Microplastics Found In Human Brains:  మైక్రో ప్లాస్టిక్స్ కారణంగా మానవాళికి తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరించారు. మెదడు సహా శరీరంలోని కీలక అవయవాలలో మైక్రో ప్లాస్టిక్స్ పేరుకుపోతున్నట్లు తెలిపారు. మైక్రో ప్లాస్టిక్స్ కాలుష్యాన్ని అరికట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తాగునీరు, ఆహారంలో ఉండే మైక్రోప్లాస్టిక్స్ విషయంలో అప్రమత్తం అవసరం అని టర్కీ శాస్త్రవేత్తలు తెలిపారు. మెదడులోకి మైక్రో ప్లాస్టిక్స్ చొచ్చుకుపోతున్నట్లు గుర్తించారు. పరిశోధన ఫలితాలను బట్టి, ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఎదుర్కోవటానికి ప్రపంచ వ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించడం అత్యవసరమని కుకురోవా విశ్వవిద్యాలయంలో మైక్రోప్లాస్టిక్‌లపై అధ్యయనం చేస్తున్న సెడాట్ గుండోగ్డు వెల్లడించారు.


మానవ శరీరంలోని పలు అవయవాల్లో మైక్రోప్లాస్టిక్స్


గత కొంతకాలంగా నిర్వహించిన పరిశోధనలో మైక్రోప్లాస్టిక్‌ శరీరంలోని అన్ని అవయవాలకు చేరినట్లు గుర్తించారు. కుకురోవా విశ్వవిద్యాలయం పరిశోధన కథనాన్ని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఆన్ లైన ద్వారా ప్రచురించింది. ఈ అధ్యయనం గురించి  రచయిత, న్యూ మెక్సికో విశ్వవిద్యాలయంలో టాక్సికాలజిస్ట్, ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ప్రొఫెసర్ మాథ్యూ కాంపెన్ కీలక విషయాలు వెల్లడించారు. మెదడులో మైక్రోప్లాస్టిక్స్ పేరుకుపోవడం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. మూత్రపిండాలు, మెదడు, కాలేయం, జీర్ణవాహిక, ప్లీహం, ఊపిరితిత్తులు, మోకాలు, మోచేయి, రక్తనాళాలు, ఎముక మజ్జలోనూ మైక్రోప్లాస్టిక్‌ అవశేషాలు కనిపించినట్లు తెలిపారు. రక్త ప్రవాహాన్ని నాడీ వ్యవస్థ నుంచి మైక్రోప్లాస్టిక్స్‌ వేరు చేస్తున్నట్లు వెల్లడించారు. న్యూరోకాగ్నిటివ్‌ సమస్యలకు కారణం అవుతున్నట్లు తెలిపారు. 2024 ప్రారంభంలో తీసుకున్న మెదడు నమూనాలలో సగటున 0.5%  మైక్రో ప్లాస్టిక్‌ ను కనుగొన్నట్లు తెలిపారు. ఇది చాలా సీరియస్ విషయన్నారు. మైక్రోప్లాస్టిక్‌ విషయంలో ప్రపంచ వ్యాప్త ఎమర్జెన్సీ విధించాలని ఆయన అభిప్రాయపడ్డారు.


ఉప్పులో ప్రమాదకర స్థాయిలో మైక్రోప్లాస్టిక్స్


గత కొద్ది కాలం క్రితం ఉప్పులో ప్రమాదకర స్థాయిలో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయంటూ పరిశోధనలు వెల్లడించాయి. భారత్ లో దొరికే అన్ని రకాల ఉప్పు ప్యాకెట్లలో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. టాక్సిక్స్‌ లింక్‌ అనే సంస్థ విడుదల చేసిన మైక్రోప్లాస్టిక్స్‌ ఇన్‌ సాల్ట్‌ అండ్‌ షుగర్‌  నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. టేబుల్‌ సాల్ట్‌, రాక్‌ సాల్ట్‌, సీ సాల్ట్‌, రా సాల్ట్‌ సహా పలు రకాల ఉప్పులను పరిశీలించగా అన్ని శాంపిల్స్ లో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్లు గుర్తించారు. 0.1 ఎంఎం నుంచి 5 ఎంఎం పరిమాణంలో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్లు వెల్లడించారు. అత్యధికంగా అయోడైజ్ డ్ ఉప్పులో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్లు పరిశోధన వెల్లడించింది. తాగే వాటర్ లోనూ మైక్రోప్లాస్టిక్స్ స్థాయిలో అధికంగా ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. మైక్రోప్లాస్టిక్స్ ఇలాగే పెరిగిపోతే రానున్న రోజుల్లో తీవ్ర ముప్పు తప్పదని హెచ్చరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మైక్రోప్లాస్టిక్స్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.   


Read Also: పూర్వీకులకూ రిలాక్స్ అయ్యేందుకు వీకెండ్‌ ఉండేదట, ఆ కాన్సెప్ట్ కథేంటో తెలుసుకోండి!



Read Also: చికెన్ లివర్ అంటే ఇష్టమా? బాగా తింటారా? అయితే ఇది మీకోసమే.. మగవారు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి