చెవిలో నొప్పి, చెవిలో అసౌకర్యం, రింగింగ్ అనే శబ్ధాలు వినిపించడం వంటివి కొన్ని అంతర్లీన వ్యాధులకు లక్షణాలుగా చెబుతారు వైద్యులు. చెవిలో రింగింగ్ శబ్ధం వినిపించడాన్ని ‘టిన్నిటస్’ అంటారు. ఈ సమస్యతో బాధపడే వారు అలా శబ్ధాలు వినిపించడం తేలికగా తీసుకుంటారు, కానీ కొన్ని ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలకు ఇది లక్షణం కావచ్చు.  ఈ రింగింగ్ శబ్ధాలు వినిపించడం వెనుక చాలా కారణాలు ఉండే అవకాశం ఉంది. అలాంటి కొన్ని ఆరోగ్య సమస్యలు ఇదిగో...


ట్యూమర్స్
తలలో కణితులు ఏర్పడినా కూడా ఇలా రింగింగ్ శబ్దాలు వినబడే అవకాశం ఉంది. ఎకౌస్టిక్ న్యూరోమా అనేది చెవులను మెదడుకు అనుసంధానించే నరాలలో ఏర్పడే కణితి. నరాలలో రక్తప్రసరణకు అంతరాయం కలిగినప్పుడు చెవుల్లో రింగింగ్ శబ్దాలు రావచ్చు. మనిషి బ్యాలెన్స్‌ను కూడా కోల్పోతారు. వినికిడి లోపం కూడా వస్తుంది.


మధ్య చెవిలో..
మధ్య చెవిలో ఉండే ఎముక అసాధారణంగా ఒక్కోసారి పెరుగుతుంది. ఇది వినికిడి లోపానికి దారి తీస్తుంది. అలాగే టిన్నిటస్ వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.


ధమనులు, సిరలలో లోపాలు
రక్తనాళాల్లో ముఖ్యమైనవి ధమనులు, సిరలు. రక్తం రక్తనాళాల గోడలపై అధిక ఒత్తిడిని కలిగిస్తూ ప్రవహిస్తున్నప్పుడు, ఆ వ్యక్తికి రక్తపోటు రావచ్చు. లేదా రక్తనాళాలలో ఫలకాలు లాంటివి ఏర్పడవచ్చు. అలాంటి సమయంలో కూడా చెవిలో రింగుమనే శబ్దం వినబడే అవకాశం ఉంది.


హైపోథైరాయిడిజం
హైపోథైరాయిడిజం ఉన్నప్పటికీ అది చెవి వ్యవస్థను ప్రభావితం చేసే అవకాశాలు తక్కువే.  కానీ కొన్ని పరిస్థితుల్లో థైరాక్సిన్ హార్మోను చెవి వ్యవస్థ పై ప్రభావం చూపిస్తుంది. ఆ హార్మోను అవసరమైన దానికంటే తక్కువ ఉత్పత్తి అయినప్పుడు వినికిడి సామర్ధ్యం తగ్గుతుంది. హైపోథైరాయిడిజం బాధపడుతున్న వారిలో 50 శాతం మంది టిన్నిటస్ బారిన పడే అవకాశం ఉంది. 


రక్తహీనత
ఇనుము మన శరీరానికి అత్యవసరమైన పోషకం. ఇదే ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని శరీరమంతా రవాణా చేస్తుంది. ఇనుము లోపం ఏర్పడితే ధమనులు అతిగా కష్టపడాల్సి వస్తుంది. గుండె కూడా రక్తాన్ని కష్టంగా పంపు చేయాల్సి వస్తుంది. గుండె మరింతగా కష్టపడుతున్నప్పుడు ఆ హృదయ స్పందన లేదా పల్స్  బయటికి వినిపిస్తుంది. దీన్నే పల్సంటైల్స్ టిన్నిటస్ అంటారు. ఇలాంటి వ్యక్తులు గుండె సంబంధిత వ్యాధులకు త్వరగా గురవుతారు. 


ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య సమస్యలు అధికంగా పెరిగిపోతున్నాయి. చెవిలో ఏమాత్రం అసౌకర్యంగా అనిపించినప్పుడు తేలికగా తీసుకోకుండా ఒకసారి వైద్యులను సంప్రదించడం ఉత్తమం. ఎందుకంటే ఒక్కోసారి అది ప్రమాదకరమైన అనారోగ్యానికి కారణం కావచ్చు.


Also read: మన స్వాతంత్ర ఉద్యమంలో చపాతీది ప్రత్యేక పాత్ర, వాటిని చూసి భయపడి పోయిన బ్రిటిష్ అధికారులు


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.