పొట్టనిండా ఆహారం తిన్నాక బ్రేవ్ మంటూ తేనుస్తారు చాలామంది. కొంతమంది మాత్రం పదిమందిలో ఉన్నప్పుడు తేన్చడానికి ఇబ్బంది పడుతుంటారు. కానీ తేన్పులు వస్తున్నప్పుడు ఆపడం మంచిది కాదు. దగ్గు, తుమ్ము ఎలా ఆపకూడదో, తేన్పులు కూడా అలా ఆపకూడదు. వస్తుంటే తేన్చేయాలి. 


ఎందుకు వస్తుంది?
మనం ఆహారం తిన్న ప్రతిసారి లేదా తాగిన ప్రతిసారి.. వాటితో పాటు కొంత గాలి కూడా లోపలికి వెళుతుంది. ఆ గాలి అన్నవాహికలోకి ప్రవేశించి జీర్ణాశయం ఉపరితలంలో పోగుపడుతుంది. దీంతో జీర్ణాశయం కాస్త ఉబ్బినట్టు అవుతుంది. అలా ఉబ్బగానే జీర్ణాశయ గోడలలో ఉన్న గ్రహకాలు ఈ విషయాన్ని అన్నవాహికకు సంకేతాల రూపంలో పంపుతాయి. అన్నవాహిక, జీర్ణాశయం కలిసే చోట ఒక బిగుతైన కండర వలయం ఉంటుంది. అది కొద్దిగా తెరుచుకుంటుంది. తెరుచుకోగానే లోపల ఉన్న గాలి బయటికి వచ్చేస్తుంది. ఇదంతా మన ఆరోగ్యానికి రక్షణగానే జరుగుతుంది. గాలి లోపలే ఉండిపోతే, గ్యాస్‌లా మారి జీర్ణాశయం మరింతగా ఉబ్బి పొట్టనొప్పి వచ్చేస్తుంది. అందుకే మన శరీరం ఆ గాలిని బయటికి పోయేలా చేస్తుంది. అయితే అతిగా తేన్పులు వస్తే మాత్రం తేలికగా తీసుకోకూడదు. తేన్పులతో పాటు జీర్ణరసాలు కూడా గొంతులోకి ఎగదన్నుకుని వస్తే, ఏదో ఒక సమస్య ఉందని అర్థం. ముఖ్యంగా ఇరిటేబుల్ ఓవల్ సిండ్రోమ్ వంటి సమస్యల్లో ఈ తేన్పులు ఎక్కువగా కనిపిస్తాయి.


మరిన్ని కారణాలు
తేన్పులు రావడానికి మరిన్ని కారణాలు ఉన్నాయి. కూల్ డ్రింకులు, సోడా, బీరు వంటివి అధికంగా తాగినా కూడా గాలి ఎక్కువగా లోపలికి పోతుంది. అదే స్ట్రా తో తాగితే మరింత ఎక్కువగా గాలి జీర్ణాశయంలో పోగుపడుతుంది. కాబట్టి ఇలాంటివి తాగినప్పుడు నెమ్మదిగా తాగడం మంచిది, గాభరాగా తాగకూడదు.కొంతమంది వేగంగా తినేస్తారు, ఆ వేగంగా తినే ప్రక్రియలో ఎక్కువ గాలిని మింగేస్తారు. కాబట్టి నెమ్మదిగా తినాలి. చూయింగ్ గమ్ నమిలే అలవాట్లు ఉన్న వాళ్లలో కూడా గాలి అధికంగా పొట్టలో చేరుతుంది. అలాగే చాక్లెట్లు వంటివి నోట్లో పెట్టుకుని చప్పరిస్తున్నప్పుడు అధిక గాలిని మింగుతారు. ఇవన్నీ అధిక తేన్పులకు కారణం అవుతాయి.


తగ్గాలంటే...
అధికంగా తేన్పులు వస్తున్నప్పుడు వాటిని కొన్ని ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. చిన్న అల్లం ముక్కను, పంచదార లేదా తేనెతో కలిపి నమిలి మింగితే తేన్పులు తగ్గుతాయి. లేదా ఒక టేబుల్ స్పూన్ అల్లం ముక్కలను తీసుకొని నీటిలో వేసి మరిగించి, ఆ నీటిని గోరువెచ్చగా అయ్యాక తాగితే తేన్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. రోజుకి రెండు మూడు సార్లు ఆ అల్లం రసం తాగాల్సి వస్తుంది.  బొప్పాయి ముక్కలను తినడం వల్ల కూడా తేన్పు సమస్యలు తగ్గుతాయి. దీనిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది గ్యాస్ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.రోజు ఆహారంలో పెరుగు అధికంగా తిన్నా కూడా జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. తేన్పులు కూడా జీర్ణసంబంధమైనవే. ఆహారం తిన్నాక సోంపు నమలడం మంచిది. ఇది ఆహారం త్వరగా సులభంగా జీర్ణం చేస్తుంది, తేన్పులను కూడా తగ్గిస్తుంది. 


Also read: చేతులూ, కాళ్లు తరచూ తిమ్మిర్లు పడుతున్నాయా? అయితే మీకు ఈ విటమిన్ లోపం ఉన్నట్లే





























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.