U.S, U.K లో డాక్టర్ అంటే లైఫ్ సెటిల్ అయిపోయినట్లే..! కానీ అక్కడ అత్యున్నత స్థాయిలో పనిచేసిన వైద్యులు మాతృభూమిపై మమకారంతోె మనగడ్డకు తిరిగి వచ్చారు. వారి గురించి ఈ డాక్టర్స్ డే సందర్భంగా తెలుసుకుందాం.
మాతృదేశం వైపు.. ఎన్నారై వైద్యుల చూపు!
NRI DOCTORS: మన భారతీయులకు, ముఖ్యంగా తెలుగు వాళ్లకి డాలర్ డ్రీమ్స్ కొత్తకాదు. దశాబ్దాల కిందటే ఖండాంతర ఖ్యాతి మన వాళ్ల సొంతం. డాక్టర్లు, సైంటిస్టులు, ఇంజనీర్లుగా పెద్ద ఎత్తున విదేశాల్లో స్థిరపడ్డారు. ఇక అమెరికాలో అయితే ప్రతి నలుగురు డాక్టర్లలో ఒకరు ఇండియన్ అయితే .. అందులో నాలుగోవంతు మంది మళ్లీ తెలుగువాళ్లు ఉంటారు. అమెరికా, ఇంగ్లండ్ లాంటి దేశాల్లో వైద్యవృత్తి అంటే డాలర్లు, పౌండ్ల వర్షం కురుస్తుంటుంది. గౌరవ మర్యాదలకూ లోటు ఉండదు. అత్యున్నత ప్రమాణాలు కూడా పాటిస్తారు. అంతే కాదు అక్కడ పనిచేస్తే.. రీసెర్చ్, ఇంకా ఇతర రంగాల్లో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్లే సంపాదన కూడా.. ఇవన్నీ ఉన్నా కూడా కొంత మంది వైద్యులు జన్మభూమికి తిరిగొచ్చారు. ఏ దేశమేగినా.. తన గమ్యం ఇదే అన్నట్లు మళ్లీ ఇక్కడే స్థిరపడ్డారు.
దశాబ్దాల కిందటే చాలా మంది వైద్యులు.. అత్యున్నత శిక్షణ అనుభవం పొంది భారతదేశానికి వచ్చిన వాళ్లున్నారు. యుఎస్ యుకె లాంటి అత్యున్నత వైద్య ప్రమాణాలు ఇక్కడ నెలకొల్పాలని కానీ.. లేదా తమను ఇంతటి స్థాయికి తీసుకొచ్చిన ప్రాంతానికి ఏదైనా చేయాలన్న తలంపుతో కానీ వీళ్లంతా మాతృభూమికి తిరగొచ్చారు. ఇక్కడ ఇప్పటికే ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ ఆస్పత్రులలో చేరి, తమ సేవలు అందిస్తున్నవారు కొందరైతే, అవసరాన్ని బట్టి సొంతంగా అయినా సరే ఆస్పత్రులు ఏర్పాటుచేసి తమకు తెలిసిన, తాము సముపార్జించిన జ్ఞానాన్ని తమ ప్రజల కోసం వినియోగిస్తున్న వారందరు కొంతమంది ఉన్నారు. డాక్టర్స్ డే సందర్భగా అలాంటి వైద్య నిపుణల గురించి తెలుసుకుందాం..
అమెరికాలో డబ్బు వస్తుంది కానీ.. ఇక్కడ చేస్తే వచ్చే తృప్తి రాదు..
అమెరికాలో ఉంటే కెరీర్ పరంగా ఇంకా మెరుగుదల ఉంటుంది.. డబ్బు కూడా బాగానే వస్తుంది కానీ.. ఇక్కడ పనిచేసిన సంతృప్తి అక్కడ ఉండదని రివియా ఆస్పత్రికి చెందిన వాస్క్యులర్, ఎండోవాస్క్యులర్ సర్జన్ డాక్టర్ కార్తీక్ మిక్కినేని అన్నారు.
