కరోనా వ్యాక్సిన్ ల తయారీలో భారత్ స్పీడు పెంచింది. ఇప్పటికే దేశీయంగా తయారైన కొవాగ్జిన్ టీకా పంపిణీ చేస్తుండగా.. ఇటీవల జైకోవ్-డీ కి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. తాజాగా మరో పురోగతి సాధించింది. ఎంఆర్ఎన్ఏ సాంకేతికతతో దేశీయంగా రూపొందించిన తొలి కొవిడ్ వ్యాక్సిన్ సురక్షితమని తాజా ప్రయోగాల్లో తేలింది. దీంతో ఈ టీకాపై రెండు, మూడో దశల ప్రయోగాలను కొనసాగించేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.






సురక్షితమే..


పుణెకు చెందిన జెన్నోవా బయోఫార్మా కంపెనీ HGCO19 ఎంఆర్ఎన్ఏ ఆధారిత టీకాను రూపొందించింది. ఈ వ్యాక్సిన్ పై జరిపిన ప్రయోగ ఫలితాలను కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీసీఎస్ఓ)కు అందజేసింది. ఈ ఫలితాలను సబ్జెక్ట్ నిపుణుల కమిటీ విశ్లేషించి.. ఈ టీకా సురక్షితమేనని తేల్చింది.


తొలి దశ ప్రయోగాలు సురక్షితమని తేలడంతో రెండు, మూడో దశల క్లినికల్ ట్రయల్స్ పై సంస్థ దృష్టి పెట్టింది. అమెరికాకు చెందిన ఫైజర్- బయోఎన్ టెక్, మోడెర్నా తయారు చేసిన టీకాలు ఎంఆర్ఎన్ఏ విధానంలోనే అభివృద్ధి చేశారు.


జైకోవ్-డీ..


గుజరాత్‌కు చెందిన ఫార్మా దిగ్గజం జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్‌-డీ.. ప్రపంచంలోనే డీఎన్‌ఏ ఆధారంగా తయారైన తొలి కొవిడ్‌ టీకా. ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఇటీవల అనుమతించింది.


12 ఏళ్ల వయసు దాటిన పిల్లలకు కూడా ఈ వ్యాక్సిన్ వేయొచ్చు. ఈ టీకా మొత్తం మూడు డోసులుగా ఇస్తారు. మొదటి డోసు వేసుకున్న 28వ రోజు సెకండ్ డోస్ తర్వాత 56వ రోజు మూడో డోసు వ్యాక్సిన్ ఇస్తారు.

 

దేశంలో అత్యవసర వినియోగం అనుమతి పొందిన ఆరో కరోనా వ్యాక్సిన్ ఇది. రెండో దేశీయ టీకాగా గుర్తింపు పొందింది. మొదటి దేశీయ టీకా కొవాగ్జిన్.