్రియ పూర్తికాగానే స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీపై అధికారులు దృష్టిపెట్టనున్నారు. డిసెంబ‌రు 31లోపే ప్రకటన కూడా వెలువరించనున్నారు. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థ ద్వారా ఇప్పటివరకూ వైద్యుల నియామక ప్రక్రియను మాత్రమే నిర్వహించారు. 


వైద్యుల నియామకాల్లో అర్హత పరీక్ష నిర్వహించలేదు. వారి అర్హత మార్కులను, వెయిటేజీని ప్రాతిపదికగా తీసుకున్నారు. అయితే నర్సుల పోస్టుల భర్తీకి మాత్రం అర్హత పరీక్షను నిర్వహించనున్నారు. ఈనెలాఖరులోగా నియామక ప్రకటన వెలువరించి, పరీక్షకు అభ్యర్థులు సన్నద్ధమవడానికి వీలుగా కనీసం రెండు నెలల గడువు ఇస్తారు. బహుళ ఐచ్ఛిక సమాధానాల రూపంలో ప్రశ్నపత్రం రూపకల్పనకు ప్రత్యేకంగా నిపుణుల కమిటీని నియమిస్తారు. 


పరీక్ష నిర్వహణ, మూల్యాంకన బాధ్యతలను స్వతంత్ర సంస్థకు అప్పగించాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. వీరు ఫలితాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థకు అందజేస్తారు. ఆ ఫలితాలకు వెయిటేజీ మార్కులను జోడించి, తుది అర్హుల జాబితాను ఆ సంస్థ ప్రకటిస్తుంది. ప్రస్తుతం టీఎస్‌పీఎస్‌సీ పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూల్యాంకనం, ఫలితాల వెల్లడికి ఎలాంటి నిబంధనలు అనుసరిస్తుందో.. అదే విధానాన్ని స్టాఫ్‌నర్సుల నియామకాల్లోనూ అనుసరించాలని వైద్యశాఖ తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థను ఆదేశించింది.


ఆ ప్రాంతాల్లో పనిచేస్తే అధిక వెయిటేజీ..
🔰 ఇప్పటికే ప్రభుత్వ వైద్యంలో ఒప్పంద, పొరుగు సేవల ప్రాతిపదికన స్టాఫ్ నర్సులుగా పనిచేస్తున్నా, గతంలో పనిచేసినా..వారిక అదనపు మార్కులు ఇవ్వనున్నారు. స్టాఫ్ నర్సు అర్హత పరీక్షలో పొందిన మార్కుల శాతం ఆధారంగా గరిష్ఠంగా 80 పాయింట్లు ఇస్తారు. మిగిలిన 20 పాయింట్లను ప్రభుత్వ వైద్యంలో ఒప్పంద, పొరుగు సేవల సిబ్బందిగా పనిచేసిన వారికి వెయిటేజీగా కేటాయిస్తారు. ఈ కేటగిరీ అభ్యర్థులు ఒప్పంద, పొరుగు సేవల అనుభవ ధ్రువపత్రం కోసం సంబంధిత ఉన్నతాధికారికి దరఖాస్తు చేయాలి. ఆ ధ్రువపత్రాన్ని అభ్యర్థులు ఇతర సర్టిఫికెట్లతో పాటు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


🔰 గిరిజన ప్రాంతాల్లో అందించిన సేవలకు 6 నెలలకు 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అందించిన సేవలకు 6 నెలలకు 2 పాయింట్ల చొప్పున వెయిటేజీ ఇస్తారు. ఇక్కడ 6 నెలలు పూర్తయితేనే వెయిటేజీకి అర్హులుగా పరిగణిస్తారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అనుభవ ధ్రువీకరణ పత్రాన్ని ఇస్తున్నప్పుడు ఈఎస్‌ఐ, ఈపీఎఫ్ హాజరు రిజిస్టర్ల కాపీలను జతపరచాలి. వీరు ఆసుపత్రుల బాధ్యుల నుంచి అనుభవ ధ్రువీకరణను పొందాల్సి ఉంటుంది. పోస్టులకు దరఖాస్తు చేసుకోబోయే అభ్యర్థులందరూ తప్పక తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ మండలిలో తమ అర్హత ధ్రువపత్రాలను నమోదు చేసుకోవాలి.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...