నేను 2022 వరకు స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో వైద్యబోధన చేస్తూ, ప్రాక్టీస్ కూడా చేసేవాడిని. కానీ, ఒకసారి ఎందుకో గానీ, సొంత దేశంలో మరిన్ని మెరుగైన వైద్య అవకాశాలు ఉండాలి కదా అనిపించింది. ఏఐజీ ఆస్పత్రిలో వాస్క్యులర్ సర్జరీ విభాగాధిపతిగా చేసేవాడిని. తర్వాత సొంత ఆస్పత్రి పెట్టుకున్నాను. ఆర్థికపరంగా చూసుకుంటే ఇక్కడ సంపాదించేదాని కంటే అమెరికాలో మూడు నాలుగు రెట్లు ఎక్కువ సంపాదించగలం. కానీ, ఇక్కడ మన సొంత మనుషులకు చికిత్సలు అందించి, వారికి ఊరట కల్పిస్తే వచ్చే మానసిక సంతృప్తి అక్కడ ఎన్ని డాలర్లు ఇచ్చినా దొరకదు. మాతృభూమికి ఎంతో కొంత సేవ చేయాలన్న భావనతోనే తిరిగి వచ్చేశాను. ఇప్పుడు నాలా చాలామంది ఆలోచిస్తున్నారు"- డాక్టర్ కార్తిక్ మిక్కిలినేని, వాస్క్యులర్ సర్జన్ రివియా హాస్పిటల్
డాక్టర్ కార్తిక్ మిక్కిలినేని, వాస్క్యులర్ సర్జన్ రివియా హాస్పిటల్
కార్పోరేట్‌లో జెనెటిక్స్ ప్రారంభించాం.
అత్యున్నత ప్రమాణాలతో మెడికల్ రంగానికి హైదరాబాద్ ఓ గమ్య స్థానంగా మారుతోందని కామినేని హాస్టిటల్స్ జెనెటిక్స్ అండ్ మాలిక్యులర్ మెడిసిన్ విభాగం హెడ్ Dr. Annie Q Hasan తెలిపారు. అమెరికా, ఇంగ్లండ్ వంటి చోట్ల పనిచేసిన తాను.. కార్పోరేట్ ఆసుపత్రుల స్థాయిలో జెనెటిక్స్ ఉండాలన్న లక్ష్యంతో ఇక్కడకు వచ్చానన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో జెనెటిక్స్, వైద్య పరీక్షలు రెండూ ఆసుపత్రుల్లోనే జరుగుతాయని.. ఇక్కడ పెద్ద యూనివర్సిటీలు, CCMB వంటి చోట మాత్రమే అలాంటి పరిస్థితి ఉండేదని.. ఆసుపత్రుల్లోనూ.. అవి అందుబాటులోకి రావాలన్న ఉద్దేశ్యంతో ఇక్కడకు వచ్చినట్లు చెప్పారు .
