Monkeypox Vaccine :  ఇప్పుడంతా వైరస్‌ల కాలం. భయం..భయంగా గడపడమే జనం చేస్తున్నది. వాళ్లకి కాస్త ధైర్యం ఇస్తోంది వ్యాక్సిన్‌లే. కరోనా వైరస్‌కు ప్రికాషన్ డోస్‌ కూడా వేసుకుని ధీమాగా ఉందామనుకునేలోపు మంకీపాక్స్ వైరస్ విరుచుకుపడుతోంది. దేశంలో ఇప్పుడిప్పుడే కేసులు బయట పడుతున్నాయి. దీంతో ప్రజలంతా మళ్లీ ఆ వైరస్‌కు చిక్కకుండా దాక్కోవాల్సిన పరిస్థితి. కరోనా కాలంలో వ్యాక్సిన్ల పేరుతో భారీగా ప్రచారం, ఆదాయం పొందిన సంస్థల్లో ఒకటి సీరమ్ ఇనిస్టిట్యూట్. ఆ సంస్థ అధినేత అదర్ పూనావాలా ఇప్పుడు... మంకీపాక్స్ వైరస్ విషయంలో  మరోసారి వ్యాక్సిన్ కబురు మోసుకొచ్చారు. 


ట్రెండింగ్‌లో బాయ్‌కాట్‌ ఫ్లిప్‌కార్ట్ హ్యాష్‌ట్యాగ్, చీప్ ట్రిక్స్ ఆపాలంటున్న నెటిజన్లు-ఏమైందంటే?


మంకీపాక్స్‌ను కట్టడి చేసేందుకు  వ్యాక్సిన్‌ కనుగొనేందుకు  సీరం ఇన్‌స్టిట్యూట్‌ కసరత్తులు మొదలుపెట్టింది. వ్యాక్సిన్‌ పంపిణీ అనివార్యమైన తరుణంలో దీనిని దిగుమతి చేసుకునేందుకు డెన్మార్క్‌కు చెందిన సంస్థతో ఇప్పటికే సంప్రదింపులు మొదలుపెట్టినట్లు ఆ సంస్థ సీఈఓ  అదర్‌ పూణావాలా వెల్లడించారు. అయితే ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయాలంటే కొన్ని నెలల పాటు పట్టవచ్చునని ఆయన చెబుతున్నారు. ఒకవేళ ఒప్పందం కుదిరితే వచ్చే రెండు, మూడు నెలల్లోనే భారత్‌కు వ్యాక్సిన్‌ దిగుమతి చేసుకుంటామని పూనావాలా చెప్పుకొచ్చారు. 


ఠాక్రేకు CM శిందే స్వీట్ విషెస్- మీకు అర్థమవుతోందా?


భారత్‌లో తయారు చేయడం మొదలుపెడితే.. మార్కెట్‌లోకి రావడానికి ఏడాది సమయం పడుతుంది. ఈ మహమ్మారి కేసులు పెరుగుతున్నప్పటికీ.. కరోనాలా వ్యాపించదని పూనావాలా చెబుతున్నారు.  ఈ వ్యాక్సిన్‌ అందరికీ అవసరముండకపోవచ్చునని, వ్యాప్తి ఉన్న ప్రాంతాల్లో, వ్యక్తులకు వేస్తే సరిపోతుందని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఈ వైరస్‌ వ్యాప్తిలో ఉందన్న ఆయన.. దీని పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.  డబ్ల్యుహెచ్‌ఒ నియమాలకు అనుగుణంగా వైరస్‌ వ్యాప్తి కట్టడి చర్యలు తీసుకోవాలని సీరం ఇన్‌స్టిట్యూట్‌ చీఫ్‌ చెబుతున్నారు. 


 మాల్‌పాక్స్‌కు ఉపయోగించే వ్యాక్సిన్‌ను పలు దేశాలు  మంకీ పాక్స్‌కు వినియోగిస్తున్నాయి. ఈ స్మాల్‌పాక్స్‌ వ్యాక్సిన్‌ను డెన్మార్క్‌కు చెందిన బవారియన్‌ నార్డిక్‌ అనే సంస్థ తయారు చేసింది. పలు బ్రాండ్ల పేరుతో అమెరికా, యూరప్‌ దేశాల మార్కెట్‌లో అందుబాటులోకి తెచ్చింది. దీన్నే అదర్ పూనావాలా దిగుమతి చేస్తామంటున్నారు. కేంద్రం కూడా వ్యాక్సిన్‌పై దృష్టి పెట్టింది. భవిష్యత్తులో మంకీ పాక్స్‌ వ్యాక్సిన్‌ అవసరమవుతుందని అందుకే వ్యాక్సిన్ అభివృద్ధికి ఉన్న  అవకాశాలపై ప్రైవేటు వ్యాక్సిన్‌ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామని నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ ప్రకటించారు.