బారాత్‌లో డాన్స్ చేస్తూ అలాగే కుప్పకూలిపోయాడు ఓ యువకుడు. అతడి వయసు కేవలం 18 ఏళ్లు.ఎలాంటి గుండె సమస్యలు ఇంతకుముందు లేవు. అయినా కూడా అనూహ్యంగా గుండె ఆగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. చాలామంది యువతలో ఇలాంటి పరిస్థితులు చూస్తున్. ఇలా చిన్న వయసులోనే గుండెపోటు బారిన పడడానికి కారణాలేమిటి? దీనికి వైద్యులు అనేక కారణాలు వివరిస్తున్నారు. ముఖ్యంగా మారిన జీవనశైలే ఇలా చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడానికి ముఖ్య కారణంగా చెబుతున్నారు.


బ్లడ్ క్లాట్లు వల్ల...
ఊబకాయం బారిన పడిన వారిలోనే కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుందని అనుకుంటారు. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి బ్లడ్ క్లాట్లు ఏర్పడి, గుండెకు సరిగా రక్తప్రసరణ జరగక కార్డియాక్ అరెస్టు, గుండెపోటు వంటి సమస్యలు వస్తాయని చెబుతారు. నిజమే... కానీ ఎలాంటి కొలెస్ట్రాల్ సమస్యలు లేని వారిలోనూ బ్లడ్ క్లాట్లు ఏర్పడుతున్నాయి. వీటినే ‘ఇన్ స్టెంట్ బ్లడ్ క్లాట్లు’ అంటారు. దీనికి కారణం మానసిక, భావోద్వేగపరమైన తీవ్ర ఒత్తిళ్లే అని వివరిస్తున్నారు. ఈ  ఒత్తిళ్ల వల్ల రక్తంలో క్లాట్లు లేదా గడ్డలు ఏర్పడి గుండెకు రక్తప్రసరణ సరిగా జరగదు. అలాంటి సమయంలో ఏ వయసులోనైనా హఠాత్తుగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. ఒత్తిడిని ఎంత తగ్గించుకుంటే అంతగా ఈ ఇన్‌స్టెంట్ బ్లడ్ కాట్లు ఏర్పడే అవకాశం తగ్గిపోతుంది. విపరీతమైన ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసోల్ అనే ఒత్తిడి హార్మోను అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఇలాంటి రసాయన మార్పులు వల్ల రక్తంలో అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఒత్తిడి   తగ్గించుకునేందుకు యోగా, ధ్యానం వంటివి చేసుకోవాలి.


నిద్ర తగ్గినా ప్రమాదమే
ఇంటర్నెట్ తక్కువ ధరకే లభించడం మొదలైనప్పటి నుంచి నిద్రలేమి సమస్యలు కూడా పెరిగిపోయాయి. ఎక్కువ మంది యువత రాత్రిపూట నిద్రను తగ్గించి, మొబైల్, టీవీ స్క్రీన్ లకే తమ కళ్ళను అంకితం చేస్తున్నారు. దీనివల్ల హార్మోన్ల ఉత్పత్తుల్లో తేడాలు వస్తున్నాయి. మెదడుకు తగిన విశ్రాంతి లభించకపోవడంతో ఒత్తిడి కూడా పెరిగిపోతుంది. ఆ ఒత్తిడి నేరుగా గుండెపైన ప్రభావం చూపిస్తుంది. అందుకే చిన్న వయసులోనే గుండె సమస్యల బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుందని వైద్యులు వివరిస్తున్నారు. రాత్రిపూట పనిచేసే వారిలోనూ ఈ సమస్య ఎక్కువగానే ఉంది. రాత్రిపూట పని చేశాక ఉదయం పూట ఎంతగా నిద్ర పోయినా కూడా రాత్రి నిద్రతో సమానం కాదని చెబుతున్నారు. మన జీవన చక్రానికి తగినట్టు రాత్రివేళ నిద్రపోవడం, ఉదయం పూట పనులు చేసుకోవడం అన్నదే సరైన పద్ధతిని వివరిస్తున్నారు. లేకపోతే మనకు తెలియకుండానే శరీరంలో ఒత్తిడి పెరిగిపోయి ఇలాంటి గుండె జబ్బులకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.


ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. జంక్ ఫుడ్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి. ధూమపానం వంటివి మానేయాలి. అర్ధరాత్రి దాటాక ఆహారం తినడం వంటివి తగ్గించుకోవాలి. 


Also read: తిన్న తర్వాత తేన్పులు ఎందుకు వస్తాయి? వాటిని అణచుకోవచ్చా?






























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.