"వెల్లింగ్టన్ మెడికల్ స్కూల్లో 8 సంవత్సరాలు చేశాను. తర్వాత అమెరికా, ఇంగ్లండ్ లాంటి దేశాల్లో కూడా పలు ప్రఖ్యాత ఆస్పత్రుల్లో పని, పరిశోధన చేశాను. ఇతర దేశాల్లో జెనెటిక్స్ పరీక్షలు, పరిశోధన రెండూ వైద్య కళాశాలల్లో జరుగుతాయి. దేశంలో కేవలం యూనివర్సిటీల్లోను, సీసీఎంబీ లాంటిచోట్ల జరుగుతోంది. జెనెటిక్స్ పరిశోధన ఫలితాలకు - చికిత్సకు మధ్య చాలా అంతరం ఉందని, దాన్ని పూరించాలని అనిపించింది. దాంతో 2001లో తిరిగి వచ్చేశాను. ముందుగా రెండు ట్రస్టు ఆస్పత్రుల్లో చేసిన తర్వాత కామినేని ఆస్పత్రి యాజమాన్యం పిలిచింది. దాంతో తొలిసారిగా ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో జెనెటిక్ విభాగాన్ని ప్రారంభించే అవకాశం నాకు లభించింది. 2006 నుంచి నేను దాదాపుగా ఏడాదికోసారి అమెరికా వెళ్లేదాన్ని. అక్కడ జెనెటిక్స్‌లో పరిశోధనలు, ఫలితాలు తెలుసుకునేదాన్ని తిరిగి వచ్చి, మన దేశంలో మన సొంత మనుషులకు దాని ప్రయోజనాలు అందించాలన్నది నా తపన. ఇక్కడ ప్రస్తుతం చాలావరకు పెద్ద ఆస్పత్రుల్లో ఉన్న జెనెటిక్ కౌన్సెలర్లు, ఈ రంగంలో ఉన్న వైద్యులు చాలామంది నా విద్యార్థులే. ఇప్పుడు దాదాపు నగరంలోని ప్రతి పెద్ద ఆస్పత్రిలోనూ జెనెటిక్స్ విభాగం ఉంది. ఇది ఇప్పుడు క్యాన్సర్ చికిత్స నుంచి కంటి చికిత్స వరకు అన్నింటిలోనూ ఉపయోగపడుతోంది. విదేశాల్లో నేర్చుకున్న పరిజ్ఞానాన్ని మన భారతీయులకు అందించడం చాలా గర్వంగా ఉంటోంది -- సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అనీ క్యూ. హసన్, జెనెటిక్స్ అండ్ మాలిక్యులర్ మెడిసిన్, కామినేని ఆసుపత్రి
డాక్టర్ అనీ క్యూ. హసన్, జెనెటిక్స్ అండ్ మాలిక్యులర్ మెడిసిన్ విభాగాధిపతి, కామినేని ఆసుపత్రి
అక్కడి విజ్ఞానాన్ని ఇక్కడ వినియోగిస్తున్నాం.
నేర్చుకోవడానికి పరిశోధనలకు అమెరికా, యుకె లాంటి దేశాల్లో చాలా అవకాశాలుంటాయి. పరిశోధన రంగంలో ఆసక్తి ఉన్న వాళ్లకి అవి ఎంతో ఉపయోగపడతాయి. అక్కడ నేర్చుకున్న విజ్ఞానాన్నే ఇప్పుడు ఇక్కడ మనదేశంలో వినియోగిస్తున్నామని డాక్టర్ వెంకటేష్ మువ్వా తెలిపారు. ఆయన హైదరాబాద్‌లో ఆర్థోపెడిక్‌లో అత్యున్నత సేవలు అందిస్తున్నారు. "
"అమెరికాలో చాలాకాలం పాటు నాన్ సర్జికల్ ఆర్థోపెడిక్స్ విభాగంలో అత్యాధునిక వైద్య సేవలు అందించిన తర్వాత.. అదే అనుభవాన్ని, అదే నైపుణ్యాన్ని మన సొంత దేశంలో, సొంత మనుషులకు కూడా ఎందుకు అందించకూడదని నాకు అనిపించింది. దాంతో దాదాపు పదేళ్ల క్రితమే ఇక్కడ రీజెన్ ఆర్థోస్పోర్ట్ క్లినిక్‌ను ప్రారంభించాం. మోకాళ్ల నొప్పులకు ఆపరేషన్లు దాదాపు అవసరం లేకుండా చాలా వరకు కేసులకు రీజనరేటివ్ చికిత్సలు అందిస్తున్నాం. ఇందుకోసం వాళ్ల సొంత మూలకణాలు (స్టెమ్ సెల్స్) సేకరించి, వాటిని మోకాళ్లు.. లేదా అవసరమైన