మనసు ప్రశాంతంగా అనిపిస్తేనే జీవితం కూడా సుఖంగా అనిపిస్తుంది. ఒత్తిడి, నిద్రలేమి, అధికంగా భావోద్వేగాలకు గురవడం ఇవన్నీ కూడా మానసిక పరిస్థితిపై చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి మానసిక ప్రశాంతత కోసం ఆహారపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. చాలామందికి మానసిక స్థితిపై ఆహారం కూడా ప్రభావం చూపిస్తుంది అనే విషయమే తెలియదు. రెండింటికి ఎలాంటి సంబంధం లేదనుకుంటారు. నిజానికి మన మూడ్ పై మనం తీసుకునే ఆహారం ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్ని రకాల ఆహారాలు మానసిక స్థితిని మెరుగుపరిస్తే, కొన్ని రకాల ఆహారాలు మూడ్ ని చెడగొడతాయి. ఒత్తిడిని పెంచేస్తాయి. నిద్ర పట్టకుండా చేస్తాయి. భావోద్వేగాలను అధికంగా ప్రేరేపిస్తాయి. కుంగుబాటును కలిగిస్తాయి. ఈ విషయం మేం చెప్పడం లేదు, ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి.  మనం తీసుకునే ఆహారం ఎప్పుడు తీసుకుంటున్నాం? ఎన్ని గంటలకు ఒకసారి తీసుకుంటున్నాం? అనేది కూడా మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ హెచ్చుతగ్గులు, అలాగే పోషకాల లోపం భావోద్వేగాలు అదుపు తప్పేలా చేస్తాయి. దీని కారణంగా మానసిక సమస్యలు వస్తాయి. కాబట్టి మానసికంగా మీరు ప్రశాంతంగా ఉండాలంటే, ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి


వీటిని తినకండి
తీపి పానీయాలు, స్వీట్లు, వేపుళ్ళు, మాంసం, వెన్న, చీజ్ ఎంతోమందికి ఇష్టమైనవి. వీటిని రోజూ తినడానికి ఇష్టపడతారు. కానీ వీటివల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది. దీని కారణంగా మానసిక పరిస్థితి మారిపోతుంది. కుంగుబాటు త్వరగా వస్తుంది. భావోద్వేగాలు అదుపు తప్పుతాయి. అలాంటివి చాలా అరుదుగా తింటూ ఉండాలి. తాజా కూరగాయలు, పండ్లు అధికంగా తినాలి. ఇవి మానసిక పరిస్థితిని కాపాడతాయి. పోషకాహార లోపం లేకుండా చూసుకోవాలి. విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ డి, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, జింక్, మెగ్నీషియం, ఐరన్... ఇవన్నీ లోపిస్తే మానసిక పరిస్థితి కూడా దెబ్బతింటుంది. మానసికంగా శక్తిహీనులు అవుతారు. కాబట్టి ఈ పోషకాలన్నీ ఉన్న ఆహారం రోజూ అధికంగా తినాలి. కేకులు, బ్రెడ్లు వంటివి తినడం తగ్గించాలి.వీటివల్ల రక్తంలో గ్లూకోజు పెరగడం, తగ్గడం అనేది త్వరగా జరుగుతుంది. దీని కారణంగా మూడ్ కూడా మారిపోయి, త్వరగా కోపం, చిరాకు అలాగే నీరసం కూడా వస్తుంది. 


ఈ పనులు చేయద్దు
చాలామంది భోజనాన్ని స్కిప్ చేస్తుంటారు. వేళకు ఆహారం తీసుకోకపోవడం కూడా చాలా ప్రమాదం. ఒకటి, రెండు రోజులు అలా చేస్తే పర్వాలేదు కానీ కొంతమంది వారాల తరబడి రోజు ఇలాగే చేస్తారు. బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం లేకపోతే మధ్యాహ్న భోజనం తినడం మానేయడం చేస్తుంటారు. ఇవన్నీ కూడా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు మారిపోవడానికి కారణం అవుతాయి. ఉల్లాసం ఉత్సాహం అనేవి నీరుగారిపోతాయి. ఆలోచన విధానం కూడా మారిపోతుంది. కోపంగా మారిపోతారు. నీరసం ఆవహిస్తుంది. కాబట్టి రోజు ఒకే సమయానికి భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి.


కాఫీ తాగడం వల్ల ఉత్సాహం వస్తుంది అనేది నిజమే, కానీ అధికంగా కాఫీ తాగితే అదే ఉత్సాహం మానసిక సమస్యలకు కారణం అవుతుంది. కాఫీలో ఉండే కెఫిన్ శరీరాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. నిద్రను రాకుండా అడ్డుకుంటుంది. కాబట్టి టీ కాఫీ లాంటివి రోజులో రెండుసార్లకు మించి తీసుకోకపోవడం మంచిది.


మానసిక ప్రశాంతత కావాలనుకుంటే రోజులో ద్రవ ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ఒంట్లో నీరు అధికంగా ఉండేలా చూసుకోవాలి. నీరు తగ్గినా కూడా మెదడుకు ఆక్సిజన్ అందే క్రమం దెబ్బ తింటుంది. అప్పుడు తలనొప్పి, నీరసం, కోపం వచ్చేస్తాయి. కాబట్టి నీరు తగ్గకుండా చూసుకోవాలి. రోజులో ఎట్టి పరిస్థితుల్లో ఎనిమిది గ్లాసులు కన్నా ఎక్కువ నీరే తాగాలి. 


ఒకేసారి ఎక్కువ తినే కన్నా... ఎక్కువసార్లు కొంచెం కొంచెంగా తినడం అనేది శరీరానికి నిత్యం శక్తి అందేలా చేస్తుంది. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిల్లో కూడా మార్పులు అధికంగా ఉండవు. అప్పుడు శక్తి ప్రవాహం శరీరంలో నిత్యం ఉంటుంది. కాబట్టి రెండు మూడు గంటలకు ఒకసారి కొంచెం కొంచెం ఆహారం తినేటట్టు ప్లాన్ చేసుకోండి. ముఖ్యంగా నట్స్, పప్పు దినుసులు, తాజా కూరలు, ఆకుకూరలు, పండ్లు... మీ ఆహారంలో ఉండేట్టు చూసుకుంటే మానసిక ప్రశాంతత దక్కుతుంది.


 మెదడు సరిగా పనిచేయాలంటే ఒమేగా 3, ఒమేగా 6 వంటి ఫ్యాటీ ఆమ్లాలు చాలా అవసరం. ఇవి గుమ్మడి విత్తనాలు, పాలు, గుడ్లు, పొద్దు తిరుగుడు గింజలు, చేపలు, పెరుగు వంటి వాటిల్లో ఉంటాయి. కాబట్టి వీటిని రోజువారి ఆహారంలో ఉండేట్టు చూసుకోండి. 


Also read: మొటిమల కారణంగా చెంపలపై పడిన గుంతలు పోతాయా? ఎలాంటి చికిత్సలు ఉన్నాయి?