ప్రపంచంలో మహమ్మారి రోగాల గురించే మనం మాట్లాడుతాం. కానీ అన్నిటికంటే ముందు మాట్లాడుకోవాల్సింది ఒత్తిడి గురించి. ఒత్తిడే ఎన్నో రోగాలకు కారణం అవుతుంది. రకరకాల ఒత్తిళ్లు మనిషి ఆరోగ్యాన్ని కుంగదీస్తున్నాయి. కొత్తగా చేసిన ఒక అధ్యయనంలో నిత్యం ఒత్తిడితో కూడిన ఉద్యోగాన్ని చేసేవాళ్లు త్వరగా డిప్రెషన్ బారిన పడతారని తేలింది. అలాంటివాళ్లు ఆ ఉద్యోగాన్ని వదిలేయడమే ఉత్తమమని, లేకుంటే మానసిక ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. వారంలో 45 గంటలకు మించి పని చేసే వారిలో, ఒత్తిడి అధికంగా ఉంటున్నట్టు గుర్తించారు. కొంతమంది అధిక సంపాదన కోసం వారానికి 90 గంటలు పని చేస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. వారిలో మానసిక సమస్యలు త్వరగా వస్తున్నట్టు తేలింది. 


దాదాపు 11 ఏళ్ల పాటు పరిశోధన చేసి మరీ, మిచిగాని యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తేల్చారు.  ఈ అధ్యాయం 17వేల మంది వైద్య విద్యార్థులపై 11 ఏళ్లపాటు నడిచింది. వైద్య విద్య కష్టతరమైనది. ఒత్తిడి కూడా అధికంగానే ఉంటుంది. అదనపు గంటలు పని చేయాల్సి వస్తుంది. అందుకే ఈ అధ్యాయం కోసం వారిని ఎంపిక చేసుకున్నారు శాస్త్రవేత్తలు. చదువుకోవడానికి, నేర్చుకోవడానికి, ఆసుపత్రిలో పనిచేయడానికి వారంలో ఎక్కువ గంటలు కేటాయిస్తారు. ఇలా రోజుల తరబడి ఎక్కువ గంటలు పనిచేయడం వారిలో డిప్రెషన్ లక్షణాలను పెంచినట్టు గుర్తించారు.  డిప్రెషన్ రావడానికి ముందు చికాకు, కోపంలాంటివి ఎక్కువవుతాయి. అవి ఎక్కువ అవుతున్నాయంటే అర్థం... త్వరలో మీరు డిప్రెషన్ బారిన పడుతున్నారని.


 డిప్రెషన్ అనేది ఒక తీవ్రమైన మానసిక వ్యాధి. ఇది వ్యక్తి ఆలోచనలను, ప్రవర్తనను కూడా తీవ్రంగా మార్చేస్తుంది. వారిలో ఆత్మహత్యా ఆలోచనలను పెంచుతుంది. అయితే స్త్రీల కన్నా పురుషులే త్వరగా డిప్రెషన్ బారిన పడే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. మహిళలు మనసులో ఉన్న విషయాలను, భావాలను బయటకు పంచుకుంటారు. వారి సామాజిక జీవన పరిస్థితులు అందుకు అనుగుణంగా ఉంటాయి. కానీ పురుషులు తమ బాధను, భావాలను, భావోద్వేగాలను అణగదొక్కుకుంటారు.దీనివల్లే  వారు త్వరగా డిప్రెషన్ బారిన పడుతుంటారు అని చెబుతున్నారు అధ్యయనకర్తలు. తలనొప్పి, వెన్నునొప్పి, నిద్రలేమి, లైంగిక సమస్యలు, లైంగిక జీవితం పై ఆసక్తి తగ్గిపోవడం ఇవన్నీ కూడా పురుషుల్లో డిప్రెషన్ వస్తుంది అని చెప్పడానికి సంకేతాలు.


Also read: మొదటి ప్రపంచ యుద్ధంలో ఈ స్వీటు కోసం పట్టుబట్టిన సైనికులు, ఏమిటీ తీపి పదార్థం?











గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.