Sweeper Posts Applications: సర్కారు కొలువా మజాకా.. కొలువేదైనా ఫర్వాలేదు.. చేయడానికి సిద్ధమంటూ కనీస విద్యార్హత అవసరంలేని ఉద్యోగాలకు సైతం ఉన్నత విద్యావంతులు సైతం పోటీపడుతున్నారు. తాజాగా హర్యానాలో స్వీపర్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడగా.. వేలాదిమంది గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. రోడ్లు ఉడ్చే పారిశుద్ధ్య కార్మికుల ఉద్యోగాలకు డిగ్రీలు, పీజీలు చదివిన యువత పోటీ పడిన తీరు ఔరా అనిపిస్తోంది.
దేశంలో నిరుద్యోగ తీవ్రతకు అద్దం పట్టే ఘటన ఇది. హర్యానాలో ఇటీవల కాంట్రాక్ట్ స్వీపర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయింది. అతి తక్కువ సమయంలో లక్షలాది మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో 6 వేల మంది పీజీ గ్రాడ్యుయేట్లు, 40 వేల మంది గ్రాడ్యుయేట్లు, 1.2 లక్షల మంది అండర్ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకున్నారు.
అధికారుల ఆశ్చర్యం..
రోడ్లు ఊడ్చే ఉద్యోగం కోసం లక్షలాది మంది యువత పోటీపడుతుండటం, అందులోనూ పీజీ, డిగ్రీలు పూర్తి చేసిన వారు సైతం ఉండటం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఉద్యోగాలకు జీతాన్ని కేవలం రూ.15 వేలుగా నిర్ణయించారు. అది కూడా కాంట్రాక్ట్ విధానంలో భర్తీచేయనున్నారు. అయితే ప్రైవేటులో రూ.10 వేల జీతం ఇస్తున్నారని, ఇక్కడ రూ.15 వేల జీతంతో పాటు భవిష్యత్తులో పర్మినెంట్ అవుతుందని అభ్యర్థులు ఆశిస్తుండటమే దరఖాస్తుల సంఖ్య భారీగా పెరగడానికి కారణం.
అందుకే భారీగా దరఖాస్తులు..
దీనిపై కొందరు అభ్యర్థులను సంప్రదించగా, స్వీపర్‌గా ఇప్పుడు చేరినా, భవిష్యత్‌లో ఉద్యోగం పర్మినెంట్ అయ్యే అవకాశం ఉందని, అందుకే దరఖాస్తు చేసినట్లు తెలిపారు. మరికొందరేమో ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం కారణంగా దరఖాస్తులు చేసుకున్నట్లు వివరించారు. పారిశుద్ధ కార్మికులుగా చేరడం కోసం అంత చదువులు చదివిన వారు సైతం పోటీ పడటంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జాతీయ పత్రికల్లో కథనాలు కూడా వస్తున్నాయి.
ALSO READ: ఉద్యోగులకు శుభవార్త- ఇక వారానికి నాలుగు రోజులే పని, ఎక్కడంటే?