Covid Vaccination:


భారత్ మరోసారి చరిత్ర సృష్టించింది: ప్రధాని మోదీ


వ్యాక్సినేషన్‌లో తక్కువ సమయంలోనే భారత్ రికార్డు సృష్టించింది. 18 నెలల సమయంలోనే 2 వందల కోట్ల డోస్‌ల టీకాలు అందించింది.ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించిన భారత్, ఇంత తక్కువ వ్యవధిలోనే ఎక్కువ మందికి టీకాలను చేరువ చేసింది. ప్రపంచ దేశాల్లో మళ్లీ కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది కేంద్రం. ఆసియా దేశాల్లో జపాన్‌లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. అంతర్జాతీయంగా చూస్తే ఫ్రాన్స్‌లో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. భారత్‌లో ప్రస్తుతానికి తీవ్రత కనిపించకపోయినా, కేసుల సంఖ్య పెరగకుండా ముందుగానే నియంత్రించాలని భావించింది కేంద్రం. అందుకే ఇటీవలే బూస్టర్ డోసులను ఉచితంగా అందించే క్యాంపెయిన్‌నూ ప్రారంభించింది. ఈ తరుణంలోనే 2 బిలియన్ డోసుల రికార్డు సాధించింది. ఈ రికార్డుపై ప్రధానినరేంద్ర మోదీ ట్విటర్ ద్వారా స్పందించారు. "భారత్ మరోసారి చరిత్ర సృష్టించింది. 2 వందల కోట్ల డోసుల మైలురాయి దాటినందుకు భారత ప్రజలందరికీ అభినందనలు. వ్యాక్సినేషన్‌ ద్వారా కొవిడ్‌పై సమర్థవంతమైన పోరాటం సాగించాం"  అని ట్వీట్ చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ కూడా ట్విటర్‌లో అభినందనలు తెలిపారు.









 


బూస్టర్ డోసుల్లో మాత్రం వెనకబాటు..


భారత్ ఈ రికార్డు సాధించినప్పటికీ..బూస్టర్ డోసుల విషయంలో మాత్రం ఇంకా సాధించాల్సింది చాలానే ఉంది. దేశ జనాభాలో కేవలం 8% మంది మాత్రమే బూస్టర్ డోస్ తీసుకున్నట్టుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే జులై 15వ తేదీ నుంచి 75 రోజుల ఉచిత బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించింది కేంద్రం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఈ క్యాంపెయిన్‌ను చేపట్టినట్టు వెల్లడించింది.