వయసుతో సంబంధం లేకుండా.. తీసుకునే ఆహారం వల్లనో, మారుతున్న జీవనశైలి వల్లనో.. అందరిలో మోకాళ్ల నొప్పులు పెరిగిపోతున్నాయి. ఒత్తిడి కూడా ఈ నొప్పులకు ప్రధాన కారణం అవుతుంది. ఈ సమస్యతో కూర్చోవడం, నడవడం కూడా కష్టమైపోతుంది. మనం నడవాలన్నా.. నిలబడాలన్నా.. కూర్చోవాలన్నా.. లేవలన్నా మన శరీరంలో మోకాళ్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి మోకాళ్లను బలోపేతం చేయడం చాలా అవసరం.
మీరు కూడా మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా? అయితే మీరు మీ రోటీన్లో యోగాను చేర్చుకోండి. ఇది మీ మోకాళ్లను ధృడంగా చేయడానికి సరైన ఎంపిక. యోగాలోని కొన్ని ఆసనాలు మోకాళ్లకు బలాన్ని చేకూరుస్తాయి. కాబట్టి మోకాళ్లను స్ట్రాంగ్‌గా చేసుకోవడానికి ఎలాంటి ఆసనాలు వేయాలి? ఏ విధంగా వేస్తే మంచి ఫలితాలు పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
వీరభద్రాసనం..
మోకాళ్ల నొప్పిని దూరం చేయడంలో వీరభద్రాసనం ముఖ్యమైన ఫలితాలు చూపిస్తుంది. ఇది నిలుచుని చేసే ఆసనం. పైగా దీనిని చేయడం చాలా తేలిక. ఇది కేవలం మోకాళ్ల నొప్పులను దూరం చేయడమే కాకుండా.. నడుమును స్ట్రాంగ్ చేస్తుంది.
దీనిని చేయడం కోసం నించుని.. మీ పాదాలను దూరంగా ఉంచాలి. ఇప్పుడు మీ కుడి పాదాన్ని బయటకి తిప్పండి. ఇప్పుడు ఎడమకాలితో దూరం చేస్తూ.. కుడికాలు మోకాలిపై స్ట్రెచ్ చేయండి. ఈ సమయంలో మీ చేతులను నేలకు సమాంతరంగా చాచండి. ఇలా 20 సెకన్లు ఉన్న తర్వాత.. మరోవైపు చేయాలి. ఈ ఆసనాన్ని రెగ్యూలర్‌గా చేస్తే మీ మోకాళ్ల నొప్పులు దూరమై.. వాటికి బలం చేకూరుతుంది.
త్రికోనాసనం
యోగాలో త్రికోనాసనం.. లోపలి క్వాడ్‌కు మద్ధతునిచ్చి.. కండరాలను టోన్ చేస్తుంది. ఇది మోకాలి చుట్టూ ఉన్న కండారాలను స్ట్రెచ్ చేసి.. ధృడంగా మారుస్తుంది. ఈ ఆసనం చేయడం కూడా చాలా తేలిక.
మీ పాదాలను దూరంగా ఉంచి.. చేతులు నేలకి సమాంతరంగా ఉంచండి. ఇప్పుడు ఒక పాదాన్ని టచ్ చేసేందుకు ఒకవైపు వంగుతూ పాదాన్ని తాకండి. మీ కుడి చేయి పాదాన్ని తాకుతుంటే.. ఎడమ చేయి ఆకాశం వైపు చూపించాలి. ఈ ఆసనంలో 20 సెకన్లు ఉండి.. మరోవైపు చేయాలి.
వృక్షాసనం..
మోకాళ్ల కండరాలను బలోపేతం చేయడంలో వృక్షాసనం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. అంతేకాకుండా బ్యాలెన్సింగ్ ఆసనాలు ఎప్పుడూ మీ మొత్తం శరీరానికి మంచి ప్రయోజానాలు అందిస్తాయి. ఈ వృక్షాసనం మీ మోకాలి చుట్టూ ఉన్న కండరాలను బలపరుస్తుంది.
ఈ ఆసనం చేయడం కూడా చాలా తేలిక. మీరు నిటారుగా నిలుచోండి. ఇప్పుడు ఒక కాలిని నేలపై ఉంచి.. మరో కాలిని నేలపై ఉంచిన కాలు మోకాలి దగ్గర ప్లేస్ చేయాలి. చేతులను తలపైకి తీసుకెళ్లి నమస్కారం చేయాలి. ఈ ఫోజ్‌లో మీరు 20సెకన్లు ఉండొచ్చు. అనంతరం మరో కాలితో ఇదేవిధంగా ఆసనం వేయాలి. ఇది మీ మోకాళ్ల నొప్పులను ఈజీగా దూరం చేస్తుంది. బ్యాలెన్సింగ్ అవ్వకుంటే గోడకు దగ్గర్లో ఉంటూ ఈ ఆసనం ప్లాన్ చేయండి. రెగ్యూలర్‌గా చేయడం వల్ల ఇది మంచి ఫలితాలు ఇస్తుంది.
సేతు బంధాసనం
ఈ ఆసనంతో మీరు ఒకటి కాదు ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. మోకాలికి పరోక్షంగా మద్ధతునిస్తుంది. దీనిని బ్రిడ్జ్ ఆసనం అని కూడా అంటారు. ఇది మోకాళ్ల నొప్పులు దూరం చేయడమే కాకుండా.. మీ వెన్ను, పిరదులకు కూడా బలాన్ని అందిస్తుంది.
ఈ ఆసనాన్ని మీరు పడుకుని చేయాలి. శవాసనంలో పడుకుని.. మీ పాదాలను మోకాళ్ల స్థానానికి తీసుకురావాలి. ఇప్పుడు తల, భుజ స్థానాన్ని నేలకే ఆనించి.. పాదాలపై బరువు ఆన్చుతూ.. మీ శరీరాన్ని పైకి లేపాలి. ఇది ఒక వంతెనను పోలి ఉంటుంది. ఇప్పుడు మీ చేతులను పాదాలకు దగ్గరగా చేర్చి.. ఆసనంలో 20 సెకన్లు ఉండాలి.
ఇవేకాకుండా సుఖాసనం, ఉత్కటాసనం, సుప్త పదంగుష్ఠాసనం వంటి ఆసనాలు కాళ్లను బలోపేతం చేసి.. మోకాళ్ల నొప్పులు దూరం చేస్తాయి. అయితే మీరు ఈ ఆసనాలు చేసే ముందు ఒకసారి యోగా నిపుణులను సంప్రదించి.. వారి సూచనల ప్రకారం వేయండి. అనంతరం మీరు ఇంట్లోనే వీటిని ప్రాక్టీస్ చేయవచ్చు. ఒకవేళ మీ మోకాళ్లకు గాయాలు ఏమైనా ఉంటే మాత్రం కచ్చితంగా వైద్యుని సంప్రదించండి.
Also Read : బరువు తగ్గడానికి రోజుకు రెండుసార్లు ఈ వ్యాయామాలు చేస్తే చాలట!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.