భాగాల్లో ప్రవేశపెడుతున్నాం. దానివల్ల శస్త్రచికిత్స అవసరం లేకుండానే మంచి ఊరట లభిస్తోంది. ముందుగా క్రీడాకారులకు ఇది బాగా ఉపయోగపడింది. శస్త్రచికిత్స పేరు చెప్పి ఏళ్లతరబడి ఆటకు దూరంగా ఉండిపోయే కంటే ఈ చికిత్స నయమని ఇటు వస్తున్నారు. నేను విదేశాల్లో నేర్చుకున్న అత్యాధునిక విజ్ఞానాన్ని ఇక్కడ సొంత దేశంలో మన సొంత మనుషులకు అందిస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా, సంతృప్తిగా అనిపిస్తోంది- డాక్టర్ వెంకటేశ్ మొవ్వా, ఫౌండర్, రీజెన్ ఆర్థోస్పోర్ట్ హాస్పిటల్
అమెరికా, యుకె లాంటి వైద్య సౌకర్యాలు ఇక్కడ ప్రజలకు అందుబాటులోకి రావాలని ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఎంవీఎన్ సురేష్ అన్నారు. వైద్య సౌకర్యాలు వినియోగించుకోవడంలో అడ్వాన్స్డ్‌డ్ దేశాలతో పోలిస్తే.. ఇక్కడ అవకాశం ఎక్కువన్నారు. యు.కెలో వైద్యనికి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.. కానీ డాక్టర్‌ను కలవాలంటే కష్టం. అక్కడ డబ్బులున్నా.. డాక్టర్‌ను కలవలేరు. ఇండియాలో వైద్యం ఖర్చు ఎక్కువ. కానీ వైద్య సౌకర్యం వినియోగించుకోవడానికి వీలుంది అన్నారు.
"కొవిడ్ మొదటి వేవ్ వచ్చినప్పుడు నేను యూకే వెళ్లాను. అక్కడ ఏడాది పాటు పనిచేసిన తర్వాత, అక్కడ నేర్చుకున్న చాలా విషయాలు మన దేశానికి ఉపయోగపడతాయని, అవి మన సొంతవాళ్లకు అందాల్సిన అవసరం ఉందని అనిపించింది. దాంతో నేను చాలా తక్కువ సమయంలోనే అక్కడినుంచి వచ్చేశాను. ఇంగ్లండ్‌లో గానీ అమెరికాలో గానీ వైద్యుల వద్దకు నేరుగా వెళ్లిపోవడానికి ఉండదు. అపాయింట్‌మెంట్లు దొరకడమే ఒక్కోసారి గగనం అవుతుంది. ఇంగ్లండ్‌లో సిటిజన్‌షిప్ కార్డు ఉంటే చాలు.. వైద్యం మొత్తం ఉచితమే. కానీ, ముందుగా జనరల్ ప్రాక్టీషనర్ వద్దకు వెళ్లాలి. ఆయన రిఫర్ చేశాక సంబంధిత వైద్యుడి అపాయింట్‌మెంట్ రెండు, మూడు, ఒక్కోసారి ఆరు నెలల తర్వాత లభించినా అప్పటివరకు వేచి ఉండాలి. అమెరికాలో బీమా వ్యవస్థదే రాజ్యం. దాని ప్రీమియంలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అది ఉన్నా కూడా చాలాసార్లు వైద్యుల వద్దకు నేరుగా వెళ్లడానికి ఉండదు. మన దేశం ఆ విషయంలో చాలా నయం. ఇక్కడ ప్రభుత్వ, ప్రైవేటు వైద్యుల వద్దకు దాదాపు నేరుగా వెళ్లిపోయి, కావల్సిన పరీక్షలు చేయించుకుని చికిత్స పొందవచ్చు. అయితే ఇంగ్లండ్, అమెరికాల్లో ఉన్న అత్యుత్తమ పరిశోధన, చికిత్సా విధానాలను ఇక్కడకు తీసుకురావాలి. ఇప్పుడు యూకే నుంచి తిరిగి వచ్చేవాళ్ల సంఖ్య బాగా పెరుగుతోంది. మాతృభూమి మీద మమకారం వాళ్లందరినీ రప్పిస్తోంది. ఇది కచ్చితంగా మన దేశంలోని సామాన్యులకు మేలు చేసే అంశమే"- డాక్టర్ ఎంవీఎన్ సురేష్, ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగాధిపతి, ఆస్టర్ ప్రైమ్