దేశంలో ఒమిక్రాన్ వల్ల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మూడు రోజుల్లోనే కేసుల సంఖ్య డబుల్ అయింది. ప్రస్తుతం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 200 దాటింది. ఇందులో 77 మంది ఇప్పటికే రికవరీ లేదా మైగ్రేట్ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.






మహారాష్ట్ర, దిల్లీలో ఒమిక్రాన్ కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. రెండు ప్రాంతాల్లోనూ చెరో 54 కేసులు నమోదయ్యాయి. తెలంగాణ (20), కర్ణాటక (19), రాజస్థాన్ (18), కేరళ (15), గుజరాత్ (14) కేసులు నమోదయ్యాయి.


మహారాష్ట్రలో ఒమిక్రాన్ సోకిన 54 మందిలో 31 మంది డిశ్ఛార్జ్ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇందులో ఒక్క ముంబయిలోనే 22 కేసులు నమోదయ్యాయి.


వ్యాప్తి ఎక్కువ..


డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది. సామూహిక వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు 1.5 నుంచి 3 రోజుల్లో రెట్టింపవుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఒమిక్రాన్‌ బారిన పడిన 89 దేశాల్లో వైరస్‌ వ్యాప్తి తీరుకు సంబంధించిన నివేదికల ఆధారంగా ఈ మేరకు వెల్లడించింది. ఈ నేపథ్యంలో డెల్టా కేసులను ఒమిక్రాన్ దాటేసే అవకాశం ఉందని అభిప్రాయపడింది.


ఒమిక్రాన్‌.. వైరస్‌ రోగ నిరోధక శక్తిని అధిగమిస్తుండటంతోనే వ్యాప్తి వేగంగా జరుతున్నదా అన్న దానిపై ప్రస్తుతం స్పష్టత లేదని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. అలాగే ఒమిక్రాన్ వేరియంట్‌ వల్ల కలిగే ముప్పు గురించి ఇప్పటి వరకు తక్కువ సమాచారం మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. మరింత డేటా ఆధారంగానే ఈ వేరియంట్‌ ముప్పును పూర్తిగా అంచనా వేయగలమని అభిప్రాయపడింది. అయితే ఒమిక్రాన్‌ కేసుల పెరుగుదల నేపథ్యంలో ఆరోగ్య వ్యవస్థలపై మరోసారి భారం పడవచ్చని హెచ్చరించింది. ప్రస్తుతం బ్రిటన్‌, దక్షిణాఫ్రికా దేశాల్లో ఒమిక్రాన్ రోగులతో ఆసుపత్రులు నిండుతున్నట్లు పేర్కొంది.


Also Read: Omicron Death In US: అమెరికాలో ఒమిక్రాన్‌‌తో తొలి మరణం నమోదు.. యూఎస్‌లో మొదలైన కలవరం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి