చిన్న చిన్న విషయాలకే కొన్ని శుభకార్యాల్లో కొట్లాటలు చూశాం. చికెన్ పెట్టలేదని కొన్ని పెళ్లిళ్లు నిలిచిపోయిన ఘటనలూ చూశాం. కానీ, ఓ కుర్చీ కోసం గొడవపడిన ఘటన కృష్ణా జిల్లా గన్నవరంలో ఆదివారం జరిగింది. ఓ ప్రైవేట్ శుభకార్యంలో ఏర్పాటు చేసిన విందులో చిన్న కుర్చీ విషయమై మాటామాటా పెరిగి ఆ కార్యక్రమానికి హాజరైన పోలీసులు ఇద్దరు అన్నదమ్ముళ్లపై దాడి చేశారు.


ఇదీ జరిగింది


కృష్ణా జిల్లా గన్నవరం పట్టణంలోని గౌడపేటలో వస్త్రాలంకరణ కార్యక్రమంలో విందుకు పామర్తి శ్రీకాంత్, చిన్నారావులు హాజరయ్యారు. చిన్నారావు స్థానిక పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆయన మఫ్టీలో వచ్చారు. ఈ విందుకు తోటి పోలీస్ సిబ్బంది సైతం హాజరయ్యారు. అయితే, శ్రీకాంత్, చిన్నారావుల మధ్య విందు సమయంలో కుర్చీ విషయమై వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో పరస్పరం దాడికి దిగారు. ఈ క్రమంలో చిన్నారావు సహా తోటి పోలీస్ సిబ్బంది, శ్రీకాంత్ పై దాడికి పాల్పడ్డారు. అడ్డుకునేందుకు వెళ్లిన అతని సోదరుడు వెంకటేశ్ పైనా దాడి చేశారు. దీంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి. శ్రీకాంత్ సోదరుడు వెంకటేశ్ పట్ల హెడ్ కానిస్టేబుల్ ప్రవర్తించిన తీరు పోలీస్ శాఖకే అవమానమని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, ఈ దాడిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితులు తెలిపారు.


Also Read: ఏపీలో ఘోర ప్రమాదం - ఇద్దరు మృతి, ఆ హైవే ఘోస్ట్ రోడ్