ప్రపంచంలో ఎన్నో జీవులు ఉన్నాయి. వాటిలో మనిషి క్షీరదం జాతికి చెందిన వాడు. పిల్లలను కని పాలిచ్చి పెంచే జీవులను క్షీరదాలు అంటారు. మిగతా జీవులతో పోలిస్తే గుండె పోటుతో మరణించే శాతం మనుషుల్లో చాలా ఎక్కువ. అడవి జంతువుల్లో అసలు ఇది జరిగే అవకాశమే లేదు. కానీ మనిషికే ఎందుకు ఈ గుండె పోటు శాపంలా వెంటాడుతోంది? దీనికి శాస్త్రవేత్తలు కొంతవరకు సరియైన సమాధానాన్ని కనుక్కోగలిగారు. అందులో జంతువుల్లో ఉండి, మనలో లేని ఒక జన్యువే దీనికి కారణమని చెబుతున్నారు. ఆ జన్యువు పేరు ‘సీఎంఏహెచ్’. ఇది రెండు లక్షల ఏళ్ల క్రితం వరకు మనుషుల్లో ఈ జన్యువు ఉండేది. తరువాత నశించి పోయింది. దీనివల్లే మనకు గుండె తరచూ వస్తోందనేది పరిశోధకుల వాదన. 


పదిహేనేళ్ల క్రితం చింపాంజీలు, ఇతర క్షీరదాలకు కూడా గుండెపోటు సాధారణంగా వచ్చే అవకాశం ఉందేమో తెలుసుకునేందుకు అధ్యయనం చేశారు. అందులో దాదాపు వచ్చే అవకాశం లేదనే తేలింది. నిజానికి చింపాంజీలకు మనుషులకన్నా బద్ధకం ఎక్కువ. వాటిల్లో కూడా కొవ్వు పేరుకుపోతుంది అయినా గుండెకు మాత్రం ఏ సమస్యా రాదు. కారణం వీటిలో ఆ జన్యువు ఇంకా ఉంది. ఎలుకల్లో కూడా ఈ జన్యువు ఉంది. కొన్ని ఎలుకల్లో ఈ జన్యువును నిర్వీర్యం చేసి, కొన్ని ఎలుకల్లో ఉంచి పరిశోధన చేశారు. ఏ ఎలుకల్లో అయితే ‘సీఎంఏహెచ్’ జన్యువును నిర్వీర్యం చేశారో వాటిలో కొవ్వు శరీరంలో పేరుకుపోయి గుండె సమస్యలు మొదలయ్యాయి. సీఎంఏహెచ్ నిర్వీర్యమైతే గుండె పోటు ముప్పును పెంచుతుందని అర్థమైంది. అలాగే మాంసాహారం తినేవారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువని కూడా ఈ పరిశోధనలో తేలింది.


సీఎంఏహెచ్ జన్యువు ఎప్పుడు, ఎందుకు మానవుల శరీరం నుంచి నిర్వీర్యమైపోయిందో మాత్రం కచ్చితంగా చెప్పలేకపోతున్నారు పరిశోధకులు. అది నిర్వీర్యం కాకుండా ఇప్పటికీ ఉంటే గుండె జబ్బులంటే ఏంటో, గుండె పోటు అంటే ఏంటో కూడా మనుషులకు తెలిసేది కాదని భావిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం 70 ఏళ్లలోపు ఎక్కువ మంది గుండె జబ్బులతో మరణిస్తున్నట్టు చెప్పింది. ఇకపై ఏటా గుండెపోటు లేదా గుండె జబ్బులతో మరణించే వారి సంఖ్య పెరుగుతుందే కానీ, తగ్గే అవకాశం లేదని తెలిపింది. 


అందుకే గుండె ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యం అధిక బరువును తగ్గించుకోవాలి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగకుండా చూసుకోవాలి. కొంతమంది సన్నగా కనిపిస్తున్నప్పటికీ కొలెస్ట్రాల్ మాత్రం అధికంగా ఉంటుంది. కాబట్టి చెక్ చేయించుకుంటే బెటర్. అలాగే గుండెకు మేలు చేసే ఆహారాన్ని తినడం అలవాటు చేసుకోవాలి. మాంసాహారాన్ని తగ్గించాలి. 


Also read: వందేళ్లు ఆరోగ్యంగా జీవించాలనుకుంటున్నారా? అయితే మీరు రోజూ చేయాల్సిన ముఖ్యమైన పని ఇదే



































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.