YSRCP Jagan Padayatra: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాను మరోసారి పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ఎన్నికలకు ముందు పాదయాత్ర చేస్తానని అంతకు ముందే జిల్లాలలో పర్యటిస్తానన్నారు. జగన్ తాను రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఎప్పుడూ రాజీపడలేదని, భవిష్యత్తులో కూడా రాజీపడనని ప్రకటించారు. అధికారంలో లేనప్పటికీ, ప్రజల కోసం నిలబడి పోరాడుతూనే ఉంటానని వైపీపీ యూత్ వింగ్ సమావేశంలో ప్రకటించారు.
యూత్ వింగ్ సభ్యులను సోషల్ మీడియాను ఆయుధంగా ఉపయోగించి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని జగన్ పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన విధానాలను, అవినీతిని, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తోందని, అప్రజాస్వామిక విధానాలు అవలంబిస్తోందని జగన్ ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడిగా తనకు తగిన భద్రత కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అక్రమ కేసులతో YSRCP నాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు .
జగన్ కూటమి ప్రభుత్వంపై విద్యార్థులకు, యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాల కింద రూ. 6,400 కోట్ల బకాయిలు చెల్లించలేదని, దీనివల్ల విద్యార్థులు చదువు మానేసి ఉపాధి కోసం వెతుక్కోవాల్సి వచ్చిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని, దీనివల్ల ఒక సంవత్సరంలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని జగన్ పేర్కొన్నారు. ప్రజల ఆగ్రహాన్ని YSRCP బలంగా మార్చుకోవాలని, దీనికి యూత్ వింగ్ కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రజల సమస్యలను గుర్తించి, వారి పక్షాన పోరాడాలని యూత్ వింగ్ సభ్యులను జగన్ కోరారు. ప్రజల గుండెల్లో చోటు సంపాదించడం ద్వారా 2029 ఎన్నికల్లో YSRCP రికార్డు మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
యువ నాయకులకు ఇప్పుడే మంచి అవకాశం అన్నారు. ప్రభుత్వానికి భయపడకుండా ఉద్యమం చేస్తే.. వారిని పైకి తీసుకు వచ్చే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. పెరగాలన్నది మీ చేతుల్లోనే ఉంటుందని.. ఎదిగేలా తాను చేస్తానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. యూత్ వింగ్ సమావేశానికి అన్ని జిల్లాల నుంచి యువ నేతల్ని ఆహ్వానించారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, జక్కంపూడి రాజా అందర్నీ కోఆర్డినేట్ చేశారు.