Coronavirus: చైనాలో కఠినమైన కొవిడ్ -19 ఆంక్షలను సడలించిన తరువాత.. వైరస్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. రాబోయే నెలల్లో చైనాలో మిలియన్లకు పైగా మరణాలను సంభవించే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు యూఎస్, దక్షిణ కొరియా, బ్రెజిల్‌లో కూడా కేసులు పెరుగుతున్నట్లు నివేదికలు రావడంతో.. భారత్‌లో కరోనావైరస్ పరిస్థితిని సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుక్ మాండవీయ ఈ రోజు కీలక సమావేశం ఏర్పాటు చేశారు.
టాప్ పాయింట్స్
- కొవిడ్-19 వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ఇప్పటివరకు భారత్ విజయం సాధించింది. దేశవ్యాప్తంగా వారానికి సుమారు 1200 కేసులు నమోదవుతున్నాయి.
- ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ మంగళవారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. వైరస్‌లో ఏదైనా కొత్త వైవిధ్యాలు ఉంటే ట్రాక్ చేయడానికి పాజిటివ్ కేసు నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలని తెలిపారు.
- జపాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, బ్రెజిల్, చైనాలలో అకస్మాత్తుగా పెరుగుతున్న కేసుల దృష్ట్యా, వేరియంట్‌లను ట్రాక్ చేయడానికి పాజిటివ్ కేసు నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌ను సిద్ధం చేయడం చాలా అవసరమని ఆయన తెలిపారు.
- NTAGI, INSACOG, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు దేశంలో కొవిడ్ కేసులు తక్కువగా ఉన్నాయన్నారు.
- వ్యాక్సిన్ పంపిణీ కారణంగా ప్రజల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వల్లే భారత్‌లో కేసులు పెరగడం లేదని పేర్కొన్నారు.
- చైనాలో కేసులు పెరిగినప్పుడల్లా కఠినమైన లాక్‌డౌన్‌ను అనుసరించింది. కాబట్టి ప్రజలు వైరస్‌కు గురికాలేదు. కానీ ఒకేసారి ఆంక్షలు ఎత్తేయడంతో అక్కడి పరిస్థితులు దిగజారాయి.
- దాదాపు మూడు సంవత్సరాల లాక్‌డౌన్‌లు, నిర్బంధాలు, సామూహిక పరీక్షలను ఎత్తివేయాలని చైనా ప్రభుత్వం గత నెలలో ఆకస్మిక నిర్ణయం తీసుకుంది.
- దీంతో కరోనా కేసులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. ఫ్లూ మందుల కొరత ఏర్పడింది. పాఠశాలలు తిరిగి ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. చైనాలో బుధవారం 3,049 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
- భారత్‌లో కొత్తగా 69 కేసులు, రెండు మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 44.6 మిలియన్లకు, మరణాల సంఖ్య 530,677కి చేరుకుంది.
- ఆసుపత్రిలో చేరిన కేసులపై నిరంతర నిఘా, పర్యవేక్షణను అనుసరించడం మాత్రం చాలా ముఖ్యమని భారత్‌లో నిపుణులు చెబుతున్నారు.
Also Read: China Covid Cases: చైనాలో కరోనా బీభత్సం- ఆంక్షలు ఎత్తేయడంతో ఒమిక్రాన్ పంజా!