Crocodile Tear Syndrome | సాధారణంగా నచ్చిన ఆహారాన్ని తింటున్నప్పుడు తెలియకుండానే కళ్ల నుంచి నీళ్లు వచ్చేస్తాయి. అయితే, అవి ఆనంద భాష్పాలు. అలాగే వంటలో కారం, మసాలాలు ఎక్కువైనా కళ్ల నుంచి నీళ్లు కారిపోతుంటాయి. అది మంట వల్ల కలిగే బాధ. కానీ, చైనాకు చెందిన ఈ వ్యక్తికి ఆనందం, బాధతో పనిలేకుండా ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటాడు. ముఖ్యంగా ఆహారం తిన్నప్పుడు లేదా వాసన చూసినప్పుడు అతడి కళ్ల నుంచి నీళ్లు వచ్చేస్తాయి. పాపం, ఈ సమస్య వల్ల అతడు బయటకెళ్లి భోజనం చేయాలంటేనే వణికిపోతున్నాడు. 


చైనా మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. జాంగ్ అనే వ్యక్తి వింత రోగంతో బాధపడేవాడు. ఆహారం వాసన చూసినా, నోట్లో పెట్టుకున్నా అతడికి కన్నీళ్లు వచ్చేస్తాయి. ఇది వ్యాధి అని తెలియకపోవడం వల్ల చాలామంది ‘‘పాపం, అన్నం తిని ఎన్నాళ్లయ్యిందో. సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు’’ అని జాలి చూపేవారు. కొందరైతే.. ఏదో బాధలో ఉన్నాడేమోనని ఓదార్చేందుకు ప్రయత్నించేవారు. ఆ ఓదార్పులు తట్టుకోలేక అతడు బయటకు వెళ్లి భోజనం చేయడమే మానేశాడు. ఒక వేళ వెళ్తే.. కళ్లకు సన్ గ్లాసెస్ పెట్టుకుని కన్నీళ్లను కవర్ చేసేవాడు. 


ఇంతకీ ఏం జరిగింది?: జాంగ్ తన సమస్య పరిష్కారం కోసం ఎంతోమంది వైద్యులను సంప్రదించాడు. ఎట్టకేలకు అతడు తన రోగాన్ని తెలుసుకోగలిగాడు. అతడు ‘క్రోకోడైల్ టియర్ సిండ్రోమ్’ వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఇందుకు చికిత్స సాధ్యమేనని చెప్పడంతో జాంగ్ ఆనందానికి అవధులే లేవు. ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆప్తాల్మలజీ’ వైద్యుడు డాక్టర్ చెంగ్ మియన్ చిన్హ్ ఈ సమస్య గురించి తెలుపుతూ.. గతంలో అతడికి ఏర్పడిన ముఖ పక్షవాతం (Facial Paralysis) లాక్రిమల్ గ్రంథులు (Lacrimal Glands) మీద ప్రభావం చూపింది. పక్షవాతం నుంచి కోలుకుంటున్న సమయంలో అతడి ముఖ నరాలు వేరొక దిశలోకి వెళ్లాయి. లాలాజల నాడి సబ్‌మాండిబ్యులర్ గ్రంధిని కలవడానికి బదులుగా లాక్రిమల్ గ్రంధిని కలిశాయి. దీనివల్ల ఆహారం వాసన లేదా రుచి వంటి ఉద్దీపనలు లాలాజలాన్ని విడుదల చేయడానికి బదలుగా కన్నీళ్లు ఉత్పత్తి చేయడానికి లాక్రిమల్ గ్రంధిని ఉత్తేజపరిచేవి. 


Also Read: కూల్ డ్రింక్ తాగిన కొన్ని గంటల్లోనే వ్యక్తి మృతి.. ఇతడిలా మీరు చేయొద్దు!


అందుకే, అతడికి ఆహారం తిన్న, ఆహారం వాసన చూసినా కన్నీళ్లు వచ్చేవి. అంటే, అతడి నోట్లో లాలాజలం ఊరడానికి బదులు.. కంట్లో కనీళ్లు ఉత్పత్తి అవుతున్నాయన్న మాట. మొత్తానికి వైద్యులు ఆ సమస్యను తెలుసుకుని శస్త్ర చికిత్సతో సరిచేశారు. దీంతో ఇప్పుడు జాంగ్ ఏడవకుండానే ఆహారాన్ని తీసుకుంటున్నాడు. ‘క్రోకోడైల్ టియర్ సిండ్రోమ్’ అనేది ఒకొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొన్ని మైల్డ్ కేసులను శస్త్ర చికిత్స అవసరం లేకుండానే పరిష్కరించవచ్చు. కానీ కొన్ని సీరియస్ కేసుల్లో మాత్రం లాక్రిమల్ గ్లాండ్‌లోకి బోటులినమ్ టాక్సిన్(Botulinum Toxin) ఇంజెక్ట్ చేస్తారు. ఇది ఆరు నెలలు వరకు పనిచేస్తుంది.  


Also Read: సోయా తింటే పురుషుల్లో ఆ శక్తి తగ్గుతుందా? సంతానం కష్టమేనా?