మహిళ జీవితంలో కీలకమైన దశ నెలసరి మొదలవడం. నెలసరి మొదలైందంటే వారి పునరుత్పత్తి వ్యవస్థ బిడ్డను కనేందుకు సిద్ధపడిందని అర్థం.సంపూర్ణ మహిళగా మారే క్రమంలో ఈ నెలసరి మొదలవడం అనేది మొదటి దశ. 11 నుంచి 15 ఏళ్ల లోపు అమ్మాయిల్లో ఎక్కువగా ఈ నెలసరి మొదలవుతుంది. కొంతమంది అమ్మాయిల్లో నెలసరి చాలా బాధాకరంగా ఉంటుంది. నడుము నొప్పి, కాళ్ళ నొప్పి, తలనొప్పి, పొట్టనొప్పి విపరీతంగా బాధిస్తాయి. అసౌకర్యంగా ఉంటుంది. అయితే అందరికీ ఇలా ఉండాలని లేదు, కొంతమందిలోనే ఈ లక్షణాలు కనిపిస్తాయి. అలాంటి వారికి సహజంగా ఆ నొప్పులను తగ్గించుకునే చిట్కాలను ఆయుర్వేదం వివరిస్తోంది. 


ఆయుర్వేదం ప్రకారం కొందరి శరీరాలు వాత తత్వాన్ని కలిగి ఉంటాయి. అలాంటి వారిలోనే అధికంగా నొప్పులు వస్తాయి. ఇక పిత్త దోషం కలిగిన వారిలో నెలసరి ముందు తర్వాత కూడా నొప్పులు వచ్చే అవకాశం ఉంది. రాత్రివేళ అధికంగా రక్తస్రావం కూడా కావచ్చు. కఫదోషము ఉంటే నొప్పి తక్కువగా ఉన్నా, తలనొప్పి, భావోద్వేగాలు అదుపు తప్పడం, గందరగోళంగా అనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా నెలసరి సమయంలో వచ్చే ఇబ్బందులే. 


ఇలా చేయండి 
ఇలాంటి నొప్పులు బాధిస్తున్నప్పుడు ఆయుర్వేదం కొన్ని చిట్కాలు చెబుతోంది. అవేంటంటే...


1. నువ్వుల నూనెతో పొత్తికడుపు మీద సున్నితంగా మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నెలసరి సమయంలో వచ్చే కడుపునొప్పి తగ్గే అవకాశం ఉంది. నువ్వుల నూనెలో లినోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలో వాపు గుణాన్ని తగ్గిస్తుంది. నొప్పిని అరికడుతుంది.


2. ప్రతి ఇంట్లో మెంతులు ఉంటాయి. రెండు స్పూన్ల మెంతులను 12 గంటల పాటు నీళ్లలో నానబెట్టి, ఆ తర్వాత ఆ నీటిని తాగేయాలి. ఇలా చేయడం వల్ల నెలసరి నొప్పులు తగ్గే  అవకాశం ఎక్కువ.


3. పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నప్పుడు వేడి నీళ్ల కాపడాన్ని చేసుకోవడం మంచిది. వేడి నీళ్లలో శుభ్రమైన వస్త్రాన్ని ముంచి, పిండి పొత్తి కడుపు మీద పెట్టడం వల్ల గర్భాశయ కండరాలు వ్యాకోచిస్తాయి. దీనివల్ల నొప్పి తగ్గుతుంది. 


4. నెలసరి నొప్పులు వచ్చినప్పుడు ఎక్కువ మంది చేసే పని కదలకుండా ఒకే చోటుకు పరిమితమవడం. మంచం మీదే పడుకోవడం లేదా కూర్చోవడం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల నొప్పులు పెరుగుతాయి కాని తగ్గవు. నెలసరి నొప్పులు రాకుండా ఉండాలంటే చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి. కటి ప్రదేశానికి రక్తప్రసరణ పెంచే వ్యాయామాలు చేస్తే నొప్పులు తగ్గుతాయి. తేలికపాటి వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోవాలి.


5. జీలకర్రను నీళ్లలో వేసి మరిగించి వడకట్టుకొని ఆ నీళ్లు తాగినా కూడా నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.


6. శొంఠి, మిరియాల పొడి తో హెర్బల్ టీ తయారు చేసుకొని తాగినా మంచిదే. శొంఠి, మిర్యాల పొడిని నీళ్లలో వేసి మరగ కాచి వడకట్టుకొని ఆ నీళ్లను తాగేయాలి. ఇలా చేయడం వల్ల అలసట కూడా తగ్గుతుంది.


ఈ జాగ్రత్తలు తప్పవు
నెలసరి సమయంలో విపరీతమైన నొప్పులతో బాధపడేవారు తమ ఆహారంలో పంచదార, మైదా, ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించుకోవాలి. అలాగే బ్రెడ్డు, పాస్తా వంటివి కూడా మానేయాలి. ఉప్పు వాడకం తగ్గించాలి. కెఫిన్ ఉండే కాఫీలను తాగడం తగ్గించాలి. ప్రతి రోజూ పరగడుపున నీళ్లలో నిమ్మరసం పిండుకొని తాగడం మంచిది. నిద్ర కూడా నొప్పులను తగ్గించడానికి సహకరిస్తుంది. కాబట్టి రోజూ రాత్రి సమయంలో ఎనిమిది గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. 


Also read: చిన్న వయసులోనే గుండెపోటుతో కుప్పకూలిపోతున్న యువత - వారిలో గుండెపోటుకు కారణాలు ఇవే