పిల్లల దంత ఆరోగ్యాన్ని చాలా మంది తల్లిదండ్రులు తేలికగా తీసుకుంటారు. బ్రష్ చేసినా చేయకపోయినా పట్టించుకోరు. చిన్న పిల్లలే కదా అనుకుంటారు. కానీ చిన్నప్పట్నించి వారి దంతాలను కాపాడితేనే వారు అన్ని రకాల ఆహారాలను పెద్దయ్యాక కూడా తినగలరు. వారి దంతాల ఎనామిల్ దెబ్బతింటే ఇతర సమస్యలు వస్తాయి. పిప్పి పళ్ల సమస్య మొదలైందంటే, పన్ను తీసేసే పరిస్థితులు వస్తాయి. కాబట్టి వారి దంత సంరక్షణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి తల్లిదండ్రులు. కొన్ని రకాల ఆహారాలను తగ్గించడం ద్వారా దంతాల ఎనామెల్‌ను కాపాడుకోవచ్చు. 
 
చక్కెర 
పిల్లలందరూ తీపి పదార్థాలను ఇష్టపడతారు. రాత్రి పగలు తేడా లేకుండా వాటిని తింటుంటారు. పిల్లలపై ప్రేమతో తల్లిదండ్రులు కూడా అడ్డుచెప్పకుండా ఇచ్చేస్తుంటారు. మీ అతి ప్రేమ వారి దంతాలను పాడుచేస్తుంది. చక్కెర, పిండి పదార్థాలు నిండిన ఆహారాలను పిల్లలకు తక్కువగా ఇవ్వాలి. ఇవి దంతాలకు, చిగుళ్లకు ముప్పును కలిగిస్తాయి. వీటివల్ల ఎనామెల్ క్షీణిస్తుంది. 


ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్
ఆరేళ్లలోపు పిల్లలకు ఫ్లోరైడ్ లేని టూత్ పేస్టునే వాడాలి. ఎందుకంటే అంతకన్నా చిన్న వయసు పిల్లలు పేస్టును ఉమ్మకుండా మింగేసే ప్రమాదం ఉంది. ఫ్లోరైడ్ శరీరంలో చేరడం ప్రమాదకరం. ఫ్లోరైడ్ వల్ల చిన్న పిల్లల దంతాల ఎనామెల్ దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. 


నోటి శుభ్రత
పిల్లలకు నోరు శుభ్రంగా ఉంచుకోవాలన్న విషయంపై అవగాహన పెంచాలి. ఏదైనా తిన్నాక నోరు పుక్కిలించి ఉమ్మేలా చేయాలి. లేకుంటే ఆహార పదార్థాల అవశేషాలు దంతాల సందుల్లో ఉండిపోయి దంతక్షయానికి దారితీస్తుంది. పిల్లలకు కచ్చితంగా రోజుకు రెండుసార్లు బ్రష్ చేయించాలి. 


అలాంటి బ్రష్‌లు వద్దు
దంతాలు శుభ్రపడాలన్న ఉద్దేశంతో ముళ్లలాగా గుచ్చుకునే బ్రష్‌లు పిల్లలకు వాడడం మంచిది కాదు. ఇవి ఎనామిల్, చిగుళ్ల కణజాలానికి హాని కలిగించవచ్చు. అందుకే చాలా మంది దంతవైద్యులు పిల్లలకు మృదువుగా ఉండే బ్రష్‌లను వాడమని సిఫార్సు చేస్తారు. టూత్ బ్రష్‌కు ఉండే ముళ్లు BPAరహితంగా ఉండాలి.


పాలపళ్లను చాలా తోమరు. శుభ్రం చేయరు. కానీ పాల దంతాలు కూడా కచ్చితంగా శుభ్రం చేయాలి. దంతాలు రాని పిల్లల్లో మెత్తని వస్త్రంతో వారి చిగుళ్లను తుడవాలి. ఆరేడేళ్ల వయసు వచ్చేసరికి 40 శాతం మంది పిల్లలు దంతక్షయంతో బాధపడుతున్నట్టు అంచనా. కాబట్టి పిల్లల దంతాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు వాడే  బ్రష్‌లను కూడా ప్రతి మూడు నెలలకోసారి మార్చాల్సిందే. అది బావున్నా కూడా మార్చాలి. బ్రష్‌ పోచలు అడ్డదిడ్డంగా అయిపోయినా, మధ్యలో పోయినా కూడా వాటిని పడేసి, కొత్త బ్రష్ లతో చేయించాలి.  



Also read: లైంగిక జీవితంపై ఆసక్తి తగ్గిపోయిందా? అయితే మీ పొట్టలో ఇలాంటి సమస్యలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి













































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.