Road Accident: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూతలపట్టు - నాయుడుపేట ప్రధాన రహదారిపై ప్రమాదం సంభవించింది. చంద్రగిరి మండలం, కోదండ రామాపురం సమీపంలోని కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరొకరికి తీవ్రగాయాలు కాగా, అతన్ని స్థానికులు, పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఇలా జరిగింది


చిత్తూరు జిల్లా కొండమిట్ట గ్రామానికి చెందిన శీను(30), ఈర్షద్(29), కారు డ్రైవర్ ప్రభాకర్ సొంత పని మీద తిరుపతికి వచ్చారు. పని ముగించుకుని ఆదివారం ఉదయం తిరుపతి నుంచి చిత్తూరు బయల్దేరారు. మార్గమధ్యంలో చంద్రగిరి మండలం, కోదండ రామాపురం సమీపంలో కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఘటనలో శ్రీను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈర్షద్, ప్రభాకర్ తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను తిరుపతి రూయా ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈర్షద్ మృతి చెందాడు. డ్రైవర్ ప్రభాకర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై చంద్రగిరి ఎస్‌ఐ హిమబిందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 


ఘోస్ట్ రోడ్..


పూతలపట్టు - నాయుడుపేట హైవేపై నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి.  ఈ రోడ్డుపై పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగినట్లు వాహనాదారులు పేర్కొంటున్నారు. ఇందులో కొన్ని మాత్రమే బయటకు తెలుస్తుంటాయని, ప్రమాదాలు జరిగి గాయపడిన ఘటనలు వెలుగులోకి రానివి చాలానే ఉంటాయని చెబుతున్నారు. అందుకే ఈ రోడ్డును ఘోస్ట్ రోడ్డుగా పిలుచుకుంటారు. సరిగ్గా పది రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో ఓ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు.


చంద్రగిరి మండలం పనపాకం వద్ద పూతలపట్టు-నాయుడుపేట హైవేపై ఈ నెల 12న ప్రమాదం జరిగింది. మొక్కల లోడుతో బెంగుళూరు నుంచి విజయవాడ వెళ్తున్న ఐచర్ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ సుదర్శన్(27) మృతి చెందాడు. గాయపడిన క్లీనర్ అబ్బయ్య (28)ను హైవే అంబులెన్సు ద్వారా ఆసుపత్రికి తరలించారు. చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


జనవరిలోనూ ప్రమాదం


ఇదే ఏడాది చంద్రగిరి మండలం నాయుడుపేట-పూతలపట్టు సిక్స్‌లేన్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. జనవరి 25న తిరుపతి నుంచి చిత్తూరు వైపు వెళుతున్న కారు అదుపు తప్పి డివైడర్‌, కల్వర్టును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మహరాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన  రిషీకేష్‌ మధుసూదన్‌ జంగం (28), మయూర్‌ దయానంద్‌ మఠపత్‌ (27), అజయ్‌ నాగనాధ్‌ లుట్టే (30), అధర్వ్‌ అనంత్‌ టెంబునీకర్‌ (19) దుర్మరణం చెందారు.


తీవ్రంగా గాయపడిన నలుగురు తిరుపతి రుయాస్పత్రిలో చికిత్స అందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అంబాదాస్‌ కుమార్‌ మరణించారు. తమిళనాడు వేలూరు సమీపంలోని గోల్డెన్‌ టెంపుల్‌ కు వెళ్తుండగా కల్‌రోడ్డుపల్లి వద్ద ప్రమాదం జరిగింది. అతి వేగంతో వాహనం నడపడం, నిద్రమత్తు కారణంగానే అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్టు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు.