కరోనా వైరస్ సాధారణ ఫ్లూలా అయిపోయిందని..  వైరస్ సోకితే మహా అయితే జలుబు చేస్తుందని ఇప్పుడు అందరూ లైట్ తీసుకుంటున్నారు. మాస్కుల్ని కూడా పక్కన పడేసి బిందాస్‌గా గతంలోలా గడపడం అలవాటు చేసుకుంటున్నారు. కానీ ఇంకా అయిపోలేదని.. చాలా సీజన్లు ఉన్నాయని కరోనా మళ్లీ తెరపైకి వస్తోంది. ఈ సారి కరోనా వైరస్ పుట్టిన చైనా నుంచే విజృంభిస్తోంది. తాజాగా విజృంభిస్తున్న వరైస్ పేరు ‘స్టెల్త్‌ ఒమిక్రాన్‌’ ( Stealth Omicron ) . 
 
రెండేళ్ల తర్వాత  చైనాలో ( Chaina )  రోజువారీ అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. రోజు రోజుకు కేసులు రెట్టింపవుతున్నాయి.   కరోనా విషయంలో చైనా జీరో-టాలరెన్స్‌ విధానం అమలు చేస్తోంది. అత్యంత కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. అయినా కట్టడి అసాధ్యంగా మారింది. ఇప్పుడు   13 పెద్ద నగరాలను మూసివేసింది.  3 కోట్ల మందికి పైగా ప్రజలను ‘లాక్‌డౌన్‌’లో ఉంచింది. చాలామేర పరిశ్రమలు మూతపడ్డాయి.ప్రజారవాణాను నిలిపివేశారు.  జిలిన్‌ ,  చాంగ్‌చున్‌ ,  షెన్‌ఝెన్‌ ,  షాంఘై ,  లాంగ్‌ఫాంగ్‌ నగరాల్లో ఆంక్షలు విధించారు. విస్తృతస్థాయిలో ప్రజలకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. బీజింగ్‌లోనూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ నగరంతో పాటు ,  షాంఘైకి రాకపోకలు సాగించే విమానాలను రద్దు చేశారు.  


‘స్టెల్త్‌ ఒమిక్రాన్‌’ అత్యధిక సాంక్రమిక శక్తి ఉన్న కొవిడ్‌ కొత్త వేరియంట్‌ .  ఒమిక్రాన్‌ కన్నా వేగంగా వ్యాపిస్తుంది. దీన్ని  ‘బీఏ. 2’ ( BA.2 ) రకంగా పిలుస్తున్నారు.  మూడో వేవ్‌కు కారణమైన ఒమిక్రాన్‌ శరవేగంగా వ్యాప్తి అవుతూ రికార్డు సృష్టించింది. అంతకన్నా ఒకటిన్నర రెట్ల వేగంతో స్టెల్త్ ఒమిక్రాన్ వ్యాప్తిస్తుంది.  ‘ స్టెల్త్‌ ఒమిక్రాన్‌’కు సంబంధించి.. ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షల్లో ( RT - PCR Tests ) ఈ వేరియంట్‌ను నిర్దిష్టంగా గుర్తించడానికి అవసరమయ్యే స్పైక్‌ ప్రొటీన్లలోని కొన్ని ఉత్పరివర్తనాలు లేవు. దీంతో గుర్తింపు కూడా కష్టంగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు. 


కరోనా ( Corona ) బయటపడినప్పటి నుండి ప్రపంచం మొత్తం ఏదో మూల లాక్ డౌన్‌తో ఆంక్షలతో గడుపుతోంది. మూడో వేవ్ రూపంలో ఒమిక్రాన్ వచ్చి వెళ్లిపోయిన తర్వాత అందరూ ఇక కరోనా పని అయిపోయిందని భావిస్తున్నారు. కానీ నాలుగో వే్ స్టెల్త్ ఒమిక్రాన్ రూపంలో దూసుకొస్తోంది. అయితే ఇది వేగంగా వ్యాప్తి చెందుతోందని చెబుతున్నారు కానీ.. ఎంత ప్రమాదకరం అనేది మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు. బ్రిటన్ లో పరిశోధనలు జరుగుతున్నాయి.